11, సెప్టెంబర్ 2011, ఆదివారం

గణేష్ నిమజ్జనం … హైదరాబాద్ -2011


గణేష్ నిమజ్జనం హైదరాబాద్ -2011

వరంగల్ లో వుండే రోజుల్లో హైదరాబాద్ లో భారీ ఎత్తున జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనే వొక బలమైన కోరిక వుండేది నాకు. 1998 సంవత్సరంలో బదిలీ మీద హైదరాబాద్ చేరుకున్నాక  ఆ కోరిక తీరింది. అందులోనూ, నేను అద్దెకి దిగిన గది కవాడిగూడ లో వుండేది. కవాడిగూడ నుండి ట్యాంక్ బండ్ కి నడిచి వెళ్ళేంత దూరం. అలా హైదరాబాద్  లో దిగిన తొలి  ఏడాది లో వొచ్చిన గణేష్ నిమజ్జనం రోజునాటి రాత్రి చాలా పొద్దు పోయే వరకూ [తెల తెల వారే వరకూ] అక్కడే గడిపి, అక్కడికి తరలి వొచ్చిన భారీ వినాయకులు నిమజ్జనం అవుతూ వుంటే చూడడం....ఆ జన సందోహం .... అదో మరిచిపోలేని అనుభవం.....

వరంగల్, హైదరాబాద్ తదితర తెలంగాణా పట్టణాలలో రంజాన్ రోజా దినాలలో మజీదులకు వెళ్ళే హిందువులు, గణేష్ నవరాత్రులను, నిమజ్జన ఉత్సవాన్ని హిందూ మిత్రులతో కలిసి చేసే ముస్లిములు కొల్లలుగా కనిపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలో రంజాన్ తదుపరి రోజు ముస్లిములు తమ హిందూ మిత్రులకు సేమియా పాయసం పంచడం .... అలాగే, దసరా తరవాత రోజున హిందువులు, ముస్లిములు 'అలాయ్ బలాయ్' తీసుకోవడం వంటి దృశ్యాలు ఈ పట్టణాలలో చాలా సాధారణం, ఇప్పటికీ...

సరే...ఈ తడవ గణేష్ నిమజ్జన ఉత్సవానికి నా వరకు నాకు వొక ప్రత్యేకత వుంది. ఈ సారి నాలుగో తరగతి చదువుతోన్న మా పాప 'కృష్ణ ప్రియ' తో కలిసి ఈ నిమజ్జనం చూడడానికి వెళ్లాను.  నిమజ్జనం రోజున ట్యాంక్ బండ్ మీద అలా నడిచి వెళుతూ వుంటే భలే చిత్రంగా వుంటుంది...'రోజూ క్షణం తీరిక లేకుండా పరుగులు తీసే వాహనాలని మోసే, ట్రాఫిక్ తో నిండి వుండే ఈ ట్యాంక్ బండ్ మీదేనా ఇప్పుడు మనం ఇలా తీరిగ్గా వెలుతున్నాము' అనిపిస్తుంది
ఇంతకీ .... 'తెలంగాణా ఇస్తే ఇక్కడ మత కలహాలు పెరుగుతాయిఅని అరిచే వాళ్ళు   ఈ రంజాన్వినాయక నవరాత్రి దినాలలో హైదరాబాద్ వీధులలో తిరిగి వుంటే  కాస్త జ్ఞానం అబ్బి వుండేది అని ఎందుకో అనిపించింది. మనలో మాట....మీలో ఎవరికైనా కూడా అలా అనిపించిందా?.... 







      

1 కామెంట్‌:

Afsar చెప్పారు...

"రంజాన్, వినాయక నవరాత్రి దినాలలో హైదరాబాద్ వీధులలో తిరిగి వుంటే వాటికి కాస్త జ్ఞానం అబ్బి వుండేది అని ఎందుకో అనిపించింది. మనలో మాట....మీలో ఎవరికైనా కూడా అలా అనిపించిందా?.... "

హైదారాబాద్ అపార్థం అయినట్టుగా, అర్ధం కాలేదు! ఇలాంటి రచనలు కాస్త కనువిప్పు అవుతాయి...విజయ్!