26, మే 2013, ఆదివారం

రాత్రే కదా...

 రాత్రే కదా... 

పగలే కాదు .... రాత్రి కూడా
వొకటి ఉందన్న చేదు  నిజం
రాత్రయ్యాకే గుర్తుకొస్తుంది

రాత్రి తీరం లో నిదుర లంగరు
వేయాల్సిన తంతుని సూచిస్తూ
ఏడ్చే శునకాలూ.... నిశ్శబ్దమైన వీధులూ

గాయపడిన క్షణమొకటి జ్ఞప్తికి వొచ్చి
మూసిన కనుల పైన కత్తుల కోలాటం ఆడుతుంది
గాయపడినపుడు ఉబికిన రక్తపు తడి ఏదో
మేను వాల్చిన పక్క పైన ముళ్ళ వలె గుచ్చుకుంటుంది

పగలంతా మనుషుల నడుమ
మనుషుల సంభాషణల నడుమ
ఎలాగో ఒకలా తప్పించుకున్నా
రాత్రికి గుండెని చేరిన గాయం మెలిపెడుతుంది

తెరలన్నీ ఒకటొకటే తొలగిపోతూ
తెలిసిపోతూ వుంటుంది లోలోపల ....
నిజమని నమ్మిన ప్రేమలూ, అనుబంధాలూ
అహం గీత దగ్గరే తేలిపోయే దూది పింజలని

ఎవరిని నిందించ డానికీ మనసొప్పదు
పొరపాటు ఎవరిదో అంతు పట్టదు
ఎంత ప్రయత్నించినా రాయిలా మారని
మనసు రోదించడం మానదు

'ఇక్కడిదాకా ఈదుకుంటూ వొచ్చాము
ఇక ఇక్కడ విశ్రమిద్దామని' అనుకునేలోగా
థ్రిల్లర్ మూవీ లోని 'ఇంటర్వెల్ బ్యాంగ్' లా  
జీవితం ఏడు  పడగల నాగుపామై బుసలు కొడుతుంది

ఇక అప్పుడు ఏం చేస్తాము
నువ్వయినా , నేనయినా

రక్తపు తడిలో తడిసిన
నాలుగు కవిత్వ పాదాలని
నీలాంటి, నాలాంటి నలుగురితో
ఈ రాత్రి తీరంలో ఇలా  పంచుకుంటాము
పండగ చేసుకుంటాము








18, మే 2013, శనివారం

ఒక పరిచయస్తుడి గురించి .....


నాకు పరిచయమున్న మనిషి ఒకడున్నాడు
అతడు తన కెమెరా తో కొన్ని ఫోటోలు తీసాడు
గదిలో అప్పటిదాకా తను ప్రేమించిన స్త్రీని కాకుండా
గది కిటికీలో నుండి కనిపించే దృశ్యాలని 

(హీబ్రూ కవి 'ఎహూదా అమిహాయ్' కవితకు అనువాదం)
18 మే 2013

13, మే 2013, సోమవారం

డబ్బులూ- జీవితమూ-ఒక కొప్పర్తి పద్యం....


డబ్బులూ- జీవితమూ-ఒక కొప్పర్తి పద్యం....
'కవులేం చేస్తారు?' అని అప్పుడెప్పుడో శివారెడ్డి గారు ఒక అద్భుతమైన పద్యం రాసారు...
'ప్రజల చేతుల్లో అనంత శక్తివంతమైన పద్యం పెడతారు' అన్న వాక్యంతో ఆ పద్యం పూర్తవుతుంది
డబ్బు సంపాదనలో విరామం ఎరుగక పరుగెత్తుతున్నపుడు, జీవితానికి సంబంధించి ఎక్కడో ఏదో లంకె తెగిపోతున్న బాధ మిమ్మల్ని కమ్మేసినపుడు, అలాంటి ఒక శక్తివంతమైన పద్యాన్ని మీ చేతుల్లోకి తీసుకోండి ! 'జీవించడం' అంటే 'డబ్బులు సపాదించే క్షణాలు' గా లెక్కలు వేసే కాలం లో, 'డబ్బుల్లేకపోవడం  ఎంతగా  బాగుండదో, అంతగా బాగుంటుందని’ తెలియజెప్పే ఈ కొప్పర్తి 'భయద సౌందర్యం' పద్యాన్ని ఒక సారి చదవండి....  

