19, జులై 2011, మంగళవారం

కోల్డ్ వార్

painting by AKBAR


అతడు ... ఆమె ... పిల్లలు ... ఒక చిన్ని ప్రపంచం
అప్పటిదాకా అలా హాయిగా
సెలయేటి మీది నావలా సాగిపోయే ప్రపంచం
సముద్రపు అలలు ఢీకొన్న పడవలా తిరగబడుతుంది
వేసవికాలపు సాయంత్రాలు
ఏటి వొడ్డున షికారు చేసిన
సుస్వర యుగళగీతమేదో రెండు ముక్కలై
శీతాకాలపు నిశిరాత్రి
ఏకాంత విషాదగీతాలుగా పొటమరిస్తుంది

***

యుద్ధం రాబోతున్న సంకేతమేదీ వుండదు
ఒక్కోసారి యుద్ధం మొదలైందన్న సంగతే తెలీదు
మాటల యుద్ధం మొదలయ్యేక
అతడే ప్రారంభించాడని ఆమే ...
ఆమే ప్రారంభించిందని అతడూ ...
పరస్పర నిందారోపణల రుసరుసలు
రెండు అధికార కేంద్రాల నడుమ
అంతర్యుద్ధంలో నలిగిన ప్రజల్లా పిల్లలు

***

కొంత ముందుకు సాగేక
యుద్ధాన్ని సృష్టించిన కారణాలు మాయమవుతాయి
అప్పటిదాకా సాగిన ఇద్దరి ప్రయాణంలోని
పూల పరిమళం మరుగునపడి
ముళ్లగాయాల ఏకరువు మొదలవుతుంది
ఇక మామూలు అస్త్రశస్త్రాలు వొదిలి
దాచిన బ్రహ్మాస్త్రాలతో దాడి ...

అపుడెపుడో అతడివైపు వాళ్లు
అవమానించిన గతాన్ని తవ్విపోస్తూ ఆమె
తన ఫీలింగ్స్‌ని ఆమె పట్టించుకోని
పాతరోజుల్ని తిరగేస్తూ అతడు
ఇరువేపులా మోహరించిన శత్రుసైన్యాల్లా
ఇద్దరి మాటలూ ...
అన్ని అస్త్రశస్త్రాలూ ఆవిరయ్యాక
ఒకరి పట్ల ఒకరికి ప్రేమలేదని
ప్రకటించేసుకుంటారు
ఇక ఇద్దరి నడుమా
గడ్డకట్టిన మాటల గోడ వొకటి ...

***

పరాయిగూట్లో వాలిన పక్షుల్లా
ఇంట్లో ఇద్దరూ అలా అసహనంగా ...
గ్రహాంతరవాసుల్ని చూసినట్లు
వాళ్లని గమనిస్తూ పిల్లలు ...
గలగల మాటల పిచ్చుకలేవీ వాలక
మోడువారిపోయే ఇంట్లో గదులు ...
ఎదుట నిలిచి కళ్లలోకి చూసే ధైర్యముండదు
విడిచి దూరంగా వెళ్లే ద్వేషముండదు
కాలం గడిచేకొద్దీ
గోడకు ఇరువేపులా నిలబడి
అది ధ్వంసమయే క్షణానికై
ఎదురుచూస్తూ వాళ్లిద్దరూ ...

***

చొరవ అతడిదో, లేక ఆమెదో
ఒక చిరునవ్వో, ఒక క్షమాపణో, మరేదో ...
త్వరగానే గోడ ధ్వంసమైపోతుంది
తిరిగి ఇంట్లోని గదులన్నీ
మాటల గలగలల్లో తేలియాడుతూ ...
లోలోపల దాగిన ప్రేమలు
ఒక్కసారిగా పొంగి వుక్కిరిబిక్కిరి చేస్తూ ...
భీకరయుద్ధం సాగిన మరకలేవీ
మచ్చుకైనా ఇంట్లో కనిపించవు



[courtesy-ఆదివారం ఆంధ్రజ్యోతి : 03 జూలై 2011]

కామెంట్‌లు లేవు: