18, జులై 2011, సోమవారం

నగరంలో ఒక ఉదయం













పరుగు చక్రాలు పాదాలకు తగిలించి 
రోజూ లాగే బయల్దేరిన నగరం
ఏ కూడలి దగ్గరో ఆకస్మికంగా 
కాసేపు ఆపివేయబడుతుంది

భుజమ్మీద కండువాలతో, నగ్న పాదాలతో 
దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో 
ప్లకార్డులు, జెండాలు పట్టుకున్న
పల్లెటూరి నాగళ్ళు కొన్ని 
కూడలి రోడ్ల మీద కూర్చుని 
ధర్మాగ్రహ నినాదాలై రెపరెపలాడుతుంటాయి... 

కూడలి దగ్గర ఆగిన నగరం
రవంత తొంగి చూసి, వెను వెంటనే 
అసహన వాహన హారన్లై అరుస్తుంది
నినాదాల హోరులో అరుపులు ఆవిరై పోతాయి...

ఇక ఇపుడపుడే కదల్లెమని గ్రహించి
జ్ఞాని ఎవరో తర్కం అందుకుంటాడు...
"ఈ కూడలిలో నిలబడి 
సంధించే ప్రశ్నలు...ప్రకటించే నిరసనలు
గాలిలో కలిసిపోవడమే తప్ప
గమ్యానికి చేర్చవని
ఈ మట్టి బుర్రలకు తట్టదా?"

కూడలి మీది మనుషుల గుంపుని చేదించి
ముందుకు దూక ప్రయత్నించి
విఫలమైన సాహసి వొకడు అంటాడు..
"పనీ పాటా లేని పల్లె
పొద్దున్నే నగరంలోకి జొరబడి
విలువైన నగర సమయాన్ని ద్వంసిస్తోంది" 

జ్ఞానులారా!...సాహసులారా!!
కాసేపు మన అసహన కుబుసాల్ని వొదిలి
అల్లంత దూరాల నుండి
తమ బాధల మూటలు మోసుకొచ్చి 
ఈ కూడలిలో విప్పి పరచిన 
మట్టి మనుషుల గోడు ఏదో వినలేమా....?

పొలమూ...విత్తనాలూ...ఎరువులూ...
ఆకాశం దయతో కురిసే వర్షమూ తప్ప 
మరో లోకం లేని వాళ్ళు కదా
తమ లోకం విడిచి
ఈ నగర మాయాలోకంలోకి 
యిట్లా బాధల మూటలతో 
వాళ్ళు మాత్రం ఇష్టంగా వస్తారా?

ఊళ్ళని మైక్రో బ్రోకర్ భూతాలకీ
నల్ల బజారు ఎరువుల, విత్తనాల దెయ్యాలకీ వొదిలి 
అక్కడ బురద మట్టిలో శ్రమించే కాళ్ళూ చేతుల 
రాతల్ని నిర్ణయించే రావణ శిరసులు మాత్రం 
నగరంలో కొలువై వున్నాక
ఇక్కడికి కాక మరెక్కడికి వెల్లమంటారు?

తాము దయతో పండించే 
తిండిగింజల్ని తిని 
వెర్రి పరుగులు తీసే ఈ నగరం
కాసింతయినా కరుణ చూపిస్తుందని కదా
ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది...

జ్ఞానులు ఎవరయినా  వాళ్లకు తెలియజేయండి...
ఈ నిర్దయ నిర్లజ్జ నగరం 
తన రాకాసి బాహువులు చాపి
మిగిలిన మీ మీ పొలాలని కూడా
అనకొండలా మింగివేయబోతోందని...

ఏదో వొకనాడు
మళ్ళీ ఈ నగరమంతా
మట్టి పాదాల మీద మోకరిల్లి 
"ఇక ఈ నేల నేలంతా మీదే...
మాకు కొన్ని తిండి గింజల్ని ప్రసాదించండి"
అని చేతులు జోడించి ప్రార్థించే రోజొకటి వొచ్చేవరకు....
ఫరవాలేదు....
ఈ అసహన హారన్ లను మోగించండి....
బిగ్గరగా....మరింత బిగ్గరగా....

[courtesy : ఆంధ్రజ్యోతి - నవ్య దీపావళి సంచిక-2010 ]

5 కామెంట్‌లు:

కెక్యూబ్ వర్మ చెప్పారు...

మట్టి మనుషులపట్ల వుండాల్సిన బాధ్యతను గుర్తెరగ చేసారు సార్....ధన్యవాదాలు...

dhaathri చెప్పారు...

very serious poem it disturbs and makes the reader think.....love j

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@వర్మ గారు...ఇది నాకు నేను గుర్తుచేసుకోవడం కోసమే ....
@జగద్ధాత్రి గారు..ధన్యవాదాలు.....ఏ చదువరి అయినా ఇది చదివి...ఇలాంటి దృశ్యం ఎదురయినపుడు...ఆ రైతుల పట్ల వోకింత జాలితో కాస్త సహనంగా వుంటే ...అంతకన్నా కావలసింది ఏముంది?

Afsar చెప్పారు...

vijay, kavita baagundi. avunu, asahanam perigipotondani baadhapadipotunnam kaani, enduku aa asahanam perugutundo kaaranaalu vetike pani pettaaru ee kavitalo...

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@afasr...thanku...