'డబ్బుల్లేకపోవడం
ఎంత బావుండదో అంత బావుంటుంది
జీవితం కళ అవ్వడం డబ్బుల్లేనపుడే సాధ్యపడుతుంది'

పద్యం ఎత్తుగడ లోనే 'నిజమే...డబ్బుల్లేకపోవడం ఇబ్బందిగానే వుంటుంది ' అని కవి ఎలాంటి భేషజాలూ లేకుండానే  ఒప్పుకుంటూ, అలా డబ్బుల్లేకుండా బతికిన రోజుల్లోనే సాధ్యమయే జీవన సౌదర్యాన్ని దర్శించమని చెబుతున్నాడు

ఇంతకీ,   'ఎంత బావుండదో/ అంత బావుంటుందిఅని  అంటున్నాడు ఎందుకు ?

'సిటీ బస్సెక్కడం  మానేసి మూడు మైళ్ళు నడిచి
మిగిల్చిన రూపాయి పెట్టి ఆమెకు మల్లెపూలు కొన్నపుడు
వాటి చల్లదనమూ తెల్లదనమూ
కందిన అరికాళ్ళని   వెన్నముద్దల్ని చేస్తాయి
..............................................
పొరుగూరు వెళ్ళినపుడు భోజనానికి బదులు రెండిడ్లీ తిని
మిగిల్చిన డబ్బులతో కొన్న లక్క పిడతల్లో
పాప ఉత్తుత్తి భోజనం వండి పెట్టినపుడు
మిగిలిన ఆకలి నిజంగా తీరుతుంది'
 కవీ!...ఇదంతా సరే గానీ, డబ్బుల్లేని  కాలం భయపెట్టిన రోజుల మాటేమిటి?

'పచారీ సరుకుల లిస్టు లోంచి
కొన్ని పదాల్ని తొలగించి కొన్ని అంకెలని కుదించాల్సి వచ్చినపుడు మాత్రం
కవిత్వం అస్పష్టమై జీవితం సంక్లిష్టమౌతుంది

ప్రతి నెలా మొదటి తారీఖు
ఒక భయద సౌందర్య మూర్తయి ఆహ్వానిస్తుంది
.........................................
ఒక్క సారి ఎగిరి అవతలి నెలలో పడాలనిపిస్తుంది
లేదూ, ఒక్క నెల, ఒకే ఒక్క నెల
జీవితాన్ని నిలిపివేయాలనిపిస్తుంది'   

ఇంతకు క్రితం దాకా డబ్బుల్లేని రోజుల్లో దర్శించగలిగిన అందమైన కవిత లాంటి  జీవిత సౌందర్యాన్ని గురించి చెప్పిన కవి,  పద్యం ప్రారంభం లోనే 'డబ్బుల్లేకపోవడం ఎంత బాగుండదో ' అని  చెప్పిన మాటకు కొనసాగింపుగా 'ప్రతి నెలా మొదటి తారీఖు భయద సౌందర్య మూర్తిలా ఆహ్వానిస్తుందనే జీవన వాస్తవాన్ని చెబుతున్నాడు ....
 సాధారణంగా, ఒక కవిత మొదటి 'డ్రాఫ్ట్ ' పూర్తి అయిన తరువాత, మరింత మెరుగైన పద్యం కోసం కొన్ని (అనవసరం అని భావించిన) పదాలని తొలగిస్తాము .... కానీ, ఆదాయానికీ, సంపాదనకూ పొంతన కుదరని మధ్య తరగతి జీవితంలో నెల లోని మొదటి తారీఖున పచారీ కొట్టు లిస్టు లోంచి కొన్ని పదాలని తొలగించవలసి వొస్తే?... జీవితం లోని సౌందర్యమయ క్షణాలని చూపించే డబ్బుల్లేని తనం, మొత్తంగా జీవితాన్నే తిరస్కరించే దిశకు కూడా నెడుతుందని ఎంత బాగా చెప్పాడు కవి!

డబ్బుల్లేని రోజులు భయద సౌందర్యంతో ఎదురయినా సరే, కవి ఎందుకు డబ్బుల్లేని రోజుల్లోని జీవన సౌందర్యాన్ని గురించి ఇంతగా చెబుతున్నాడు?

'గుండెకూ ప్రపంచానికీ మధ్య
చొక్కా జేబులో వుండే డబ్బే అడ్డుపడుతుంది
ఖాళీ జేబులోంచి గుండె
ప్రపంచాన్ని స్పష్టంగా చూస్తుంది'


ఖాళీ జేబులతో తిరిగిన రోజుల్లోనే అర్థమవుతాయి ……
లెక్కల్లో మునిగిన లోకం , మనకు ఎంత లెక్క కట్టిందన్న చేదు నిజం …..
కరెన్సీ   దొంతరల్లేని ఖాళీ జేబుల గుండెల్ని నిష్కల్మషంగా హత్తుకునే ఒకటీ , అరా మనుషుల్ని  గుర్తించ గలిగామన్న తీపి నిజం!

'ఎప్పటికైనా
డబ్బు సంపాదించడం లో వెనకే వుండడం మంచిది
జీవిత తత్వాన్ని నిలుపుకోవడం మంచిది
పడగలెత్తడం కోసం పరుగులెత్తిన వాళ్ళు
పరుగెత్తీ, పరుగెత్తీ  అలసిపోయి , ఒక నాటికి
పోగొట్టుకున్న దానికోసం వెనక్కి తిరుగుతారు'

చలం 'జీవితాదర్శం' లో, 'జీవితాదర్శం శాంతి ' అన్నగొప్ప సత్యం, జరగవలసిన ఉపద్రవాలన్నీ జరిగిపోయాక, నవల చివరలో చెబుతాడు…
మరి, విరామం ఎరుగక 'పడగలెత్తడం కోసం పరుగులెత్తే పరుగులో 'డబ్బే సర్వస్వం కాదన్న' జీవిత తత్వం బోధపడేది ఎప్పుడు?....
పరుగు పందెం లో కొనసాగే శక్తులు పూర్తిగా ఉడిగిపోయిన వార్ధక్యం లోనా?
ఇక అప్పుడు మిగిలేది ఏముందని?....అదేదో ముఖేష్ పాటలో చెప్పినట్టు 'బుడాప దేఖ్ కె రోయా ' అని ఏడవడం తప్ప!
అందుకే, పరుగు మధ్యలో కొంచెం తీరిక చేసుకుని ఇలాంటి ఒక పద్యాన్ని చేతుల్లోకి తీసుకోండి … తెగిపోతున్న లంకెని అతికించండి !

పోస్ట్ స్క్రిప్ట్
కొప్పర్తి 'భయద సౌందర్యం ' అన్న కవితని 1996 సంవత్సరం లో రాసారు. అంటే, దాదాపు 17 సంవత్సారాల క్రితం ..... అంటే, ప్రపంచం కొత్త మిలీనియం లోకి ప్రవేశించక మునుపు.... జీవించి వుండడం అంటే, కాలాన్ని కాసులుగా మార్చడం అన్న ఒక దుర్మార్గమైన విలువ మన జీవితాల లోకి ప్రవేశించక ముందు కాలం .....
ఇవాళ మరింత అమానవీయంగా, డబ్బుల కోసం కన్నవాళ్ళనీ, కట్టుకున్న వాళ్ళని కూడా కడతేర్చే కాలంలో, కొప్పర్తి మరొక పద్యం రాస్తే అది ఎలా వుంటుంది అని ఒక చిన్న ఆసక్తి నాకు!


(ప్రచురణ: వాకిలి ఈ పత్రిక ఏప్రిల్ 2013)