17, జనవరి 2012, మంగళవారం

ఒక ఆధునికానంతర మగ దురహంకార పద్యం



సందేహమెందుకు శ్రీమతీ!
ప్రపంచమొక కుగ్రామమైన  కాలంలో 
స్త్రీ పురుషుల నడుమ 
అసమానతలెపుడో అంతరించాయి గదా!
* * * * *
సాఫ్ట్ వేర్ వధువుకి, సాఫ్ట్ వేర్ వరుడే సరిజోడని 
మన తలిదండ్రులు మనల్ని ముడివేసిన క్షణం మధురం
(ఆరంకెల జీతానికి మరో ఆరంకెల జీతంతో 
జత కుదరడం మరీ మధురం)

డ్యామిట్!...కమాడిటీ లా కట్నానికి అమ్ముడు పోవడమా?
పెళ్లి తంతొకటి ఘనంగా జరిపిస్తే చాలనే అన్నాము కదా...
ఆడపిల్లకీ ఆస్తిలో వాటా వుందని చట్టం చెప్పబట్టీ 
నువ్వు కొన్ని బరువైన కానుకలు తెచ్చినా కాదనలేదు
('ఏ కానుకా ఇవ్వలేని పేదపిల్లని కట్టుకోలేకపోయావా?' 
అను మాట యిపుడప్రస్తుతం)

ఎంత అందమైన శ్రమ విభజన మన కాపురంలో 
ఇల్లు...హాల్లో ఆకర్షనీయంగా అమరిన సోఫాలు
నువ్వు ఏరి కోరి తెచ్చుకున్న కర్టెన్లు 
దూలిరేణువు కూడా నిలవని అద్దాల్లాంటి గదులు 
ఉదయమే ఘుమఘుమలతో పిలిచే వంటిల్లు 
మన యింటికంతా నీవే మహారాణివి

బజారునపడి బయటి ప్రపంచమంతా ఈదుతూ 
బ్యాంకు అకౌంట్లు , రియల్ ఎస్టేట్ పెట్టుబడులు 
షేర్లు, మ్యూచువల్ ఫండ్లు .....
సవాలక్ష తలనొప్పులతో సతమతమవుతూ నేను 
డార్లింగ్ !.... సున్నితమైన నీ మెదడు 
క్లిష్టమైన ఈ లావాదేవీలనెలా తట్టుకోగలదు? 

పనమ్మాయి రాని రోజున 
అంట్లు తోమాలనో, బట్టలారేయాలనో అనుకుంటా గానీ
'నీకది నచ్చదులే' అని మిన్నకుండి పోతాను...

ఆఫీసు నుండి వొచ్చి, నీరసంగా వుందని
నువ్వు మంచం మీద వాలిపోతే 
నేనే వంట చేద్దామనుకుంటా గానీ
అది నీకు రుచించదని క్యారియర్ పట్టుకొస్తాను 

పిల్లలకు నేప్కిన్ లు మార్చాలనీ,
టాయ్లెట్ కి వెళ్తే కడగాలనీ అనుకుంటా గానీ
'నువ్వంత శుభ్రంగా చేయవు' అంటావని మానేస్తాను 
ఇంటిపనీ, వంటపనీ స్త్రీలు చేసినంత అందంగా
పురుషులు చేయగలరా మై డియర్ ....?
* * * * *
ఫెమినిస్టులు కొందరు ఇంకా గగ్గోలు పెడుతుంటారు గానీ
శ్రీమతీ!....అసమానతలింకా అంతరించలేదా? 

[ఆగష్టు 2008  -ఆదివారం ఆంధ్రజ్యోతి ] ['అనంతరం' కవితా సంపుటి నుండి]

  

4 కామెంట్‌లు:

సామాన్య చెప్పారు...

కవిత చాలా బాగుంది సర్. బాదాకరమైన విషయమే అయినా నవ్వు తెప్పించింది.నాకు పర్సనల్గా నిజమో ... అబద్దమో ...వెరీ సీరియస్సో ...ఏది చెప్పినా వ్యంగ్యాన్ని మిళితం చేసి చెప్తే ఇష్టం .రావి శాస్త్రి పతంజలి,రంగనాయకమ్మ ,ఆర్ .కే నారాయణ్ ...లాటి వాళ్లు అందుకే ఇష్టం .మీ కవితలో అది ఉంది.అందుకని ఎక్కువగా నచ్చింది .అడిగిన వెంటనే పోస్ట్ చేసినందుకు థాంక్ యు సర్.

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@saamaanya...thanku for all ur good words....

కెక్యూబ్ వర్మ చెప్పారు...

సంకలనంలో ఎక్కువ మార్లు చదివిన కవిత....నచ్చిన కవిత...థాంక్యూ సార్ ఇక్కడ మరో సారి చదివించినందుకు...

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@varma....thanks a lot...!