12, డిసెంబర్ 2011, సోమవారం

సంజాయిషీ

                                                                                                           బొమ్మ: అక్బర్


సంజాయిషీ
నీ చుట్టూ పరచుకున్న బొమ్మల నడుమ
నన్నూ వొక బొమ్మని చేసి ఆడిస్తూ .. ఆడిస్తూ...
కల్మషమింకా అంటని నీ చూపుల్ని
క్షణకాలం నాకేసి విసిరి, చిట్టితల్లీ...!
క్లిష్టమైన వొక ప్రశ్నను నిలిపావు నా ముందు...
'నువ్వు అబ్బాయి పుట్టాలనుకున్నావా నాన్నా?' అని... 

ఏ రంగుల రాకాసి దృశ్యాలు
నీ అమాయక నేత్రాల్ని కలవరపరచి వుంటాయి?
ఏ మొరటు మనుషుల దయలేని మాటలు
ఎనిమిదేళ్ళ నీ పసి హృదయాన్ని గాయపరచి వుంటాయి?
గుండెను ఎవరో మెలిపెట్టినట్టు తల్లడిల్లిపోయానమ్మా...

నిజమే..కొన్ని బలహీన క్షణాలలో
నా అనాది మగ దురహంకారాల మైకంలో
అబ్బాయి పుట్టాలనే కోరుకున్నానేమో....

కానీ నా బంగారుతల్లీ...! నాలో జీవం నింపి..
నన్నొక మనిషిని చేసింది స్త్రీలేనని ఎలా మరిచిపోను?

జ్వరదేహంతో నేను దగ్ధమైన రోజుల్లో
మెలకువ చేతులతో నిద్రపుచ్చిన మా అమ్మ ....
బడికి వెళ్లనని మొండికేసిన తొలిరోజుల్లో
తాయిలం పెట్టి పంపించిన మా తాతమ్మ ...
రాకుమారి, మంత్రగాడు కథలతో
బాల్యపు రాత్రులకు రంగులద్దిన మా అమ్మమ్మ
ఎడారి పయనంలా సాగిన యవ్వన దినాలలో
వోరచూపుల, చిరునవ్వుల ఒయసిస్సులై
పలకరించిన సీతాకోక చిలుకలు .....
చివరికి..వొంటరి పక్షిలా గిరికీలు కొడుతున్నపుడు
నాకొక గూడుని సృష్టించిన నా సహచరి...
నా లోలోపలి లాలిత్యాన్ని రక్షించింది స్త్రీలేనమ్మా...

ఇప్పటికీ ఒక అపరాధ భావన నాలో...
నా తలిదండ్రులకు
నా చెల్లెళ్ళు పంచే ప్రేమ లోని మాధుర్యమేదో
నేను చూపించే ప్రేమలో లుప్తమయిందని...

కాకపోతే, నా చిట్టితల్లీ..!
చదువుల పట్టాలు ఎన్ని సాధించినా
కట్నాలతోనే విలువ కట్టే విపణి వీధులూ ...చివరికి
ఇంటికే పరిమితం చేసే మగ దుర్మార్గాలూ
అయిష్టాన్ని ప్రకటించిన అమ్మాయి ప్రేమను
'అమ్మాయి రంగు తెల్లన...హృదయం నల్లన'
అంటూ ఎగతాళి చేసే 'కోలవెర్రి' పాటలూ
అపుడపుడూ కళాశాలల గదుల్లో
నిర్లజ్జగా దొర్లే యాసిడ్ సీసాలూ ....
నన్ను భయపెడుతుంటాయి...

ఆ భయకంపిత క్షణాలలో మాత్రం
నిజంగానే...నిజంగానే అనుకుంటానమ్మా...
'నువ్వు అమ్మాయిగా పుట్టకపోతే బాగుండేది' అని...
రచనా కాలం: 06  డిసెంబర్ 2011
[ఆంధ్రజ్యోతి -నవ్య వీక్లీ 18-07-2012 సంచిక లో ప్రచురితం]

3 కామెంట్‌లు:

kiran చెప్పారు...

Mee kavitha chalaaala baagundi.
"kolaveri"okkati nachaledu.mee kavithalo yavvanam lo andamaina seetha koka chilukala gurinchi meerrannatte vallu kooda Edo teenage premani saradaga paadukonnaru,andanga kooda.(mana Telugu kula herollaga "appatikinkaa naa vayassu ninda padaharelle,....chuttoo cheyyestoooo.......ano,o pilla CHAV ...CHAV.....CHAV........ano analedu)

కోడూరి విజయకుమార్ చెప్పారు...

@kiran..thanku....అవునా ?....సీతాకోక చిలుకలు కూడా ఏదో కాస్త అందంగా పాడుకునే ఉంటారని నేను కూడా అనుకుంటున్నాను...కనీసం, అలా అనుకోవడం లో ఒక comfort వుంది .. : )))....
'కొలవెరి' నచ్చలేదా?...నిజానికి మిగిలిన పాట తో నాక్కూడా ఏ పేచీ లేదు...ఈ 'వైటు స్కిన్ను గర్లు...గర్లు..' అన్న వాక్యాలే అలా రాసేలా చేసాయి....

Kottapali చెప్పారు...

brilliant sir.