4, మే 2014, ఆదివారం

ఎంత పొరబడ్డాము పవన్ !

నమస్తే తెలంగాణ 29 April 2014– ఎడిట్ పేజి
ఎంత పొరబడ్డాము పవన్ !
‘తెలుగు సినిమా హీరోలకు మన సామాజిక ఉద్యమాల గురించీ, మన సాహిత్యం గురించీ, మన గద్దర్, మన వంగపండు గురించీ ఏమీ తెలియదు’ అని చాలా మంది మధ్య తరగతి బుద్ధి జీవుల లాగే నేనూ భావించే కాలంలో ‘పవన్ కళ్యాణ్’ ఒక ఆశ్చర్యం నాకు ..... అతడు నా తరం వాడు కావడం, పైగా మెగా స్టార్ తమ్ముడై వుండి కూడా ఉద్యమాలని, సాహిత్యాన్ని కొద్దిగానైనా పట్టించుకోవడం అప్పట్లో పెద్ద ఆశ్చర్యం నాకు! అన్నింటికీ మించి నా తరమే కాదు, నా ముందు, వెనుక తరాలు కూడా ఎంతో వెర్రిగా అభిమానించే ‘చేగువేరా’ బొమ్మని అతడి సినిమా సన్నివేశాలలోనో, రణగొణ ధ్వనుల పాటల నడుమో చూపించడం ప్రారంభించాక, ‘వాణిజ్య సినిమాల  కథానాయకుడు అయి వుండి కూడా, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందికి ఆరాధ్యుడైన చే పట్ల ఏదో ఒక రూపంలో గౌరవాన్ని ప్రదర్శిస్తున్నాడు .... మరీ ముఖ్యంగా, ఈ తరానికి చేని జ్ఞాపకం చేస్తున్నాడు’ అని కొంత సంతోషించాను ..... ‘తెలుగు సినిమా హీరోలలో పవన్ కొంత భిన్నమైన వాడు’ అనుకుని అభిమానించాను. చివరికి, ఆ నడుమ ‘జల్సా’ పేరుతో వొచ్చిన సినిమాలో తాను పోషించిన మాజీ నక్సలైట్ ‘సంజయ్ సాహు’ పాత్ర తీరు తెన్నులు చూసి ‘ఈ పవన్ కళ్యాణ్ చాలా అయోమయంలో వున్నట్టున్నాడే’ అని ఒకింత జాలి పడి కూడా, ‘పోనీలే .... ఫక్తు భారీ బడ్జెట్ వాణిజ్య చిత్రంలో ఈ మాత్రం ఉద్యమ ప్రస్తావన అన్నా తెచ్చాడులే’ అని నాకు నేను సర్ది చెప్పుకున్నాను. ఈ ‘జల్సా’ సినిమాలో నిరుపేద రైతు కుటుంబం నుండి ఉద్యమం లోకి వెళ్లి, తరువాత ఉద్యమం నుండి బయటికి వొచ్చిన హీరో గారు ఒక వైపు విశ్వ విద్యాలయం లో చదువుకుంటూ, మరొక వైపు ఒక ఖరీదైన ఇంట్లో స్నేహితులతో కలిసి మందు తాగుతూ, అమ్మాయిల వెంటపడుతూ, ఒకప్పుడు అడవిలో తనని ‘ఎన్ కౌంటర్’ చేయడానికి వొచ్చిన పోలీస్ ఆఫీసర్ కూతుర్లనే ఒకరి తరువాత మరొకరిని ప్రేమిస్తూ,  ‘జల్సా’ చేస్తుంటాడు.
ఇంత ఉపోద్ఘాతమూ ఎందుకంటే, ఒక పెద్ద కమర్షియల్ హీరో అయి వుండీ పవన్ కళ్యాణ్ నా తరం, నా తరువాతి తరం లోని బుద్ధి జీవులలో సృష్టించిన ఒక ఆశ ! .... మరీ ముఖ్యంగా ‘చేగువేరా’ బొమ్మని తగిలించుకుని చేసిన హంగామా !
‘పవన్ కళ్యాణ్ రాజకీయ పార్టీ’ అన్న మాట విన్నపుడు, మొదట నేను నమ్మలేదు .... ‘చేగువేరా ని ఇంత వెర్రిగా అభిమానించే వాడు ఒక పార్టీ పెట్టి ఈ ఎన్నికల గోదా లోకి దిగి మార్పు తీసుకు రాగలనని అమాయకంగా అనుకుంటాడా ?’ అని చిన్న అనుమానం ! ... Democracy cannot consist solely of elections that are nearly always fictitious and managed by rich land owners and professional politicians’ అన్న చే గువేరా మాటని చదువుకుని ఉంటాడు గదా, అని చిన్న ఆశ!

నిజానికి, ‘అన్నయ్య’ చిరంజీవి రాజకీయాలలోకి రావడాన్ని కూడా యిష్టపడలేదు నేను. దానికి, చిన్న కారణం ఒకటుంది. కన్నడిగుల నడుమ ఏవైనా సమస్యలొస్తే, వాటిని కొంత మేరకైనా చల్లబరచడానికి ‘అందరికీ ఆమోదయోగ్యుడైన వ్యక్తి’ గా కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ వుండేవారు. ఈ రహస్యం తెలుసుకున్నాడు కాబట్టే, రాజ్ కుమార్ రాజకీయాలకు దూరంగా వున్నారని నా అభిప్రాయం. స్వర్గీయ ఎన్ టి ఆర్ తరువాత ఆ స్థాయి లభించిన అదృష్టవంతుడు చిరంజీవే! రాజకీయాల లోకి రావడం ద్వారా, ‘అందరి వాడు’ కాస్తా ‘ఎవరికీ పట్టని వాడు’ అయిపోయాడు!          
2
పోనీలే ....పవన్ రాజకీయ పార్టీ పెడితే పెట్టాడు ... జనం లో, ముఖ్యంగా యువకులలో తన పట్ల వున్న అభిమానాన్ని ఆసరా చేసుకుని, నిజాయితీ పరులైన మేధావుల సాయంతో ప్రత్యామ్నాయ రాజకీయాలని ప్రజల లోకి తీసుకుపోయే చిన్న ప్రయత్నం చేయకపోతాడా అని ఆశపడ్డాను.  పార్టీని మూసేసిన అన్నయ్యతో పవన్ విభేదించాడని చదవడం కూడా ఇలా ఆశ పడడానికి ఒక కారణం!
కానీ పవన్ ! .... ఎంత నిరాశ పరిచారు నా లాంటి వాళ్ళని!
మీరు మామూలుగా ‘హటావో’ నినాదాన్ని ఎత్తుకుని వుంటే, అది పెద్దగా పట్టించుకోదగిన అంశం కాదు నాకు.  ‘రాష్ట్ర విభజన ఈ దేశ సమగ్రతకు భంగం కలిగించే అంశం’ గా కొందరు రాజకీయ నాయకుల మనసుని కష్టపెట్టినట్టు గానే, మీ మనసుని కూడా కష్ట పెట్టిన క్షణం లో మీరు ప్రజల ముందుకు వొచ్చి మాట్లాడారు. ఫక్తు రాజకీయ నాయకుల లాగా మీరు కూడా ‘తెలుగు జాతిని అవమాన పరిచారు’ ‘రాష్ట్రాన్ని విడదీయాలన్న నిర్ణయాన్ని గంటలో తీసుకున్నారు’ అని మాట్లాడడం చూసి ‘పవన్ ..... యూ టూ’ అని ఒక్క క్షణం నిట్టూర్చాను.
అక్కడికీ ‘పోనీలే ... ఏదో బాధలో వున్నట్టున్నాడు ‘ అని నాకు నేను సర్దుకుని చెప్పుకునే లోగానే, ఈ ఎన్నికలలో ఎవరి పక్షాన శంఖం ఊదబోతున్నారో ప్రకటించారు. ‘కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడం సరి కాదు’ అని ప్రవచించి, మీరిపుడు ఎవరి వైపు నిలబడ్డారు పవన్ ?
‘రాజకీయ కారణాలతో రాష్ట్రాన్ని విడదీస్తారా ?’ అంటూ మీరు ప్రదర్శించిన ఆగ్రహాన్ని అర్థం చేసుకోగలను. మరి, పదేళ్ళ క్రితం, మూడు రాష్ట్రాలు యిచ్చి కూడా, ‘సంకీర్ణ ప్రభుత్వం లోని భాగస్వాముల అభ్యంతరం వల్లనే తెలంగాణా యివ్వలేకపోయిన’ కూటమికి ఇప్పుడు మీరు మద్దతు ఇవ్వడాన్ని ఒక తెలంగాణ వాడిగా నేనెలా అర్థం చేసుకోవాలి ? పదేళ్ళ క్రితం సంగతి ఎందుకు పవన్ ? ...  2009 వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రకటన చేసిన తరువాత ఏ ఏ రాజకీయ నాయకులు ఎన్నెన్ని ఎత్తులు వేసారో మీకు తెలియదా?

క్రితం సంవత్సరం,  రాష్ట్ర విభజన నిర్ణయం వొచ్చాక, తిరిగి నాటకాలు మొదలు పెట్టిన రాజకీయ నాయకులు, తమ పార్టీల సమావేశాలలో ఏ నిర్ణయాలు తీసుకున్నారో, మేనిఫెస్టో లలో ఏ వాగ్దానాలు చేసారో, శ్రీ కృష్ణ కమిషన్ ముందు ఎన్ని అవతారాలు ఎత్తారో, అంతిమంగా చట్ట సభలలో తెలంగాణ బిల్లు వోచ్చినపుడు ఎవరెవరు ఎంత విజ్ఞతతో ఆ బిల్లు పైన విపులంగా చర్చించారో మీరు తెలుసుకునే ప్రయత్నం చేయలేదా?
నిజం చెప్పండి పవన్ ! .... అన్నయ్య కోరినట్టుగా లేక మరి కొందరు రాజకీయ నాయకులు కోరినట్టుగా తెలంగాణ లోని ఐదు జిల్లాలు కలిసిన హైదరాబాద్ ని ‘కేంద్ర పాలిత ప్రాంతం’ చేసి, తెలంగాణ యిచ్చి వుంటే కూడా, మీ అందరి గుండెలూ ఇలా రగిలి పోయి ఉండేవా ? .... ‘తెలంగాణ కు మేము అడ్డం కాదు, నిలువు కాదు’ అని ఎన్నికల సీజన్ లో ఓట్ల కోసం కబుర్లు చెప్పిన రాజకీయ నాయకుల సంగతి సరే .... ‘తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకోవడమంటే, అందులో హైదరాబాద్ వుంటుంది’ అన్న చారిత్రక నిజాన్ని మీ లాంటి వారు కూడా ఎలా విస్మరించారు ?
3
విభజన బాధ మీకే కాదు పవన్ ! నా లాంటి వాళ్ళకూ కొద్దిగా వుంది. ఒక రాష్ట్రంలో ఉన్నాము కాబట్టి కదా, నేను ఇష్టపడే నా సహ కవులు, రచయితలని తరచుగా కలుసుకుని దగ్గరయ్యాను .... మరీ ముఖ్యంగా, నేను యిష్టపడిన అమ్మాయి నా జీవిత భాగస్వామి అయింది. సరే, ‘ఎవరో రెచ్చగొట్టడం వలన ఇప్పుడు రాష్ట్రం విడిపోయింది’ కాబట్టి, ఇప్పుడు మేము శత్రువులుగా మారిపోము గదా! రాష్ట్రం విడిపోయింది కాబట్టి, నా మీద అభిమానంతో నా కోస్తా స్నేహితులు పంపిన కాకినాడ కాజాలు, ఏలూరు గోదావరి రొయ్యలు చేదుగా మారిపోవు కదా! వైషమ్యాలు పెంచే వారు అంటారా ... అలాంటి వాళ్ళు, ఏ కాలంలో నైనా, ఎక్కడైనా ఏదో ఒక రూపంలో వుంటారు!  
అయినా పవన్!  తెలంగాణా ప్రజలు ‘తెలంగాణా’ రాష్ట్రాన్ని డిమాండ్ చేయడానికి ముందు, ఒప్పందం ప్రకారం తమకు దక్కవలసిన నీళ్ళు, నిధులు, ఉద్యోగాల గురించి కదా డిమాండ్ చేసింది .... తమ సంస్కృతి, తమ భాష హేళన కి గురి అవుతున్నపుడు అట్లాంటివి కట్టి పెట్టమని కదా డిమాండ్ చేసింది ..... ‘పిచ్చి పిచ్చిగా మాట్లాడే నాయకుడు’ తన స్వార్థం కోసం ఈ సమస్యలకు పరిష్కారం ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మాత్రమె’ అని తెలంగాణ ప్రజలని పోగేసాడే అనుకోండి .... మరి, మిగిలిన రాజకీయ పార్టీలు తెలంగాణ లేవనెత్తిన సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేయకుండా, ‘తెలంగాణ సమస్యల పరిష్కారం రాష్ట్ర ఏర్పాటు లోనే వుంది’ అని ఎందుకు ఒప్పుకున్నట్టు ? తెలంగాణ చుట్టూ ఇన్నిన్ని రాజకీయ క్రీడలు ఎందుకు ఆడినట్టు ? నిజానికి, ఎప్పటికప్పుడు మీ లాంటి దేశభక్తులు స్పందించి వుంటే, ‘తెలుగు జాతి విచ్చిన్నం’ జరిగి వుండేది కాదు గదా !
ఇవాళ ఎక్కడో ఢిల్లీ లో వున్న వాళ్ళని ఆడిపోసుకుంటున్నారు గానీ, ఈ సమస్యని అక్కడి దాకా లాక్కుని వొచ్చింది ఎవరు? తెలంగాణకు జరుగుతూ వొచ్చిన అన్యాయాల గురించి కూడా మీ లాంటి జాలి హృదయం కలిగిన కథానాయకులు కొంచెం స్పందించి, సమస్యల పరిష్కారానికి చొరవ చూపి వుంటే, పరిస్థితి ఇక్కడి దాకా వొచ్చి వుండేది కాదు గదా!

ఇంతా చేసి, ‘తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నేను వ్యతిరేకం కాదు గానీ ......’ అని మళ్ళీ ఫక్తు రాజకీయ నాయకుడి సన్నాయి నొక్కుల స్టేట్ మెంట్ యిస్తారు మీరు. ఫరవా లేదు పవన్ .... ఇప్పటికైనా మాకు ఒకసారి వివరించండి .... వీలయితే, మీరు మద్దతు పలికిన కూటమి లోని పార్టీలతో కలిసి వివరించండి .... రాష్ట్ర విభజన ఏ రూపం లో జరిగి వుంటే మీకు అంగీకార యోగ్యంగా వుండేదో ?      
4
ఇవాళ తెలంగాణ లో ఒక్కొక్క చోట మీరు మాట్లాడుతూ వుంటే అనిపిస్తోంది పవన్ ... ‘అన్నయ్యే నయం’ అని! .... బహుశా, చే గువేరా గురించి అన్నయ్యకు పెద్దగా తెలియకపోవడం ఆయన అదృష్టం అనుకుంటా! ... విభజన నిర్ణయం రాగానే, ఎక్కువ మాట్లాడకుండా,  ‘నేను సమైక్యం’ అని గోడ దూకేసాడు.
మిమ్మల్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి పవన్? .... ‘తెలంగాణ నా నరనరాల్లో వుంది’ ‘మన తెలంగాణ’ అని బిగ్గరగా మాటలు చెబుతారు. చాలా సంతోషం ! మరి, మీ నర నరాలలో వున్న తెలంగాణ కు, తెలంగాణ గుండె చప్పుడు అర్థం కావడం లేదా? అర్థం అయి వుంటే, తెలంగాణ యువకులు చనిపోతున్నపుడు మీరు ఒక్క రోజైనా వొచ్చి ధైర్యం చెప్పి వుండే వారు కదా! ... ఇవాళ ‘హటావో’ అని మీరు చేస్తోన్న నినాదాలు యేవో అప్పుడే తెలంగాణ పక్షాన నిలబడి చేసి వుండే వారు కదా!
తెలంగాణ విషయంలో ఫక్తు రాజకీయ నాయకుడైన ఒక జగ్గారెడ్డి మాటలు వినిపించినంతగా, ఒక ఆర్ నారాయణ మూర్తి మాటలు, కవి పైడి తెరేష్ బాబు మాటలు మీకు వినిపించలేదంటే, మీరు ఏ స్థితిలో వున్నట్టు?
చే గువేరా ఏమన్నాడో మరిచి పోయారా పవన్ ? ... If you tremble indignation at every injustice, then you are a comrade of mine ….  చివరికివాళ ఎవరి కామ్రేడ్ గా మారిపోయారు పవన్ మీరు ? ఎవరిపై యుద్ధానికి ఎవరితో జతగట్టారు మీరు?
5
పవన్! ... ఒక్క తెలంగాణ అంశమే కాదు .... మీరు లేవనెత్తిన యితర అంశాలు కూడా నా లాంటి వాళ్ళని విభ్రాంతికి గురి చేసాయి. చే గువేరా ఫోటో పెట్టుకుని తిరిగే ఇతనేనా ఇలా మాట్లాడుతున్నది అని ఒకింత షాక్ కి గురయ్యాము. మిమ్మల్ని విమర్శించింది వి హనుమంత రావు గారయితే, ఆయన అల్లుడి గురించో, మరొకరి గురించో జనాలకు చెబుతానని అనడం ఏమిటి పవన్? .... పార్టీల వసూళ్ళ గురించి, వాటి లెక్కల గురించీ తప్పకుండా ప్రశ్నించవలసిందే .... అయితే, ఆ లెక్కలేవో మీరు ఒక్క పార్టీనే ఎందుకు అడిగినట్టు?

ఆ మాటకొస్తే, మీ సినిమా రంగం లో అందరూ లెక్కలన్నీ సరిగ్గానే చూపిస్తున్నారా? రూ. 50000 దాటిన ప్రతి లావాదేవీ చెక్కు రూపంలో వుండాలని చట్టం చెబుతోంది.  రెమ్యునరేషన్ కోట్లల్లో తీసుకునే మీ లాంటి కథానాయకులు మీ లావాదేవీలన్నీ చెక్కుల రూపం లోనే జరుపుతున్నారా? ఆ రంగం లో వున్న వాడిగా మీరు మొదట ప్రశ్నలు ఎక్కు పెట్టవలసింది అక్కడ కదా  పవన్ !      

 ‘కుటుంబ పాలన’ అంటూ ఒక్క తెలంగాణ పార్టీనే లక్ష్యం గా చేసుకుని మీరు మాట్లాడిన మాటల్ని మేమెలా అర్థం చేసుకోవాలి పవన్? .... మీరు మద్దతు ప్రకటించిన కూటమి లోని పార్టీలలో కుటుంబాలు లేవా? అన్నయ్య ప్రజారాజ్యం పార్టీని నడిపింది కుటుంబ సభ్యులే కదా! ... అంతెందుకు ? ‘సినిమా రంగాన్ని శాసిస్తోన్నది రెండు మూడు కుటుంబాలు’ అని మీ సినిమా వాళ్ళే గగ్గోలు పెడుతున్నారు కదా! .... కుటుంబం పేరు ఆసరాతో సరాసరి అతి పెద్ద అధికార కేంద్రాన్ని ఆక్రమించడం గురించి ‘మీరు కామెంట్ చేయడం’ మరింత హాస్యాస్పదం పవన్! ... అన్నయ్య నేపథ్యం లేకపోయి వుంటే, మీ కుటుంబం లో అంత మంది యువకులు, కనీసం ఒక సహాయ నటుడి పాత్ర కూడా పోషించాకుండానే, ఎకాఎకీ హీరోలుగా రంగ ప్రవేశం చేసే వారా ?
కుల మతాల పట్టింపులు లేని మీ ఆదర్శాన్ని అభినందిస్తాము పవన్ ! ... కానీ, తెలుగు వాళ్ళ అధికార రాజకీయాలన్నీ కొన్ని అగ్ర కులాలకే పరిమితమై పరిభ్రమిస్తున్నాయన్న వాస్తవాన్ని మీరెలా మరిచారు? 

ఈ ఎన్నికల ప్రచారంలో ‘దొరల పాలన వొస్తుంది’ అని తెలంగాణ ప్రజలని భయపెడుతోన్న వాళ్ళందరూ ఒక చారిత్రక వాస్తవాన్ని మరిచిపోతున్నారు పవన్! ... దొరల పెత్తనం మీద సాధారణ రైతు కూలీలు, ప్రజలు ఆసియా చరిత్రలోనే అతి పెద్దదైన సాయుధ పోరాటం చేసి, విజయం సాధించిన చరిత్ర తెలంగాణది! 
6
అయినా పొరపాటు మాదే పవన్! చే గువేరా, పూలే, భగత్ సింగ్, అంబేద్కర్ లాంటి మహానుభావుల ఫోటోలతో కనిపించే మిమ్మల్ని చూసి,  నా లాంటి వాళ్ళం ఎక్కువగా ఊహించేసుకుని భంగ పడ్డాము. మీరు కూడా ‘చే’ ఎవరో, గద్దర్ ఎవరో, వంగపండు ఎవరో తెలీని చాలా మంది సినిమా హీరోలలాగే వుంటే, ఇవాళ ఇలా పేస్ బుక్ లాంటి సోషల్ నెట్ వర్క్ లలో, దినపత్రికలలో పడి, ఇట్లా మా నిరసనని, బాధనీ వ్యక్తం చేస్తూ ఈ నాలుగు రాతలు రాసే అవసరం వొచ్చేది కాదు!  
అందుకే, మాదొక విన్నపం పవన్! ఇక ముందు చే గువేరా బొమ్మని తగిలించుకుని మీరు మద్దతు పలుకుతోన్న ఈ వృత్తి రాజకీయ నాయకుల పక్కన కనిపించి, మా మనసుల్ని మళ్ళీ గాయపరచకండి! నా మిత్రుడు రామ్మోహన్ అన్నట్టు ‘ఆ ఫుటువా మాత్రం పెట్టమాకయ్యా! .... నీకు పుణ్యముంటది!’
చివరాఖరుగా ఒక మాట ! .... ‘రాష్ట్రం యిచ్చినందుకే దేశ సమగ్రతకు ముప్పు కలిగిందని’ బెంబేలెత్తి పోయి, ‘దేశ సమగ్రతని పరిరక్షించడం కోసం ప్రాణాలని అర్పించే మొదటి పిచ్చివాడిని నేనే అవుతా’నని చాలా ఆవేశంగా అన్నారు. మీకు అంత శ్రమ అవసరం లేదు పవన్ !
చే గువేరా నే చెప్పినట్టు – ‘Liberators do not exist. People liberate themselves’
* * * * *
         -కోడూరి విజయకుమార్ 

కామెంట్‌లు లేవు: