poetry లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
poetry లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

13, మే 2013, సోమవారం

క్యుములో నింబస్ 

జీవితం వేసవి గాలుల వలయంలో
ఉక్కిరిబిక్కిరి అవుతున్నపుడు
దిగులు మేఘమొకటి కమ్ముకుంటుంది
ముందస్తు కబురేదీ లేకుండానే

తడియారిన దేహాత్మలు

నిలువెత్తు దాహమై 
మరీచికల వెంట 
పరుగులు పెట్టే జీవితం 


ఈ దిగులు మేఘం ఇప్పటిదేనా?
నా పురా స్వప్నాలు కరిగీ, కరిగీ
నన్ను వెన్నంటే తిరుగుతోన్న
నా అనాది  వేదన కాదు గదా?



ఆకాశం, వొచ్చి వెళ్ళిపోయే మేఘాల
నడుమ శాశ్వత  నిర్మల నీలమా?
ఎప్పుడూ వెన్నాడే మేఘాల
నడుమ తళుకులీనే  నీలి తరంగమా?

స్నేహమో, ప్రేమో, మరి ఏ బంధమో 
పోగొట్టుకున్న ప్రతిసారీ 
కమ్ముకున్న దిగులు మేఘం ..... 
'కాలం మాన్పిన గాయాలు' వొట్టి భ్రమేనా?

ఇంతా చేసి, ఇది దిగులు మేఘమేనా?
నా బతికిన క్షణాలను కడుపులో 
దాచుకుని, అదృశ్యంగా నాతో సాగుతోన్న 
నా ఆదిమ మిత్రుడా? 

ఆకాశాన్ని పూర్తిగా కమ్మేసిన మేఘం  
కిటికీలోంచి చల్లని కబురు పంపించి
వీధి లోకి ఆహ్వానించింది  
తడిసి పొమ్మని .... తరించి పొమ్మని ... 

చేతుల్లోని కాగితపు పడవల్ని
సుతారంగా నీళ్ళ లోకి వొదులుతూ 
కిలకిలల సంగీతంతో పిల్లలు కొందరు... 
ఇక నేనూ ఒక కాగితం పడవనై పోవాలి   
(వాకిలి-ఇ పత్రిక 15 మే 2013)







 
 

    

27, ఏప్రిల్ 2013, శనివారం

పూలు మరణిస్తోన్న వేళ!

 

1
తనదే అయిన నేల కోసం స్వప్నించిన
మరొక పూవు వికసించకనే నేల రాలింది
తన మరణంతో అయినా
దశాబ్దాల స్వప్నం సాకారమవుతుందని
2
ఎక్కడా పీఠాలు కదిలిపోలేదు
ఏ ప్రభువుల గుండెలూ కరిగిపోలేదు
'ఎవడు చేసిన పాపం కొడుకా యిది?'
గుండెలు బాదుకుంటూ ఎగిసిన
ఒక తల్లి ప్రశ్న వెర్రి గాలిలో కలిసిపోయింది
3
కూడికలూ తీసివేతల
లెక్కల్లో మునిగిపోయి కొందరు
దిన వార మాసాలకు కూడా
పిచ్చి లెక్కలు చెబుతూ మరికొందరు
ఒకే ఒక స్వప్నం కోసం
పూలు నేలరాలి పోతూ వుంటే
కరిగిపోయే కరుణా మూర్తులు
కాదుకదా ఈ మాయ మాటల జాదూలు

4
బండెనక బండి కట్టి బయలెల్లిన దొరలను
తరిమికొట్టిన ఊళ్లు కదా మనవి
కప్పం కట్టమన్న రాజుని నిలువరించి
కడ దాకా పోరాడిన సమ్మక్క సారలమ్మలు
తిరుగాడిన నేల కదా మనది
ఇలా ఆత్మల్ని దహించుకునే
విష మార్గాన్ని బోధిస్తున్నది ఎవరు తండ్రీ?
5
నేలను స్వప్నిస్తూ రాలిపోయే పూవులారా!
స్వప్నించిన నేలను
రేపు రంగుల పూవుల్తో
అలంకరించడానికి అయినా
మీరు వికసించి వుండాలి....
తల్లీ, నేలా మీకోసం తల్లడిల్ల కుండాలి ....

(11 ఫిబ్రవరి 2013-'వివిధ' ఆంధ్రజ్యోతి )

 

22, ఏప్రిల్ 2013, సోమవారం

చెట్లూ -రూపాయలూ-కొన్ని రహస్యాలు


 చెట్లూ -రూపాయలూ-కొన్ని రహస్యాలు               

  1
'రూపాయలు చెట్లకు కాయవు'
గొప్ప రహస్యాన్ని బోధించినందుకు
మీకు మా కృతజ్ఞతలు
   2
చేతి లోంచి రూపాయి జారిపడితే
వొంగి అందుకుని, కళ్ళకు అద్దుకుని
జేబులో వేసుకునే అల్పజీవులం
రూపాయి రూపాయి లెక్కలేసుకుని
బతుకు బండికి ఖరీదైన ఇంధనం తాపించి
ధరల పిడుగుల్ని  కురిపిస్తోన్న ఆకాశం కింద
భయం భయంగా సాగుతున్న వాళ్ళం

రూపాయలు చెట్లకు కాయవని
మీరు సెలవిచ్చే దాకా తెలియదు
    3
నాలుగు రూపాయలు కళ్ళ చూడడానికి
పంచ ప్రాణాలనీ ఈ మట్టిలో కలిపి
ఈ దేశానికింత అన్నం పెడుతున్న వాళ్ళం
రక్త మాంసాలని యంత్ర రాక్షసులకు తోడిపోసి
అభివృద్ధి సూచీల కింద నలిగిపోతున్న వాళ్ళం

రూపాయలు చెట్లకు కాయవని
తెలుసుకోకపోవడం ముమ్మాటికీ నేరమే

      4
ఇంకా డాలర్లను కొనే శక్తి లేక
రూపాయి పతనమయింది అంటున్నారు
రూపాయి విలువని కోల్పోయిందంటున్నారు
విలువలతో బతికే వాళ్లకి
రూపాయి విలువని కోల్పోవడం ఒక శరాఘాతం
బతకడానికి రోజుకు 20  రూకలు చాలని లెక్కలేసిన
ఖరీదైన ఆక్స్ ఫర్డ్   మేధావులకు అర్థం కాని విషాదం

రూపాయలు చెట్లకు కాయవు సరే
రూపాయిని డాలరుకు తాకట్టు పెట్టిన
ఆ రహస్యాన్ని బహిరంగం చేయగలరా?
     5
కొందరు  మాంత్రికులూ, వారి అనుచరులూ
ఒక్క చెమట చుక్క కూడా రాల్చకనే
ముడి ఇనుము గనుల్లో, నల్ల బంగారం బ్లాకుల్లో
చివరికి గాలి తరంగాలలో సైతం
కోట్ల రూపాయలు పండించుకున్నారని అంటున్నారు 

రూపాయలు చెట్లకు కాయవన్న మాట సరే గానీ 
ఈ మాంత్రికులు ఔపోసన పట్టిన మంత్ర రహస్యం వివరించండి
మాకు తెలుసు, మీరు వివరించలేరని
ఇక మేమే తెలుసుకోవాలి ....తేల్చుకోవాలి !
(పార్లమెంటులో 'విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు' ప్రవేశపెట్టే ముందు 'డబ్బులు చెట్లకు కాయడం లేదు' అని ప్రధాని అన్నారు) 

ఏ తీరుగ నను ....








ఏ తీరుగ నను ....


రోజూ సాయంత్రం పార్కులో ఆ మూలన బెంచీలపై 
ఆరుగురు ముదిమి వయసు స్త్రీలు 
ఆరోగ్యం కోసమో, ఆహ్లాదం కోసమో వచ్చిన వాళ్లకు
కాసింత సంగీత ప్రసాదం పెడతారు

'
ఏ తీరుగ నను దయ చూసేదవో ....'
అడవిలో ఒక కోకిల స్వరాన్ని మిగతా కోయిలలు అందుకున్నట్టు 
ఒకరు మొదలు పెట్టిన కీర్తనని మిగతా వాళ్ళు 
రాగయుక్తంగా అందుకుంటూ
చుట్టూ వున్న లోకం గొడవలేవీ పట్టనట్టు 
ఒక అలౌకిక ఆనందం లో మునిగిపోయి వుంటారు

జీవితాలని ప్రసాదించిన స్త్రీలు 
జీవితాలని మోసిన స్త్రీలు 
జీవిత చరమాంకం లో జీవించడం అంటే
ఒక అలౌకిక ఆనందం లో బతకడమే అన్నంత గాడంగా
సాయంకాలాలు పాటలలో మునిగిపోయే స్త్రీలు

స్త్రీలకు దూరంగా మరొక మూలన బెంచీలపై 
కొందరు మూడు కాళ్ళ ముదిమి వయసు పురుషులు 
ఇంట్లో మాటలు కరువైన రక్తబంధం గురించి ఒకరూ 
మాటలు తప్ప చేతల్లేని రాజకీయాల గురించి మరొకరూ
ఇంటా, బయటా గొడవల రహస్యం ఏదో
చరమాంకం లో కూడా అర్థం కాని అయోమయం లో

జీవితాలని బలిగోరిన పురుషులు 
జీవితాంతం పరాన్నజీవులుగా బతికే పురుషులు
ఒక శ్రావ్యమైన పాటకూ, అందమైన పద్యానికీ నోచుకోని పురుషులు
స్త్రీల వలె జీవితాన్ని కళ గా జీవించడం తెలియని పురుషులు

యౌవ్వనం లో నైనా, ముదిమి లో నైనా 
ఒక పాటో, పద్యమో తోడు లేని 
బతుకు ఎంత దుర్భరమో కదా


-------------- కోడూరి విజయకుమార్
21 APRIL 2013









కిటికీ తెరిచినపుడు ...



నువ్వొక నదినీ, ఆకుపచ్చని నేలనీ దర్శించాలని కలగన్నపుడు
ఒక్క కిటికీని మాత్రమే తెరిస్తే సరిపోదు

చెట్లనీ, పూవులనీ దర్శించాలని నువ్వు ఆశపడినపుడు
నువ్వు అందుడివి కాకుండా ఉండడమొక్కటే సరిపోదు

అంతే కాదు.. నువ్వొక జ్ఞానివి కూడా ఐ వుండకూడదు
జ్ఞానం లో ఆలోచనలకు తప్పపచ్చని చెట్లకూ, రంగు రంగుల పూలకూ చోటు వుండదు

ఒక్కొక్కరమూ ఒక్కొక్క గుహ మాదిరి బతుకుతూ….
ఒక మూసి పెట్టిన కిటికీ, తక్కిన ప్రపంచమంతా దానికి అవతల ....

కిటికీ తెరిచినపుడు నీవు ఎన్నెన్నో దర్శించాలని కలలు కని వుంటావు
కిటికీ తెరిచిన తరువాత చూసినది ఏదీ నీవు కలగన్నది కాదని తెలుసుకుంటావు 


పోర్చుగీసు మూలం: ఫెర్నాండో పెస్సోవ
ఇంగ్లీష్: రిచర్డ్ జెనిత్
తెలుగు: కోడూరి విజయకుమార్