26, డిసెంబర్ 2011, సోమవారం

ప్రియమైన దెయ్యం (కథ )


కథ

ప్రియమైన దెయ్యం


నాలుగు  రోజులు గడిచి వుంటాయి....నన్ను ఈ ఆసుపత్రి లో చేర్పించి... నాలుగు రోజులేనా?...ఏమో...? ఉచ్చ్వాస నిశ్శ్వాసాల నిండా భరించలేని ఆసుపత్రి వాసన...శరీరం అలవాటు పడినట్టుంది....శరీరం, మనసు, మెదడు...అన్నీ...అన్నీ...ఒక పెద్ద మత్తు జాడీలో ముంచి మూత పెట్టినట్టు...

ఒంట్లో ఏ మూలలోనో కొద్దిగా మిగిలిపోయిన శక్తిని కూడ దీసుకుని...మెల్లి మెల్లిగా కళ్ళు తెరిచాను...
శరీరమంతా కొన్ని క్షణాలపాటు జలదరించింది....ముక్కు రంద్రాల్లోంచీ... నోట్లోంచీ..ఒంట్లో మిగిలిన మరికొన్ని భాగాల్లోంచీ ఏవేవో  సన్నని పైపులు..చూపు కొద్దిగా తిప్పి చూసాను....చుక్కలు చుక్కలుగా రాలుతూ seline బాటిల్ .... 'బీప్'...'బీప్' మని రొద చేస్తూ మెడికల్ పరికరాలు....
నాకు, నా తల్లి ఆసుపత్రిలో గడిపిన తన  చివరి దినాలు జ్ఞాపకం వొచ్చాయి....

నా తల్లిని  కూడా ఇలాగే ...అక్యూట్ ఇంటెన్సివ్ కేర్ లో చేర్పించాము... ఇలాగే పైపుల మధ్య బంధించబడిన నా తల్లిని దగ్గరకు వెళ్లి చూసే ధైర్యం లేక బయటే వుండి పోయాను...
నా  చెల్లెళ్ళు ఇద్దరూ నా తల్లి చివరి క్షణం దాకా తన దగ్గరే వున్నారు..."అమ్మ కళ్ళు తెరిచినపుడల్లా నిన్నే కలవరిస్తోంది అన్నయ్యా...ఒక్క సారి అమ్మకు కనిపించి వెళ్ళు....ఇక తను బతుకుతుందన్న ఆశ లేదు... కనీసం నిన్ను కడసారి చూసుకుని వెళ్లానన్న తృప్తి నైనా మిగలనియ్యి.."...
నా చెల్లెళ్ళు ఎంతగా బతిమాలినా ... నా భార్య కోపంతో మందలించినా...చివరికి, నా భయం ముందు, నా తల్లి పట్ల నాకున్న ప్రేమ వోడిపోయింది ఆ రోజు......నా తల్లి పోయిన తరువాత చాలా రోజుల పాటు నిద్ర పట్టేది కాదు...ఒక అపరాధ భావం వెంటాడేది ఎప్పుడూ...

ఇన్నాళ్ళుగా  లేని శక్తీ, ఓపిక లాంటివి ఏవో శరీరం లోకి ప్రవేశించినట్టున్నాయి..దేనికి సంకేతం ఇది?
చూపు మరి కాస్త పక్కకు జరిపి చూసాను...కొంచెం దూరంగా మసక మసగ్గా ఏవో రెండు రూపాలు....ఒక రూపం తెల్లటి దుస్తుల్లో ...బహుశా డాక్టర్ అయి ఉంటాడు....ఆ పక్కన ... ఆ పక్కన ఎవరు...?...

ఓహ్..మహీధర్...నా ఒక్కగానొక్క కొడుకు....బెంగుళూరులో ఇంజనీరింగ్ చదివే రోజుల్లో 'నిన్న ఫోన్ చేస్తానని చేయలేదేమి నాన్నా?' అని నన్ను మురిపించిన  కొడుకు....ఇప్పుడు నేను ఫోన్ చేస్తే 'మీకు ఫోన్ చేయడం తప్ప నాకు వేరే పనులేమీ వుండవనుకుంటారా?' అని నన్ను దాదాపుగా మరచిపోయిన కొడుకు....బహుశా, వాళ్ళ అమ్మ బహు జాగ్రత్తగా కాపాడుకుంటూ వొచ్చిన మా తండ్రీ కొడుకుల సున్నిత సంబంధమేదో ఆమె పోయాకచాలా బలహీనమై పోయింది...ఇంకా కాస్త మిగిలి వుందీ అంటే అది నా కోడలి పుణ్యమే....
'మీరు ఒక్కరే అక్కడ వుండడం ఎందుకూ...ఇక్కడికి వొచ్చి మాతోనే ఉండరాదా!' అని ఆ పిల్ల పాపం పోరు పెడుతూనే వుంటుంది....కానీ, ఇక్కడ హైదరాబాద్ లో ఈ లంకంత ఇంతినీ...ఈ ఆస్తుల్నీ వొదిలేసి వెళితే ఎలా?....అందులోనూ, నాతో మనసు విప్పి నాలుగు మాటలు మాట్లాడని నా కొడుకు ఇంట్లో ఎలా?
వీడు అమెరికా నుండి ఎప్పుడు దిగాడు?...వీడూ, డాక్టర్ గారూ అంత సీరియస్ గా ఏం మాట్లాడుకుంటూ వున్నారు?
అలా కుతూహలంతో వాళ్ళనే చూస్తున్నాను....
ఇంతలో...నాకూ...వాళ్ళకీ నడుమ, నిలువెల్లా తెల్లని దుస్తులు ధరించిన ఒక ఆకారమేదో ప్రత్యక్షమయింది......ఆ ఆకారం చుట్టూతా భరించలేనంత తెల తెల్లని వెలుగు  ...మెల్లిగా...అడుగులో అడుగేసుకుంటూ నా వైపే వస్తోంది...ఒక్క క్షణం భయం వేసింది....గొంతు పెగిల్చి అరవడానికి ప్రయత్నించాను....లాభం లేదు...దేహపు నూతిలో ఎక్కడో లోలోతుల్లోంచి గొంతు దాకా అరుపుని లాక్కు రావడం సాధ్యమయ్యే పని కాదని తెలిసింది...
మెల్లిగా నా బెడ్ దాకా వొచ్చి, నా పక్కనే స్టూల్ మీద కూర్చుని చిన్నగా నవ్వింది ఆ ఆకారం..   
నా పక్కనే, స్టూల్ మీద కూర్చున్నాక , కాస్త పరికించి చూసాను....తల మీద జుట్టు చాలా వరకూ రాలిపోయి, మొహం అంతా ముడతలతో నిండిపోయీ, కళ్ళు గాజు గోళీల్లా అయిపోయీ...చాలా పీలగా .... దుర్బలంగా వుంది....
కాసేపు పరికించి చూసాక స్ఫురించింది....అవును... ఆకారం నాకు బొత్తిగా పరిచయం లేనిదేమీ కాదు...అవును...అవును...అదే ఆకారం...కాకపోతే, చాలా కాలమయింది చూసి....ఇది నాకు చివరి సారి కనిపించినప్పటికీ, ఇప్పటికీ చాలా మారిపోయింది....కుంగదీసిన వృద్దాప్యం అణువణువునా కనిపిస్తూ....చాలా శుష్కించి పోయింది....


నిజానికి, ఒకప్పుడు ఆకారం నాకు చాలా సార్లు కనిపించేది...కనిపించీ, కనిపించీ చాలా సంవత్సరాల క్రితం అకస్మాత్తుగా ఇక కన్పించడం మానేసింది...బహుశాఒక పిచ్చి విసుగేదో  చెంది వుంటుంది....లేక, నా వరుస అనాదరణ దానిని బాధించి వుంటుంది....మరి, ఇన్ని సంవత్సరాల తరువాత ఇప్పుడు, నేను ఇలాంటి దుర్భర స్థితిలో వున్నపుడు ఎందుకు వొచ్చి వుంటుంది?... ఎంతయినా పాత స్నేహం కదా అనే జాలితో వొచ్చిందేమో...?
నన్ను తప్పకుండా జ్ఞాపకం పెట్టుకుంటారు అనుకున్న వాళ్ళెవరికీ నేను జ్ఞాపకం లేను....ఆశ్చర్యంగా, ఆకారానికి....ఇంకా ఇలా ఆకారం అని సంబోధించడం ఏమి న్యాయం..?....మరి ఏమని సంబోధించాలి?...సరదాగా 'ప్రియమైన దెయ్యం' అని పిలిస్తే...?...ఇదేదో బాగానే వుంది....పోనీలే...కనీసం నా ప్రియమైన దెయ్యానికి  నేను ఇంకా జ్ఞాపకం వున్నాను....నా అనాదరణ ని కూడా క్షమించి మళ్ళీ నా దగ్గరకు వోచ్చెంతగా....
తొలి సారి, నా  ప్రియమైన దెయ్యాన్ని ఎప్పుడు చూసి వుంటాను?
నా ఆలోచనలు అలా...అలా...వెనక్కి...వెనక్కి....నేను ఆరేడేళ్ళ వయసులో వున్నప్పటి కాలానికి వెళ్ళాయి....అవును...జ్ఞాపకం వొస్తోంది....అప్పుడే తొలి సారి దెయ్యాన్ని చూసిన జ్ఞాపకం....ఎంత ముద్దుగా వుండేది దెయ్యం అప్పుడు....ఉంగరాల జుట్టుతో ....అమాయకమైన చూపులతో....సరిగ్గా నా అంతే వుండేది....
రోజు పక్కింటి సతీష్ గాడితో గోళీలాట ఆడుతున్నాను....ఆటలో నిజానికి నేను వోడిపోయాను...కానీ, గోళీలన్నీ సతీష్ గాడికి ఇవ్వవలసి వొస్తుందని వాడితో గొడవకు దిగాను....సతీష్ గాడు కోపం తో ఊగిపోయి అరిచాడు....'ఒరేయ్...నువ్వు చాలా తొండి చేస్తున్నావ్....ఇలాగైతే నేనసలు నీతో ఎప్పుడూ ఆడను...' 
సరిగ్గా అప్పుడు కనిపించింది మొదటి సారి....పెద్దగా ఏమీ మాట్లాడలేదు....నా వైపు సూటిగా చూసి, 'తప్పు చేస్తున్నావు కదా శేఖర్...ఇలాగైతే నీతో ఇంకెవరు ఆడతారు?' అంది....అంతే, మరో మాట చెప్పకుండా, సతీష్ గాడి వైపు తిరిగి, వాడి గోళీకాయలు వాడికి తిరిగి ఇచ్చేసి, 'సారీ' అని చెప్పి, మల్లె నా ప్రియమైన దెయ్యం వైపు తిరిగాను....అది చిన్నగా నవ్వి, 'గుడ్ బాయ్' అని భుజం తట్టి మాయమైపోయింది....
అలా తరువాత, నా ప్రియమైన దెయ్యం నా చిన్నతనం లో చాలా సార్లే కనిపించిన జ్ఞాపకం.....గుడ్డి వాళ్ళని రోడ్డు దాటించినపుడూ, తుఫాను బాధితుల కోసం విరాళాలు వసూలు చేసినపుడూ, నాన్నకు చూపించకుండా ప్రోగ్రెస్ రిపోర్ట్ సంతకం చేసుకున్నపుడూ....కొన్ని సార్లు అభినందించీ...కొన్ని సార్లు మందలించీ.....


ఇప్పుడు ఆలోచిస్తే అనిపిస్తోంది... దెయ్యం నాతో పాటే పెరిగి పెద్దైపోయి ఇపుడిలా నాలాగే వృద్దాప్యం లోకి అడుగు పెట్టింది....కాకపోతే, బాల్యం నుండీ యవ్వనం దాకా తరచుగా కనిపించిన దెయ్యం... తరువాత ఒకే ఒక్క సారి...అదీ...నా ఒక్కగానొక్క కొడుక్కి పెళ్లి చేయాలనుకున్న సందర్భం లో మాత్రం కనిపించి....ఇక తరువాత నాతో సంబంధాన్ని పూర్తిగా తెంచేసుకుంది... చివరి సారి కనిపించినపుడు నా ప్రియమైన దెయ్యం నన్ను చూసిన చూపు ని ఇప్పటికీ మరిచిపోలేను....నన్నొక పేడ పురుగు కన్నా అసహ్యంగా చూసింది....ఎలా మరిచిపోతాను
అంతకు క్రితం మరో రెండు సందర్భాలలో కూడా నా ప్రియమైన దెయ్యం నన్ను చాలా చీవాట్లు పెట్టింది....
ఒక సందర్భం...నేను దాదాపు పాతికేళ్ళ వయసులో వున్నపుడు సరోజతో 'మన పెళ్లి మా ఇంట్లో వాళ్లకి ఇష్టం లేదు... పెళ్లి జరిగితే మా అమ్మ విషం తాగి చచ్చిపోతాను అంటోంది..' అని చెప్పిన రోజు....
సరోజ....నా నవ యవ్వన దినాలని జాజిపూల గుబాళింపులతో నింపిన నా ప్రేయసి .... చారడేసి కళ్ళు ... అమాయకమైన చిరునవ్వు ... .ప్రేమించాలేదా నేను తనని .... లేదు. ..లేదు...ప్రేమించాను...'సరోజే నా లోకం' అనేంతగా ప్రేమించాను ......కానీ, ఏం చేసేది?.... అమ్మా, నాన్న నన్ను కట్టిపడేశారు..వాళ్ళ ప్రేమతో...కాదు...కాదు...వాళ్ళ బెదిరింపులతో..... 
పాపం...సరోజ!...నేను మాట చెప్పిన రోజున ఒక్కసారిగా  కుప్పకూలిపోయింది పార్కులోనే....ఒక్క మాటైనా అనకుండా నిశబ్దంగా నిష్క్రమించింది...మళ్ళీ నాకు తారసపడలేదు
అప్పుడు కనిపించింది నా ప్రియమైన దెయ్యం....ఎన్ని తిట్లు తిట్టిందనీ....
'రాస్కెల్....అంత ధైర్యం లేని వాడివి ప్రేమా, ప్రేమా అని అమాయకురాలి వెంట ఎందుకు పడ్డావురా?....పాపం పేదింటి పిల్ల ...తన మానాన తను బుద్దిగా చదువుకుంటున్న పిల్లని ప్రేమ పేరుతో అటూ యిటూ తిప్పి , నలుగురిలో చులకనయ్యేలా ఇప్పుడిలా వొదిలేసావు....ఏం? ... తన కులమూ, తన ఆస్థీ, మీ అమ్మానాన్నా ... యివన్నీ తమరికి పిల్లని ప్రేమించినపుడూ....తీయటి కబుర్లు చెప్పినపుడూ గుర్తుకు లేవా?.. అమ్మా, నాన్న ఒప్పుకోకపోతే మరో దారి లేదా?... వుందని నీకూ తెలుసు... అయినా మోజు తీరింది కాబట్టి తప్పించుకోడానికి ఇదో మార్గం...కదూ?'
నేనేమీ బదులు చెప్ప లేదు...
'థూ...  ' దెయ్యం నేల మీద కసితీరా ఉమ్మేసి మాయమై పోయింది....


మరొక సందర్భం...అది కూడా బాగా జ్ఞాపకం....
ఆఫీసులో నేను డీల్ చేసిన ఒక ప్రాజెక్ట్ లో నా పై అధికారీ, నేనూ కూడబలుక్కుని ఒక అధికార పార్టీ కాంట్రాక్టు సంస్థ కు మేలు జరిగేలా నిబంధనలు మార్చిన రోజు... రోజున మా మీద వొచ్చిన వొత్తిడికి మాకు అంతకన్నా మార్గం లేకపోయింది...దానికి తోడు సదరు సంస్థ ఆశ చూపిన మొత్తం నా అవసరాలలో చాలా వాటిని ఒకే ఒక దెబ్బతో తీర్చేది వుండడం....
రోజున నా ప్రియమైన దెయ్యం నన్ను కుర్చీలో కూర్చోబెట్టి మరీ తిట్టింది....
'ఒరేయ్...నోటికి ఏం తింటున్నావురా? .. నీకు తెలీదా... కాంట్రాక్టర్ పని చేయదని?....కేవలం అడ్వాన్సు తీసుకుని...అక్కడా, ఇక్కడా పంచేసి...తూతూ మంత్రంగా కొన్ని తవ్వకాలు జరిపి జారుకుంటాడని....ఎవరి సొమ్మురా ఇదంతా?...అందరితో పాటు నువ్వూ లూటీ లో పాలు పంచుకున్నావు గదరా...'
అప్పుడూ అంతే .... మారు మాట్లాడ లేదు నేను....
దెయ్యం కూడా మళ్ళీ అలాగే 'థూ...' అని కసిగా ఉమ్మేసి మాయమై పోయింది...
తరువాత చాలా కాలం పాటు కనిపించకుండా పోయింది....నిజం చెప్పొద్దూ....చాలా రిలీఫ్ ఫీలయ్యాను....థాంక్ గాడ్... ఒక వెధవ గోల తప్పిందని.....!
మళ్ళీ చాన్నాళ్ళకు, నా కొడుకు పెళ్లి సందర్భంలో ప్రత్యక్షమయింది.....
నా దురదృష్టం ఏమిటంటే....ఒక నాడు నా పెళ్లి విషయంలో మా నాన్న పోషించిన పాత్రనే అనివార్యంగా నేను నా కొడుకు విషయంలో పోషించవలసి రావడం......
రాధిక పిల్ల పేరు......
చక్కగా వుంది.....కాకపోతే , సమస్య పాతదే....మా కులం కాదు.....అందులోనూ, నా కొడుకు సుఖం కోరి, మా కుటుంబ హోదాకు సరితూగే ఒక చక్కటి సంబంధం ఇదివరకే చూసి పెట్టాను...
' పిల్లకు మాటిచ్చాను నాన్నా...తను లేని జీవితం ఊహించడానికే భయంగా వుంది....'నా కొడుకు నానా విధాలుగా నన్ను కన్విన్సు చేయ ప్రయత్నించాడు....
నేను కూడా శత విధాలా మా వాడిని కన్విన్సు చేయ ప్రయత్నించి, ఇక లాభం లేదని, అటు వైపు నుంచి నరుక్కొచ్చాను...
ఫలితం.....ఒక రోజు, రాధిక మా వాడికి ' నాకు నీతో రాసి పెట్టి లేదు మహీ...ఇక నన్ను మరిచిపో....నా కోసం వెదకొద్దు...నన్ను మరిచిపో...' అని ఒక నాలుగు ముక్కల ఉత్తరం రాసిపెట్టి వెళ్ళిపోయింది....
రోజు, నాకెందుకో, నా కొడుకూ, నా ప్రియమైన దెయ్యమూ నన్ను ఒకేలా చూసారని అనిపించింది...
రోజు నా దెయ్యం నా మీదకొచ్చి కొట్టినంత పని చేసింది....


'ఆస్థి, కులమూ, నీ బొందా....ఇక జన్మకి నువ్వు మారవురా....కనీసం ఇప్పుడైనా, నీ కొడుకు కోసమైనా కాస్త మారి వుంటావన్న చిన్న ఆశతో వొచ్చానురా.... కట్టుకుపోతావా ఇదంతా....ఇలా బతకడం కూడా ఒక బతుకేనా?'
తిట్లు...శాపనార్థాలు....ఒక వరదలా....
ఇక భరించలేక కళ్ళు, చెవులూ మూసుకుని 'యు...ఇడియట్....జస్ట్ గెట్ లాస్ట్..!' అని గట్టిగా అరిచాను....
తేరుకుని, చూసే సరికి , నా ప్రియమైన దెయ్యం లేదు...ఇక మళ్ళీ ఎప్పుడూ కనిపించలేదు కూడా....ఇదిగో...ఇన్నాళ్ళకి....నేను ఇలాంటి దుర్భర స్థితిలో ఆసుపత్రిలో వున్నపుడు, ఇక్కడ ప్రత్యక్షమయింది... 
కళ్ళు కొంచెం పక్కకి తిప్పి చూసాను....
కాస్త దూరం నుంచి నా కొడుకు, డాక్టర్ గారు నా బెడ్ దగ్గరికి వొస్తున్నారు....వడి వడిగా....
చూపుని తిరిగి నా ప్రియమైన దెయ్యం వైపు తిప్పాను.....
ఆశ్చర్యం! ... ఇపుడంతా స్పష్టంగా కనిపిస్తోంది....చాలా స్పష్టంగా....
ఇన్నాళ్ళూ నేను పోల్చుకోలేక పోయిన ఆనవాల్లేవో నాకు నా దెయ్యంలో కొద్ది కొద్దిగా దొరుకుతున్నాయి..... కళ్ళు... ముక్కు... నుదురు... గెడ్డం...యెస్... యెస్..
డాక్టర్ దగ్గరికి వొచ్చి నా నాడిని పట్టుకుని చూస్తున్నాడు...పక్కన నా కొడుకు అభావంగా...విచిత్రం....వాళ్ళిద్దరూ మసక మసగ్గా కనిపిస్తూ మెల్లిగా మాయమై పోతున్నారు....
అవును....నా ప్రియమైన దెయ్యం లోని పోలికలు ఎవరివీ...ఎవరివీ...
అయ్యో దేవుడా!...ఇన్నాళ్ళూ ... ఇన్నేళ్ళూ గమనించనే లేదే....గమనించి , ఆలకించి వుంటే నా జీవితం మరోల ఉండేదా?....ఒక కాంతివంతమైన ప్రశాంతతలో నిష్క్రమించే గొప్ప అవకాశం కోల్పోయేవాడిని కాదు గదా!

* * * * *

                               [25  డిసెంబర్ - 2011  నాటి 'వార్త' ఆదివారం అనుబంధం లో ప్రచురితం

6 కామెంట్‌లు:

కనకాంబరం చెప్పారు...

జీవన యానం లొ నలిగి ఒదిగిన జ్ఞాపకాలు . అద్భుతంగా చితించడానికి ఎంచుకున్న వేదిక ఓ ఆసుపత్రి మంచం .నైస్ ?

అభినందనలు డియర్. . Nutakki Raghavendra Rao (Kanakaambaram).

కోడూరి విజయకుమార్ చెప్పారు...

thank you, KanakAmbaram gaaru....

Hanumantha Reddy Kodidela చెప్పారు...

దయ్యం ఎవరో చెప్పకనే చెప్పిన తీరు బాగుంది. పాఠకులలో కొందరికి అందదేమోనని అనుమానం. అది కథలోని ‘మీరే’ (‘మీ’ అంతరాత్మ) అని నేను సరిగ్గా అర్థం చేసుకున్నాననుకుంటాను. ప్రతి మనిషీ అంతరాత్మతో స్ట్రగుల్ లోనే వుంటాడు, దాన్ని అణిచేసి ఎగుళ్లాడుతుంటాడు. చివరికి అశాంతిగా మరణిస్తాడని చాల బాగా చెప్పారు.

కోడూరి విజయకుమార్ చెప్పారు...

హెచ్చార్కె.....మొదట మీ అభినందనీయ వ్యాఖ్యకు కృతజ్ఞతలు!...మీ వ్యాఖ్య చదివాక నాకొక సందేహం కలిగింది...కథ చివరికి వచ్చేసరికైనా సాధారణ పాటకుడికి ఆ దెయ్యం ఎవరో తెలీదంటారా?....

సామాన్య చెప్పారు...

సర్ ,హెచ్ ఆర్ కే గారు చెప్పింది నిజమే అది మీ అంతరాత్మ అని తెలుసుకోడం ఒక స్థాయి పాటకులకి మాత్రమె సాధ్యం.

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@ సామాన్య...అవునా?!