20, ఆగస్టు 2012, సోమవారం

నాస్తెంకా*




   'ప్రేమ అంటే యేమిటి?'
   'నీవు ఎక్కడో వేల యోజనాల దూరంలో వున్నా
   నీ గురించిన ఆలోచనల్లో నేను ఉక్కిరి బిక్కిరై పోవడం ....
   నిన్ను తప్ప మరి దేన్నీ ఊహించలేక పోవడం....'

* * * *
రోడ్డు పక్కన వీధి దీపాలు దహించుకు పోతూ వుంటాయి
చల్ల గాలికి కొంకర్లు తిరిగి పోతోన్న కుక్క పిల్ల వొకటి
మరింతగా ముడుచుకు పోయి వుంటుంది
గడియారపు ముళ్ళకు చిక్కుకున్న చూపులు
రాత్రంతా అంతు లేని ఆలోచనలై తిరుగుతూ వుంటాయి....

'కాహే - కోయల్ షార్ మచాయేరే మోరే
అప్నా కోయి యాద్ ఆయేరే'
శంషాద్ బేగం** విరహ వీచిక
అగరు బత్తి పొగలా మత్తుగా అల్లుకుంటుంది
అల్లుకునే పాట  నడుమ
అలా వొక్కడినే  చిక్కుకుపోయినపుడు
అకస్మాత్తుగా పుస్తకాల షెల్ఫు లోంచి దిగివొచ్చిన
నాస్తెంకా తో సంభాషణకు దిగుతాను

                           "ప్రేమించబడడం అంటే యేమిటి నాస్తెంకా?"

'మంచు కురిసే శీతాకాలపు పౌర్ణమి రాత్రి
వొక సరస్సు వొడ్డున కూర్చుని
వెన్నెలనంతా నీ కౌగిట్లోకి వొంపుకోవడాన్ని వూహించ గలవా?'

                     "క్షమించు... వూహించలేకున్నాను"

"ఒక వేసవి కాలపు మధ్యాహ్నం
అందరూ వేడి గాలుల నడుమ కాలి పొతున్నపుడు
మేఘాలు దయతో నీ వొక్కడి మీదే కురిసిన వర్షాన్ని
అపురూపంగా దోసిట్లోనూ, కనుపాపల్లోనూ, నాలుక మీదనూ
దాచుకోవడాన్ని ఊహించాగలవా ?"

                  "లేదు- ఊహించ లేను"

"మట్టిలో నీవు సుకుమారంగా నాటి
నీరు పోసి, మమకారంతో  పెంచిన పూల మొక్క
వొకనాడు ఆప్యాయంగా నీకో పూవుని అందించడాన్ని ఊహించ గలవా?"

          "లేదు- ఊహించ లేను...
           ఊహలు కూడా భయపెడతాయి నన్ను
           శ్రమించడమూ-శరా ఘాతాల నుండి తప్పించు కోవడమే
           నేర్చుకున్న యంత్ర జీవితం,
          ఊహలు కలలుగా మారతాయనీ
          కలలు ఒకనాడు భస్మమై దుక్కాన్ని మిగుల్చుతాయనీ కలవర పరచింది ....
          వూహలు, వూహలు గానే మిగిలి
          గొంతు కిందే అడిమిపట్టిన అనుభూతులైనాయి
          ప్రేమ...ఒక చేరువ కాని ఒయాసిస్సు నాకు"

ఒక మెరుపు తీగని తన చేప కన్నుల వెనుక
రహస్యంగా దాచి, ఆమె అడిగింది-

"ప్రేమించబడడం సరే... ప్రేమించ గలవా నువ్వు?
నేను నా పురా స్మృతుల్లో జీవిస్తునానని
చెప్పినా ప్రేమించ గలవా నువ్వు?
ప్రేమానుభూతి వొక్క సారే కలుగుతుందని
చెప్పినా సరే, ప్రేమించగాలవా నువ్వు?
నిన్ను నేను ప్రేమించకపోయినా
నన్ను ప్రేమించ గలవా నువ్వు?"

                "ప్రేమించగలను ......
                అవ్యక్త అనుభూతుల్ని బయటకు లాగి 
                వొక జలపాతమవాలని వుంది 
                జలపాత సంగీతంతో నిన్ను మురిపించాలని వుంది 
                నన్ను నేను విడుదల చేసుకోవాలని వుంది 
                శీతాకాలపు పొర్ణమి రాత్రి వెన్నెలనీ 
                మేఘాలు దయతో కురిసే వర్షాన్ని దాచుకోవదాన్నీ 
                నీవు నా చేయి పట్టుకుని, 
                వొకింత ప్రేమతో చూపించే మధుర క్షణం కోసం 
                ఎన్నాళ్ళయినా యెదురు చూడాలని వుంది..."

నా అరచేతిని మెత్తని తన అర చేతి లోకి తీసుకుని 
ఒక రహస్య దరహాస రేఖని పెదాల మీద ధరించి 
నాస్తెంకా నిష్క్రమించింది 
* * * *

'ప్రేమ అంటే ఏమిటి?'
.........................
'ఒక్క నిన్ను తప్ప 
మరి దేన్నీ వూహించ లేకపోవడం'

('ఆక్వేరియం లో బంగారు చేప' సంకలనం నుండి ....మే నెల - 2000 సం.  ఆదివారం ఆంద్రజ్యోతి )

* నాస్తెంకా - దోస్తవిస్కి 'శ్వేత రాత్రులు' కథ లోని అమ్మాయి పేరు 
** శంషాద్ బేగం-పాత తరం హిందీ సినిమా గాయని 


 

5, జులై 2012, గురువారం

పేదవాడి ప్రేమ పాట


నేల విడిచి గాల్లోకి తెలిపోవడాలు  వుండవు 
ప్రపంచం పంచరంగుల్లో కన్పించడాలు వుండవు 
పేదరికం పురా వీణ తంత్రులు
అప శ్రుతుల ఆకలి ప్రకంపనల్నే తప్ప 
శృతి చేసుకుని ఒక వలపు గీతాన్ని వినిపించలేవు 

ఉదయం లేచింది మొదలు 
జ్ఞానేంద్రియాలన్నీ ఆకలి కేంద్రాలై 
నాలుగు మెతుకుల కోసం గానుగెద్దయ్యేవాడికి 
రాత్రుళ్ళు గాయాల్ని తడుముకుని తల్లడిల్లడమే  తప్ప  
ప్రేమ కలల పల్లకీలో వూరేగి పోవడాలు వుండవు 
పేదరికం కారుమేఘాలు 
ఆకలి వురుముల్నీ, అసహనం మెరుపుల్నీ తప్ప 
దారి తొలగి వలపు వెండి వెన్నెల్ని కురిపించవు 

కరెన్సీకి కరువు లేని కథానాయకుడు 
దేశాల సరిహద్దులు దాటి కథానాయికని చేరడం 
కమనీయ వెండి తెర కథవుతుంది 
చప్పట్లుండవు ...విజిల్లుండవు 
కలవారి ప్రేమకతలకే తప్ప 
నిరుపేదల ఆకలి వెతలకు 
బాక్సాఫీసు దగ్గర కనక వర్శాలుండవు .....

అన్నమ్ముద్దకు తప్ప 
అందమైన చిరునవ్వుకు చలించని వాడినీ 
జీవిత పటంమీద విరక్తి సంతకమైన వాడినీ 
ఏ రాసానుభూతులూ రక్తి కట్టించవు 

తొలిచూపుల పల్లవింపులు వుండవు 
అద్భుత గమకాల చరణాలు వుండవు 
అరుదుగా గుండె అట్టడుగు పొరల్ని 
పెగల్చుకు వొచ్చినా 
పేదవాడి ప్రేమపాటని 
ఎవరూ హర్షించరు ......
రచనా  కాలం :    29  ఏప్రిల్   1996 
("వాతావరణం" సంకలనం నుండి) 

18, మార్చి 2012, ఆదివారం

డైరీ లో చివరి పేజీ



ఏ సన్నాయి రాగమూ స్పర్శించని 
వొంటరి గాలి తెమ్మెరలా  
ఏ పరిచిత పలకరింపు కెరటమూ  స్పృశించని 
యేకాకి ప్రేక్షక నౌకలా
పచ్చని సందడి దృశ్యాలన్నీ  కళ్ళ రెటీనాలపై
తడిసిన సన్నివేశంలో 
నిలువెత్తు దుక్కాశ్రువు వై సమూహం లో నీవు 
ఎందుకు ప్రేమించి వుంటావు?   





ఎంత నిశ్శబ్ద ప్రవేశం 
ఎంత నిర్దయ నిష్క్రమణ
తన ప్రవేశ, నిష్క్రమనల నడుమ 
రంగుల ఇంద్రధనుసు నీ మనసు
అంతిమంగా 
దుక్కించడానికి ప్రేమించి వుంటావు 





అన్ని పేజీలనీ రంగుల కలలతో 
నింపుకున్న డైరీ లో 
మాటలు కరువైన ఖాళీతనంతో
చిట్ట చివరి పేజీ 
బహుశా 
నిన్ను నువ్వు ఆవిష్కరించుకోవడానికే
తనని ప్రేమించి వుంటావు 

--'వార్త ': 28 -12 -1999   

16, మార్చి 2012, శుక్రవారం

సగమే







సగమే

సంపూర్ణ ప్రేమ కోసం తపించి, తపించీ
సగాన్ దాకా ప్రయానించీ, దేహమ్మీద
'NOT  SATISFIED ' సంతకం చేసి వెళ్ళే ఆత్మ వొకటి


పున్నాగపూల బాట మీద
వెన్నెల కురిపించే సగం చందమామ


సగం రాగాన్ని తంత్రుల్లోనే దాచుకుని 
మిగతా సగాన్ని ఆలపిస్తూ
శూన్యంలో వ్రేలాడే వాయులీనమొకటి

అతడే అడుగుతాడనుకుని ఆమే
అడిగితే బాగోదనుకుని అతడూ
సంకోచ, వ్యాకోచాల వడపోతలో
సగం-సగం ముక్కలైన మాటలు
అర్థాలను కోల్పోయీ .....
యిద్దరి నడుమా రాలిపోయీ....

రెండు హృదయ కవాటాల్లో
వొకటే పూర్తిగా తెరుచుకుని
ప్రవహించిన ప్రణయ తరంగిణి కాస్తా
ప్రళయ కాలపు వానై, వరదై ముంచెత్తీ ....

అర్థ రాత్రి సగం నిద్రలో
సగం-సగం తెగుతోన్న
కలల అలల తో పాటు ముందుకీ...వెనక్కీ...

* * * * *

నిజమే...ఎవరన్నారో గానీ
సగం దాకే సాగి, ఆగిపోయిన ప్రేమలదే
అసలైన సౌందర్యం
['వార్త ఆదివారం: 03 -05 -1998 ]
 

15, మార్చి 2012, గురువారం

కొందరు నాన్నల కోసం

కొందరు నాన్నల కోసం 

ఫ్యాను రెక్కల గాలి శబ్దం తప్ప
అంతా  నిశ్శబ్దంగా వుంటుంది...
అమ్మ లాంటి అమ్మలూ, నా లాంటి పిల్లలూ తప్ప 
వీధిలోని ఇళ్ళన్నీ నిద్రలో వుంటాయి
గోడ మీది గడియారం గుడ్లగూబ 
పన్నెండు సార్లు అరుస్తుంది
తన యూకేజి హోం వర్క్ జ్ఞాపకం వొచ్చి 
నిద్దట్లో ఉలిక్కి పడి లేచిన తమ్ముడి వీపు మీద
అమ్మ నిశ్శబ్ద జోల పాటై సాగుతుంది
కళ్ళు విప్పి, కిటికీ లోంచి జాలువారిన 
వెన్నెలని దోసిట్లోకి తీసుకుని 
అమ్మ తల తిప్పక ముందే 
గబుక్కున దుప్పటి కప్పుకుంటాను
గది లోని జీరో వాట్ బల్బులా అమ్మింకా నిద్ర పోలేదు

నాన్నింకా ఇంటికి రాలేదు 
ఆదివారాలు తప్ప మాకు కనిపించని నాన్న 
ఏదడిగినా ఎరుపెరుపు కళ్ళతో 
మొహం చిట్లించుకు మాట్లాడే నాన్న 
రాత్రి ఎపుడైనా దగ్గరకొచ్చి  ముద్దు పెడితే 
వికారపు వాసనేసే నాన్న 
.... నాన్నింకా ఇంటికి రాలేదు 

అమ్మలు ఆఫీసుల్నించి సాయంత్రాలే వొచ్చేసినా
నాన్నలింత రాత్రి దాకా ఆఫీసుల్లో ఏం చేస్తారు?
అడిగితే అమ్మ డ్యూటీ అంటుంది
రోజీ మాత్రం నాన్నలు బారుల్లో వుంటారని అంటుంది

అమ్మ జోలపాట తమ్ముడి వీపు మీంచి 
కాసేపు నా వీపు మీదకు చేరుతుంది 
కళ్ళు కొంచెం మూత పడగానే కాలింగ్ బెల్ మోత ...
మంచం దిగిన అమ్మ వడి వడి అడుగుల శబ్దం 
నా గుండెల్లో ప్రతిధ్వనించి నిద్ర పొర కరుగుతుంది 
ఇంట్లోకి నాన్న కన్నా ముందు చేరే వికారపు వాసన

అమ్మ భుజం మీద వాలి, తూలుతో నడిచే నాన్న
మాటల్ని ముద్దలుగా రాల్చడం ...
వెక్కిళ్ళ నడుమ అమ్మ వేడికోల్లై పోవడం 
మూసిన బెడ్ రూం తలుపు సందుల్లోంచి
అంతా కనిపిస్తూనే వుంటుంది...అంతా వినిపిస్తూనే వుంటుంది
రాత్రుళ్ళు బెడ్ రూం దాటి రాగూడదన్న
అమ్మ వార్నింగ్ కూడా జ్ఞాపకం వొస్తుంది 

అలికిడికి ఉలిక్కి పడి లేచిన తమ్ముడి వీపు మీదకు
జోలపాటనై కాసేపు అమ్మ పాత్రలోకి నేను ....

రాత్రుళ్ళు నాన్నలెందుకు తాగి వొస్తారు ?
బాధల్ని మరిచి పోవడానికి అంటుంది రోజీ 
తాగి ఏనాడూ ఇళ్ళకి రాని అమ్మలకు బాధలువుండవా ? 

అమ్మలనీ, పిల్లలనీ ఏడ్పించే ఈ మందుని 
నాన్నలకు ఎవరు అందిస్తున్నారు?
తనని ఎక్కడ ప్రశ్నిస్తానో అని
చంద్రుడు మేఘాల మాటున దాక్కుంటాడు 
దోసిట్లోకి తీసోవడానికి వెన్నెల దొరకదు నాకు

గుడ్లగూబ ఒక గంట కొట్టేక అమ్మ వొచ్చి
నాకూ, తమ్ముడికీ నడుమ వాలిపోతుంది 
దుప్పటి సందుల్లోంచి 
అమ్మ దుక్కం కనిపిస్తూనే వుంటుంది
ఫ్యాను రెక్కల గాలి శబ్దం తప్ప
అంతా నిశ్శబ్దంగానే వుంటుంది 
*****

ఉదయం సూర్యుడు కళ్ళు తెరిచే సరికే  
అమ్మ వంటింట్లో మేల్కుని వుంటుంది

స్కూలుకి వెళ్తూ, అమ్మ కళ్ళల్లోకి చూస్తానొకసారి
తిరిగి మా రాత్రి లోకి జొరబడ బోయే పిశాచి తలపుల్లో మెదిలి 
యిద్దరి కళ్ళూ భయంతో వొనుకుతాయి కాసేపు...

08 -03 -1999 
ఆంధ్రభూమి -సాహితి 
  

30, జనవరి 2012, సోమవారం

వెళ్ళిపోతుంది ...


వెళ్ళిపోతుంది ...

నిన్న కురిసిన వడగళ్ళ వాన నుండి
అతనింకా తేరుకొనని ఒక ఉదయం
తలుపుల పైన పిడుగులు కురిపించి
కోపంగా గది లోకి ప్రవేశిస్తుంది ఆమె 


అతనింకా కళ్ళు నులుముకుంటూ వుండగానే
కొన్ని లేఖలనీ, మరి కొన్ని గ్రీటింగ్ కార్డులనీ
అతడు బహూకరించిన  చిన్ని కానుకలనీ
అతని ముందు కుప్పగా పోస్తుంది....
అగ్గిపుల్ల వొకటి అందిస్తే
కాల్చి బుగ్గి చేసేంత కోపంతో....


నేలపై రాలబోయే కన్నీళ్ళని 
తన అరచేతుల్లోకి తీసుకుంటూ ఆమె అంటుంది ఉక్రోషంగా ......
"అర్థం కాను నేను నీకు యెప్పటికీ...
కళ్ళ లోకి చూడడమే తెలుసు నీకు
కళ్ళ వెనుక తటాకాలని చూడలేవు...
తటాకాలలో తేలియాడే కలువలని చూడలేవు 
కలువలపై మెరిసే వెన్నెల కాంతిని చూడలేవు ...
విసిగిస్తావు నన్ను, నీ సమక్షం లో 
సేదతీరాలని  గొప్ప ఆశతో నేను కూర్చోగానే"  

వొణికే తన రెండు చేతుల్ని 
ఆమె భుజాల మీద వేసి అనునయించాలనుకుంటాడు
"ప్రయాణిస్తున్నాను   నేను నీ లోకి
తటాకాలలో వెన్నెల కాంతిలో మెరిసి పోయే 
కలువల సమక్షానికి ...."

అతడు కొన్ని పదాలని ఏరుకుని వొచ్చి 
ఆమె ముందు పోసేలోగానే 
ఆమె వెళ్ళిపోతుంది 

 అతడు, ఆమె వొదిలి వెళ్ళిన వాటిని 
అపురూపంగా తడుముతూ  ప్రశ్నిస్తాడు
"ఈ లేఖలనీ, నేనిచ్చిన ఈ చిన్ని కానుకలనీ
ఇక్కడ వొదిలి వెళ్ళిపోయావు  సరే...
వీటి నడుమ అపురూపంగా నన్ను కూడా నీకు  బహూకరించాను  
మరి, నన్ను ఎక్కడ విసిరేసి వొచ్చావు ?" 


అతడికి యెవరైనా చెబితే బాగుండు..
ఆమె అతడి చెంత వొదిలి వెళ్ళింది 
కొన్ని లేఖలనీ, మరి కొన్నిచిన్ని కానుకలనీ మాత్రమే కాదనీ....
తనని కూడా అని...









19, జనవరి 2012, గురువారం

ఒక రాత్రి...మరొక రాత్రి

ఒక రాత్రి...మరొక రాత్రి 

-->
-->
కనుల అంచులు తాకే నిదుర పడవకై
ఇలా  మెలకువ తీరాన యెదురుచూడవలసిందే
యిక, ఈ రాత్రి నదిని భారంగా ఈదవలసిందే

కాసేపు పుస్తకాల పుటల నడుమ తప్పి పోయీ….
మరి కాసేపు గాయాలని ఆలపించే దేవదాసు
పాటల తరంగాల మీద పారిపోయీ……
గాయపరచిన మాటల శకలాలని
ఒకటొకటిగా మోసుకుని సాగవలసిందే...

సుమధుర గీతంలా సాగుతుందని ఆశించే యాత్ర యేదైనా
అంతిమంగా, గాయాల గానంగా మిగులుతుందనే ఎరుకతో
ఇక  చీకటి లో మునకలు వేయవలసిందే
* * * * *

పౌర్ణమి రాత్రి వెన్నెల్లో సముద్ర తీరాన  
జంట పావురాల కువకువలు ఒక కల....
వేసవి సాయంత్రాలలో కురిసిన
చల్లని వాన చినుకులు ఒక కల....
భుజం మీద చేయి వేసి
భరోసా యిచ్చిన చందమామ ఒక మాయ...
దోసిలి పట్టిన హృదయంలో తాజా పుష్పమొకటి
ఎప్పటికైనా చేరుతుందని ఎదురు చూడడం  ఒక భ్రమ 

గడియారాలు ఘనీభవించిన శీతా కాలంలో
నీ కోసమై విలపించే రెండు వీధి కుక్కలు కూడా
ఎక్కడో మునగదీసుకు పడుకుని వుంటాయి...


'టక్... టక్... టక్...' నడచి వొచ్చిన బాట లోని
అడుగుల  గుర్తులు  మాయమైపోయి వుంటాయి..
ఇక ఎప్పటికీ వెనక్కి వెళ్ళలేవన్న  సత్యమేదో
దేహమంత దుఖాశ్రువై యెదుట నిలుస్తుంది
బాటలో దారి తప్పి తచ్చాడే జత పాదాలు….

* * * * *

‘ఏడు కట్ల సవారీ’ అంటే యేమిటి తండ్రీ?
హోరెత్తించే డప్పుల శబ్దాలు లేకుండానే
నీ శిరసున దారి చూపే దీపం లేకుండానే
దేహాన్ని చుట్టుముట్టే ధూపం లేకుండానే ....చివరికి
నీకై విలపించే నీవైన రెండు కన్నులు లేకుండానే
ఒక రాత్రి...మరొక రాత్రి...ఏడేడు రాత్రులు
అలా రెండు తడి చేతుల నడుమ
ముఖాన్ని కప్పుకుని దాటడమే కదా....!

(ఆంద్ర జ్యోతి ఆదివారం జూలై 2012)



18 జనవరి 2012



 









 





17, జనవరి 2012, మంగళవారం

ఒక ఆధునికానంతర మగ దురహంకార పద్యం



సందేహమెందుకు శ్రీమతీ!
ప్రపంచమొక కుగ్రామమైన  కాలంలో 
స్త్రీ పురుషుల నడుమ 
అసమానతలెపుడో అంతరించాయి గదా!
* * * * *
సాఫ్ట్ వేర్ వధువుకి, సాఫ్ట్ వేర్ వరుడే సరిజోడని 
మన తలిదండ్రులు మనల్ని ముడివేసిన క్షణం మధురం
(ఆరంకెల జీతానికి మరో ఆరంకెల జీతంతో 
జత కుదరడం మరీ మధురం)

డ్యామిట్!...కమాడిటీ లా కట్నానికి అమ్ముడు పోవడమా?
పెళ్లి తంతొకటి ఘనంగా జరిపిస్తే చాలనే అన్నాము కదా...
ఆడపిల్లకీ ఆస్తిలో వాటా వుందని చట్టం చెప్పబట్టీ 
నువ్వు కొన్ని బరువైన కానుకలు తెచ్చినా కాదనలేదు
('ఏ కానుకా ఇవ్వలేని పేదపిల్లని కట్టుకోలేకపోయావా?' 
అను మాట యిపుడప్రస్తుతం)

ఎంత అందమైన శ్రమ విభజన మన కాపురంలో 
ఇల్లు...హాల్లో ఆకర్షనీయంగా అమరిన సోఫాలు
నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కర్టెన్లు 
దూలిరేణువు కూడా నిలవని అద్దాల్లాంటి గదులు 
ఉదయమే ఘుమఘుమలతో పిలిచే వంటిల్లు 
మన యింటికంతా నీవే మహారాణివి

బజారునపడి బయటి ప్రపంచమంతా ఈదుతూ 
బ్యాంకు అకౌంట్లు , రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు .....
సవాలక్ష తలనొప్పులతో సతమతమవుతూ నేను 
డార్లింగ్ !.... సున్నితమైన నీ మెదడు 
క్లిష్టమైన ఈ లావాదేవీలనెలా తట్టుకోగలదు? 

పనమ్మాయి రాని రోజున 
అంట్లు తోమాలనో, బట్టలారేయాలనో అనుకుంటా గానీ
'నీకది నచ్చదులే' అని మిన్నకుండి పోతాను...

ఆఫీసు నుండి వొచ్చి, నీరసంగా వుందని
నువ్వు మంచం మీద వాలిపోతే 
నేనే వంట చేద్దామనుకుంటా గానీ
అది నీకు రుచించదని క్యారియర్ పట్టుకొస్తాను 

పిల్లలకు నేప్కిన్ లు మార్చాలనీ,
టాయ్లెట్ కి వెళ్తే కడగాలనీ అనుకుంటా గానీ
'నువ్వంత శుభ్రంగా చేయవు' అంటావని మానేస్తాను 
ఇంటిపనీ, వంటపనీ స్త్రీలు చేసినంత అందంగా
పురుషులు చేయగలరా మై డియర్ ....?
* * * * *
ఫెమినిస్టులు కొందరు ఇంకా గగ్గోలు పెడుతుంటారు గానీ
శ్రీమతీ!....అసమానతలింకా అంతరించలేదా? 

[ఆగష్టు 2008  -ఆదివారం ఆంధ్రజ్యోతి ] ['అనంతరం' కవితా సంపుటి నుండి]