4, మార్చి 2013, సోమవారం

అతడూ .... నేనూ .... ఒక సాయంత్రం


అతడూ .... నేనూ .... ఒక సాయంత్రం  

రోజూ లాగే నేను నా దేవుడికి దండం పెట్టుకుని 
ఈ రోజుకి క్షేమంగా ఇంటికి తిరిగి వొచ్చి 
నా భార్యా బిడ్డలతో కలిసి భోజనం చేస్తే చాలనుకుని
పొట్ట చేత పట్టుకుని నగరం రోడ్డు మీదకొస్తాను 

అతడూ నా లాగే .... 
తన దేవుడికి దండం పెట్టుకుని, రాత్రికి క్షేమంగా 
తిరిగి వొచ్చి, భార్యా బిడ్డలతో భోజనం చేసే 
భాగ్యం చాలనే  చిన్ని కోరిక తోనే బయల్దేరతాడు 

ఆకాశాన్ని తాకే భవంతిని కలగన్నది లేదు 
కళ్ళు చెదిరే విలాసాలని కోరుకున్నది లేదు
పత్రికల్లో వార్తలు చదివి నిట్టూర్చడం తప్ప 
ఎవరి వికృత క్రీడలనూ ప్రశ్నించింది లేదు 

అతడైనా, నేనైనా పెద్దగా ఆశించింది లేదు 
ఈ మట్టి ఇంత అన్నం పెడితే అదే భాగ్యమనుకున్నాము 
ఈ దేశం బతికే భరోసాను ఇస్తే చాలనుకున్నాము
అతడూ, నేనూ ఒకరికి ఒకరం అనుకున్నాము 
* * * * *

అతడూ, నేనూ చాయ్ ని పంచుకునే ఒక సాయంత్రం
మళ్ళీ ఎవడో మా నడుమ ఒక విధ్వంసాన్ని నాటాడు 
అతడిని నా శత్రువు చేసే కుట్రని మరొక సారి కలగన్నాడు 
రక్తానికి రంగు పులిమే ప్రణాళిక రచించాడు 

చెల్లా చెదురైన దేహాలను అక్కున చేర్చుకుంటూ 
క్షణ కాలం చెదిరిన విశ్వాసాన్ని కూడదీసుకుంటూ
నా లాంటి, అతడి లాంటి ఎందరో ఒకరికి ఒకరై  
'అయ్యో దేవుడా'.... 'యా అల్లా' ..... 
  

విధ్వంసంతో మళ్ళీ కొన్ని దేహాలనైతే ధ్వంసం చేసాడు గానీ 
మా ఇద్దరి నడుమ విశ్వాసాన్ని స్పృశించలేక ఓడిపోయాడు 
ఇక, అతడూ నేనూ ఈ నిశ్శబ్దాన్ని  వీడి 
ఈ కుట్రల్ని ప్రశ్నించేందుకు రోడ్ల మీదకు రావాలి

('సాక్షి-సాహిత్యం 04 మార్చి 2013)

  

కామెంట్‌లు లేవు: