20, మే 2014, మంగళవారం

పథం తో పదం కలిసి




పథంతో పదం కలసి
పథం తో పదం కలిసి (2013 లో ప్రచురిత మైన కవితల పైన వ్యాసం)
(5 జనవరి -'సాక్షి '- సాహిత్యం )


కవిత్వం గురించి 'లియోనార్డ్ కోహెన్' అన్న కెనడా కవి ఇలా అంటాడు - 'కవిత్వం జీవితానికి సాక్ష్యం .... జీవితం పూర్తిగా తగలబడిపోతున్నపుడు మిగిలే బూడిద కవిత్వం'

ఇదివరకటి కాలంతో పోలిస్తే, 2013 మరిన్ని సంక్షోభాలతో, మరిన్ని విషాదాలతో  ముంచెత్తబడిన సంవత్సరం. ఒక్కొక్క సంక్షోభం ఇక్కడి జీవితాన్ని నిలువునా దహించివేసినపుడు, దుఃఖితుడైన  తెలుగు కవి ఒక్కొక్క కవితా వాక్యంలో తనను తాను దగ్ధం చేసుకున్నాడు. బాహ్య లోకంలో వెల్లువెత్తిన సంక్షోభాలను కవిత్వీకరిస్తూనే, ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అవి తన అంతర్లోకాన్ని కుదిపేసిన క్షణాలనీ గానం చేసాడు –

'ఒక పద్యం రాయాలి / సముద్రాలు వెదకాలి రోదసిని గాలించాలి / చితుకులు రాజుకునే ఒక పదం కోసం / దొరికితేనే బతుకు' అనుకున్నాడు ( హెచ్చార్కె – ‘భిక్షుక భోజనం’)-
'మనమెందుకిలా అన్నింటినీ వొదులుకుని / అన్నింటినీ పోగొట్టుకుని / నిస్సారంగా నిర్ వ్యామోహంగా మృత ప్రాయంగా' వున్నామని దుఃఖించాడు ( శివారెడ్డి 'బతుకు ఒక పాట')-
'నా చుట్టూ విస్తరిస్తున్న ప్రపంచం / నా బతుకేదో నన్ను బతకనివ్వదుగదా / వేషమూ, భాషా నన్ను నాలాగా ఉండనివ్వవుగదా' అని వాపోయాడు (గంటేడ గౌరు నాయుడు - 'నాలో మా వూరు')
'ఎదిగే కొద్దీ మనిషి లోపలి లేత శిశువు మరణిస్తున్నందుకు' అని  దుఃఖించాడు - (పలమనేరు బాలాజీ - 'వెలుతురు దారి')
చివరికి, 'చిన్నప్పుడే నయం / అద్దం  ముందు నుంచుంటే ఇప్పటిలా మరెవరో కనిపించే వారు కాదు' అని కవి నోస్టాల్జియా లోకి వెళ్ళిపోయిన కాలం యిది (కె గీత -'పుట్టగొడుగు మడి')

ఇంతా చేసి, కవి ఆశించింది ఏమిటి ? ... 'మాట' .... ఈ సంక్షోభ కాలంలో  సాటి మనిషి నుండి ఒక మనిషితనం నిండిన మాట .... ఇంకా చెప్పాలంటే -   ‘అప్పుడే కళ్ళు తెరిచిన నవజాత శిశువు / తొలి దుఃఖ రాగం లాంటి / మగత నిద్రలో పెదవులపై తూగాడే అరవిరిపిన / మార్మికపు చిరునగవులాంటి మాట / ఏమాటకైతే మనిషి పులకించి / హర్షాతిరేకంతో నన్ను అక్కున చేర్చుకుంటాడో అట్లాంటి మాట’ – (విమల – ‘ఒకే ఒక్క మాట’)
చివరికి 'మాట్లాడుకోని మనుషులు వొచ్చారని / ఇంట్లోని వస్తువులు అన్నీ విసుక్కుంటాయేమో' అని కూడా  తెలుగు కవి ఈ కాలం లో దిగాలు పడి పోయాడు (ఆశారాజు - 'మనం లేనపుడు')
ఈ కాలంలో కవి ఎందుకు ఇంతగా కవిత్వాన్ని ఆశ్రయించాడు? …… 'ఈ అంతర్ దర్శనం లేకుండా / రేపు ఏ బాహ్య దర్శనానికి వెళ్ళగలను' - (దర్భశయనం శ్రీనివాసాచార్య - 'లోపలికి')

కవిత్వం వ్రాయడం గురించి 'చార్లెస్ బుకోస్కీ' అనే అమెరికన్ కవి యిలా అంటాడు - 'కొన్ని మంచి కవితలు వ్రాయడానికి భయంకరమైన నిరాశ, అసంతృప్తి, భ్రమలు తొలగిన స్థితి అవసరం'

తెలుగు కవిని 2013 లో సహజంగానే 'తెలంగాణా' ఎక్కువ కుదుపుకు లోను చేసింది. తన ప్రాంత అస్తిత్వానికి జరుగుతోన్న అన్యాయాలని ఏకరువు పెడుతూ, తెలంగాణా రాష్ట్ర సాకారం తోనే న్యాయం జరుగుతుందని ప్రకటిస్తూ   తెలంగాణా కవి  అంతకు ముందు కాలంలో  విస్తృతంగా కవిత్వాన్ని సృజించాడు. అప్పటి తెలంగాణా ఉద్యమ కవిత్వాన్ని అంతటినీ ప్రోది చేసి తెచ్చిన 'మునుం' బృహత్  కవితా  సంకలనం ఈ 2013 సంవత్సర కాలంలోనే  'Ode to Frontline Formations' పేర ఇంగ్లీష్ లో దామోదర్ రావు గారి సంపాదకత్వంలో వెలువడింది-

'నేనిప్పుడు వెయ్యి కాళ్ళతో నడిచే కాష్టాన్ని /  సుక్కల రుమాల్  ని వేలుకు కట్టుకుని / దిమ్మీసలాడుతూ… భూమ్మీద / తైతక్క లాడుతూనే వుంటాను' (సిద్ధార్థ -'మహా ఖననం') అని ఉద్యమించిన తెలంగాణా ప్రజల చిరకాల స్వప్నం నిజమయ్యే క్రమంలో వెలువడిన కేంద్ర ప్రభుత్వ ప్రకటన అనంతరం వొచ్చిన కవిత్వంలోని వైవిధ్యాన్ని  చూడండి -

-ఒక వైపు తెలంగాణా యిచ్చివేస్తున్నామని చెబుతూ, హైదరాబాద్ నగరం పైన ఆంక్షలు పెట్టడాన్ని చూసి, ''ఓ కులీ..! ఇయాల చేపలంతా కలిసి దువా చేస్తున్నయ్ / అనకొండలు తొలగిపోవాలె / మా చెరువు మల్లా చేపలతో కలకలలాడాలె!' (స్కై బాబా - దువా') అని తెలంగాణా కవి చలించి పోయాడు-
-మరొక వైపు, హైదరాబాద్ తో తన పిల్లలకున్న అనుబంధాన్ని చెబుతూ ఒక కోస్తాంధ్ర కవి ఇలా వాపోయాడు - 'ఈ అభినవ కాలి ఫోర్నియాలో మా పిల్లలు / అమీర్ పేటలు తప్ప అమలాపురాలు సమజైత లేదంటరు ' - (తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ 'యుద్ధాన్ని కలిసే చేసాం') 
-అదే సమయంలో, తెలంగాణా ప్రకటనను స్వాగతిస్తూ, 'విడాకులు మంజూరయ్యాయి / ఒక నిలువు దోపిడీ పరంపర ముగిసింది' (పైడి తెరేష్ బాబు -'దక్కిన పీట భూమి') , 'వేయి మంది యువకుల రక్తం సాక్షిగా / వచ్చిన ఈ స్వాతంత్రాన్ని స్వాగతిద్దాం ' - (ప్రసాద మూర్తి - 'ఇక ప్రేమించుకుందాం') అని భరోసానిచ్చిన   తెలంగాణేతర కవులూ వున్నారు –
        
నూనూగు మీసాల ఒక ఉత్తరాంధ్ర నవయువ కవి ఒక అడుగు ముందుకేసి, 'విభజన పెద్ద సమస్య కాదు / నువ్వూ నేనూ ప్రేమతో ఆలింగనం చేసుకోవడానికి / సరిహద్దులూ అడ్డం కావు / ఎటొచ్చీ- రెండు తలల మహా గారడీ గాళ్లు ఆడే / మాయా నాటకాలకు బలయిపోయే నీ నా ప్రజల గురించే నా బెంగంత / మట్టి మనుషులు ఎత్తి పట్టుకున్న జండా ఏదైనా నేను ఎత్తి పట్టుకుంటా / నాది సిక్కోలు / ఇపుడు నా పాట గాయ పడ్డ తెలంగాణా’ ( బాల సుధాకర మౌళి - 'గాయపడ్డ ప్రాంతం మీద') అని ప్రకటిస్తే, మరొక ఉత్తరాంధ్ర కవి 'ఒరే నాయనా ... ఇపుడు ప్రతి ప్రాంతమూ నిప్పుల జెండానే' (సిరికి స్వామి నాయుడు - 'ప్రాంతమేదైనా') అని తత్వ బోధన చేసాడు. 
రాజధాని కోసం జరుగుతోన్న యుద్ధాలని చూసి చలించిన రాయలసీమ కవి ''ఇక చాలు ఐక్యత లేని అన్నదమ్ముల / పొసగని సంసారపు ఉమ్మడి నాటకం చాలు ' (వెంకట కృష్ణ - 'ఒక నగరాన్ని నిర్మిద్దాం రండి') అని ఆగ్రహం వ్యక్తం చేసాడు. కవీ! ప్రజాగ్రహానికే వెరవక నాటకమాడుతోన్న వర్తమాన రాజకీయం నీ ఆగ్రహాన్ని లెక్క చేస్తుందా ?

చాలా ఆసక్తికరంగా, తెలంగాణా నేపథ్యంలో ఒక తెలంగాణా ముస్లిం కవి 'తెలంగాణా సాయబునైనందుకు / నా నుదుటి మీది నల్లటి నమాజు మచ్చై వెంటాడుతోంది' (ఖాజా-'మూసీ అవాజ్') అని దుఃఖిస్తే, ఒక తెలంగాణేతర ముస్లిం కవి తన తెలంగాణేతర హిందూ మిత్రుడిని ఉద్దేశించి 'ఈ దేశమే నాది కాదంటివి / ఈ మట్టే నాది కాదంటివి / ఇక్కడ  పుట్టిన నాకెంత బాధ వుండెనో వినక పోతివి' (షరీఫ్ - 'మద్దెల ముందు రోలు') తర తరాల తన గోడు వెళ్ళబోసుకున్నాడు -  

ముందే చెప్పినట్టు, తెలుగు కవిని కుదిపి వేసింది ఒక్క తెలంగాణా మాత్రమే కాదు -
అక్కడెక్కడో  ఉత్తరాదిన 'చార్ ధామ్' యాత్రా స్థలిలో జడలు విప్పిన కల్లోల గంగ సృష్టించిన విధ్వంసాన్ని ప్రస్తావిస్తూ ' 'ఒక హృదయ విదారక దృశ్యాన్ని ఎదుట నిలిపిందేవరో / అమాయక మేఘాలకూ తెలియదు'  (ఎన్ గోపి - 'చార్ ధామ్') అని బాధపడ్డాడు -

తన బాధ ఏదో చెప్పుకోవడానికి వొచ్చిన స్నేహితుడి ముందు నిస్సహాయుడై పోయి '‘వెళ్ళడానికి కాళ్ళకి ఇంకే అడుగూ తోచక / నా వేపు నడుచుకుంటూ వస్తావ్ నువ్వు / నీ నడకలోని ఉద్వేగాన్ని కొలిచేదేమీ / నా దగ్గిర ఉండదని నీకు తెలియక!’ (అఫ్సర్ - 'స్నేహితుడి దిగులు') అని దిగులు పడి పోయాడు. కనీసం అపుడపుడైనా తన మూలాలని తడుముకోలేక పోవడాన్ని ప్రస్తావిస్తూ ''చాలా చోట్లకు వెళ్ళ  లేకపోవడం నేరమే / ముఖ్యంగా నదీ మూలం లాంటి ఇంటికి '(యాకూబ్ - 'నదీ మూలం లాంటి ఇల్లు') అని తన బాధని పంచుకున్నాడు.

నగర చౌరస్తాలో కనిపించిన ఒక చెప్పులు కుట్టే స్త్రీ ని దర్శించి, 'ఈ దేశపు చౌరస్తాలు /నా కులవృత్తి కళారహస్య నికేతనాలు / అందరూ ఆమెను మోచీ మా అని పిలుస్తున్నారు గానీ / నాకు మాత్రం ఆమె మోతీ మా / నా జాతి మేలిమి ముత్యం' (శిఖామణి - 'మోచీ మా') అని దండం పెట్టుకున్నాడు.

 'చూడడమనే అనుభవాన్ని పంచుతోన్న జీవితమెంత బాగుంది' (బి వి వి ప్రసాద్ - 'నిద్ర రాని రాత్రి') అని ఆశ్చర్య పోతూనో ,  'పోలిక లేకపోతే జీవితమైనా లోకమైనా / ఆనంద విషాదాల హద్దులు చెదిరిపోయిన / అనంత నీరవ నిశీధి' ( పెన్నా శివ రామ కృష్ణ - 'పోలిక ఒక మాధ్యమం') అని వివరిస్తూనో , 'ఎన్నీల ఎలుగు పల్లెటూరంత స్వచ్చం / ఎన్నీల ఎలుగే మనసు నిమ్మళం నిమ్మళం' (అన్నవరం దేవేందర్ - 'ఎన్నీల ఎలుగు') అని సంబురపడుతూనో  తత్వం చెప్పాడు - 

అలాగే,  స్త్రీ - పురుష సంబంధాలలో  ఉండవలసిన ఆరోగ్యకరమైన ప్రజాస్వామిక వాతావరణానికై ఆశపడుతూ '‘ఇద్దరు స్త్రీ పురుషుల మధ్య /కాంక్షారహిత, దహన రహిత, శరీర రహిత సంబంధం / అలౌకికం అలైంగికం ఇంకేదైనా ఉండవచ్చు / ఒకే తరంగ దైర్ఘ్యంలో ఆలోచనా ప్రవాహం / వివేక వాక్య ప్రసారం ఉండవచ్చు (పాపినేని శివశంకర్ - 'ఇద్దరి మధ్య') అని అన్నాడు

మరొక కవి ఒకింత సాహసంతో, యాంత్రిక ఆధునిక కాలంలో  భార్యా భర్తల నడుమ క్రమంగా  లుప్తమవుతోన్న అలౌకిక రాసక్రీడని కవిత్వం చేస్తూ ''ఆమె ఫ్రిజిడిటీతో అతని రాత్రులు గడ్డకట్టాయి / కాలుతున్న పెదవుల తడి అద్ది / కోరికల కొనవేళ్ళతో శ్రుతి చేసినప్పుడు / ఏ రాగమూ పలకని వీణాతంత్రులు (కాసుల లింగా రెడ్డి - 'ఫ్రోజెన్  సరోవరం') అన్నాడు 

'ఫెర్నాండో పెసోవ' అనే ఒక గొప్ప పోర్చుగీసు కవి ఇలా అంటాడు -'In order to understand, I destroyed myself' (అర్థం చేసుకోవడానికి, నన్ను నేను ధ్వంసం చేసుకున్నాను) ... ఇంతకీ, దేనిని అర్థం చేసుకోవడానికి? …. దేనినైనా కదూ!
ఈ ఆధునిక సంక్షోభ కాలాన్నీ, అందులోని సకల సంబందాలనీ అర్థం చేసుకోవడానికి తెలుగు కవి కొన్ని సార్లు తనను తాను ధ్వంసించుకున్న కాలం యిది -
 ‘దేహం నుంచి రుగ్మత మనసుకుపాకుతుందో / మనసునుంచి దేహంలోకి పొక్కుతుందో /  నువ్వు స్వస్థత కోల్పోతావు / మరొకరెవరో నీ జీవితాన్ని / ముల్లులాగా ఊడబెరికిపోతున్నట్టు తెలుస్తుంది' - (చిన  వీరభద్రుడు) 
'చూస్తుండగానే, నల్లమబ్బులు కమ్మేస్తాయి / జీవితపు రిమోట్ను సెకన్ల ముల్లుకు తాకట్టుపెట్టే / హృదయ స్పందనలను దేంతో కొలవాలని?' -( దేశరాజు - 'వానపిట్ట')
'నీ ఒక్కడివే ఈ గదిలో / ఒంటరిగా ప్రమిదలో దు:ఖ దీపమౌతూ' ( కె క్యూబ్ వర్మ - 'దుఃఖ దీపం')
'తొడిమపై  తపస్సు చేసి / లోకాన్ని తన చుట్టూ తిప్పుకున్న పువ్వు / మట్టి పాదాలు తాకడానికి / ఏ గాలివాటుకో లొంగి పోతుంది' - (రవి వీరేల్లి - 'గ్రావిటీ')
'నిద్ర స్రవించిన మెలకువలతో / గాట్ల మీద కట్లు కట్టుకుని / ఇలా ఎంతసేపని / కలల్లోకీ .. కల్లోలం లోకీ' - (పసునూరు శ్రీధర్ బాబు - 'చీకట్లోంచి రాత్రి లోకి') 
లాలించి పాలించిన నది / చివరకు రాలిన కన్నీటి చుక్కలను కూడా / గర్భంలో దాచిపెట్టుకున్న నది /రాత్రులను సుడులు తిప్పుతూనే ఉంది / ఇంతలో- ఒక కోయగూడెం లోతుల్లోంచి / కొమ్ముబూరా ప్రకంపించింది / నది జలదరించింది / నేను ఉలిక్కిపడి లేచాను’   (అరుణ్ సాగర్ - 'జీవ నది')
'పెళ్ళాం అర్థంకాదు..పిల్లలు అర్థంకారు.. ఉద్యోగం అర్థంకాదు / రాజకీయాలు అర్థంకావు.. అరాచకాలర్థంకావు / చివరికి జీవితం అర్థంకాదు' -( రామా చంద్రమౌళి - 'ఎవరిదో ఒక అనుమతి కావాలి')
'అడవిలో అకస్మాత్తుగా తప్పిపోవాలి / తూనీగలానో.. గాజుపురుగు మల్లేనో / మహావృక్షాల ఆకుల చివర్లలో ఒంటరిగా' -( నిషిగంధ - 'చిటారు కొమ్మన గాలిపటం')
 మరి, మన జీవితాలలో ఇంతటి సంక్షోభాన్ని సృష్టిస్తున్నది ఎవరు? ... కవికి తెలుసా?!
'ఎవ్వరో జీవితాన్ని చావుమయం చేస్తున్నారు / నవ్వుల్నీ స్నేహాల్నీ మంటల్లోకి తోసేస్తున్నారు / కొన్ని సార్లు జీవితం చావుకంటే భయపెడుతుంది' -( కూర్మనాధ్ - 'ఎడతెగని జ్ఞాపకం')   

2013 లో ప్రత్యేకంగా ప్రస్తావించవలసింది తెలుగు కవిత్వం లో కొత్తగా వెలుగు చూసిన  25 - 30 ఏళ్ళ లోపు యువతీ యువకుల కవిత్వం. ఎవరన్నారు, ఇప్పటి తరానికి కవిత్వం పట్టదని? .... ఒక్క సారి ఈ కవితా వాక్యాలు చదవండి  'తత్వం బోధపడడానికి / చాలా రాత్రులూ కొన్ని పగళ్ళతో గతానికి కట్టేసుకున్నాక / మెలకువొచ్చేప్పటికి నాలో నాకు దూరం కొన్ని జన్మలై' - (వంశీధర్ రెడ్డి -'డివైన్ ట్రాజెడీ' )
'ప్రియురాండ్ల చేతుల్లో పిల్లలు నవ్వుతారు / నెలవంక నెత్తి మీద నక్షత్రం వెలుగుతుంది' - (నంద కిషోర్ - 'ఊరి పొలిమేరల్లో')
 ‘శబ్దించలేని స్వరాలు కొన్ని / ఎస్సెమ్మెస్ లై / లోపలి అరల్లో పుట్టేస్తున్నాయ్...’ (నరేష్ కుమార్ - 'నో కామెంట్స్')
అంతే కాదు, ఇంకా పాతికేళ్ళు కూడా నిండని నంద కిషోర్ 'నీలాగే ఒకడుండేవాడు' కవితా సంకలనం కూడా 2013 లో ప్రత్యేకంగా ప్రస్తావించవలసిన పుస్తకం !
అయితే, యువతరం తమ కవిత్వాలలో తమ తరం పద జాలాన్నీ, తమ బతుకు యాతననీ  తీసుకు రావాలనీ, కవిత్వానికి ఆత్మ లాంటి తాత్వికతని సాధించాలని  కూడా ముందు తరం కవులు ఆశ పడుతున్నారు. మరి, అదే సమయంలో ఈ నవ  యువతరం కవిత్వాన్ని బాహువులు విప్పార్చి ఆహ్వానిస్తున్నామా?  
* * *
కేవలం కవితలే కాదు .... లబ్ద ప్రతిష్టులైన కవులు, శివారెడ్డి ('గాథ), ఎన్ గోపి ('హృదయ రశ్మి'), పాపినేని శివ శంకర్ ('రజనీ గంధ'), ఆశారాజు ('నూతన పరిచయం'), హెచ్చార్కె ('గొడ్డలి భుజం'), దర్భశయనం శ్రీనివాసాచార్య ('పొలం గొంతుక') ల కవితా సంకలనాలతో పాటు, ప్రముఖ కవులు, శిలాలోలిత ('గాజు నది'), ముకుంద రామా రావు ('విడని ముడి'), పలమనేరు బాలాజీ ('ఇద్దరి మధ్య'), తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ ('మాకూ ఒక భాష కావాలి'), ఏనుగు నరసింహా రెడ్డి ('కొత్త పలక') ల కవితా సంపుటులు కూడా 2013 లో వెలువడ్డాయి-

ఇవే గాక, ఉర్దూ - తెలుగు కవితల సంగమ సంకలనం 'రజ్మియా' (సంపాదకుడు - స్కై బాబా), ఇతర భారతీయ భాషలలోని ఉత్తమ కవితల అనువాదాల సంపుటి - 'పొరుగు వెన్నెల' (అనువాదం - ఎలనాగ ),   హైదరాబాద్ కవుల కవితా సంకలనం - 'ములాఖత్', నోబెల్ బహుమతి పొందిన కవుల జీవిత విశేషాలు, కవితల సమాహారం - 'నోబెల్ కవిత్వం' (ముకుంద రామారావు), పర్యావరణం పైన కవి లాబన్ బాబు వ్రాసిన కవిత్వం 'వాయుగానం', కట్టా శ్రీనివాస్ 'మట్టి వేళ్ళు'  మొదలైనవి కూడా ఈ కాలం లోనే విడుదలయ్యాయి -
* * * *
కవిత్వం అయినందుకే కాదు .... ముగ్గురు  మంచి కవులను పోగొట్టుకున్నందుకు కూడా ఈ సంక్షుభిత కాలం జ్ఞాపకం వుంటుంది -
'ఈ ప్రపంచం, ఈ సూర్య చంద్రుల బొమ్మలూ / ఈ కొబ్బరి చెట్ల సముద్రపు వెన్నెల్లూ / ఈ సైగల్ విషాదాలూ ఈ గృహాలూ / ఈ గుండెల్లోని ఆరిపోని ప్రేమలూ / అన్నీ అన్నీ డూమ్డ్ డూమ్డ్' అని అంతిమ సత్యం కోసం కవిత్వంలో నిరంతరం అన్వేషించిన 'త్రిపుర'నీ, 'నేను ఎప్పుడు పుట్టానో తెలియదు గానీ / వేల ఏళ్ళ క్రితం ఈ గడ్డ మీదే చంప బడ్డాను ' -అని సవర్ణ  సమాజం పైన దళితాగ్రహాన్ని  ప్రకటించిన  కలేకూరి ప్రసాద్ నీ,  'యుద్ధంలో నువ్వు / నీతో యుద్ధం చేస్తూ నువ్వు / నీలో నీతో యుద్ధాన్ని చూస్తూ నువ్వు' - అని మనిషి తనతో తాను నిరంతరం సలిపే యుద్ధాన్ని తాత్వీకరించిన కవి కె ఎస్ రమణ నీ ఈ కాలమే తనలో కలిపేసుకుంది.




కానీ, ఏ కీర్తి వ్యామోహాలకై వెంపర్లాడ కుండా నిజాయితీగా కవిత్వ సృజన చేసే కవికి మరణం ఉంటుందా? ఉండదని చెప్పేందుకు ఇటీవలి దాఖలా - ఈ కాలంలోనే వెలువడిన కవి 'అలిశెట్టి ప్రభాకర్' సమగ్ర కవితల సంపుటి….. ప్రజాకవి కాళోజీ స్మరణలో ప్రజలు ఆయన శత జయంతి ఉత్సవాలను ఈ కాలంలోనే  ప్రారంభించుకున్న సంగతి !

కామెంట్‌లు లేవు: