26, మే 2013, ఆదివారం

రాత్రే కదా...

 రాత్రే కదా... 

పగలే కాదు .... రాత్రి కూడా
వొకటి ఉందన్న చేదు  నిజం
రాత్రయ్యాకే గుర్తుకొస్తుంది

రాత్రి తీరం లో నిదుర లంగరు
వేయాల్సిన తంతుని సూచిస్తూ
ఏడ్చే శునకాలూ.... నిశ్శబ్దమైన వీధులూ

గాయపడిన క్షణమొకటి జ్ఞప్తికి వొచ్చి
మూసిన కనుల పైన కత్తుల కోలాటం ఆడుతుంది
గాయపడినపుడు ఉబికిన రక్తపు తడి ఏదో
మేను వాల్చిన పక్క పైన ముళ్ళ వలె గుచ్చుకుంటుంది

పగలంతా మనుషుల నడుమ
మనుషుల సంభాషణల నడుమ
ఎలాగో ఒకలా తప్పించుకున్నా
రాత్రికి గుండెని చేరిన గాయం మెలిపెడుతుంది

తెరలన్నీ ఒకటొకటే తొలగిపోతూ
తెలిసిపోతూ వుంటుంది లోలోపల ....
నిజమని నమ్మిన ప్రేమలూ, అనుబంధాలూ
అహం గీత దగ్గరే తేలిపోయే దూది పింజలని

ఎవరిని నిందించ డానికీ మనసొప్పదు
పొరపాటు ఎవరిదో అంతు పట్టదు
ఎంత ప్రయత్నించినా రాయిలా మారని
మనసు రోదించడం మానదు

'ఇక్కడిదాకా ఈదుకుంటూ వొచ్చాము
ఇక ఇక్కడ విశ్రమిద్దామని' అనుకునేలోగా
థ్రిల్లర్ మూవీ లోని 'ఇంటర్వెల్ బ్యాంగ్' లా  
జీవితం ఏడు  పడగల నాగుపామై బుసలు కొడుతుంది

ఇక అప్పుడు ఏం చేస్తాము
నువ్వయినా , నేనయినా

రక్తపు తడిలో తడిసిన
నాలుగు కవిత్వ పాదాలని
నీలాంటి, నాలాంటి నలుగురితో
ఈ రాత్రి తీరంలో ఇలా  పంచుకుంటాము
పండగ చేసుకుంటాము








కామెంట్‌లు లేవు: