కొందరు నాన్నల కోసం
ఫ్యాను రెక్కల గాలి శబ్దం తప్ప
అంతా నిశ్శబ్దంగా వుంటుంది...
అమ్మ లాంటి అమ్మలూ, నా లాంటి పిల్లలూ తప్ప
వీధిలోని ఇళ్ళన్నీ నిద్రలో వుంటాయి
గోడ మీది గడియారం గుడ్లగూబ
పన్నెండు సార్లు అరుస్తుంది
తన యూకేజి హోం వర్క్ జ్ఞాపకం వొచ్చి
నిద్దట్లో ఉలిక్కి పడి లేచిన తమ్ముడి వీపు మీద
అమ్మ నిశ్శబ్ద జోల పాటై సాగుతుంది
కళ్ళు విప్పి, కిటికీ లోంచి జాలువారిన
వెన్నెలని దోసిట్లోకి తీసుకుని
అమ్మ తల తిప్పక ముందే
గబుక్కున దుప్పటి కప్పుకుంటాను
గది లోని జీరో వాట్ బల్బులా అమ్మింకా నిద్ర పోలేదు
నాన్నింకా ఇంటికి రాలేదు
ఆదివారాలు తప్ప మాకు కనిపించని నాన్న
ఏదడిగినా ఎరుపెరుపు కళ్ళతో
మొహం చిట్లించుకు మాట్లాడే నాన్న
రాత్రి ఎపుడైనా దగ్గరకొచ్చి ముద్దు పెడితే
వికారపు వాసనేసే నాన్న
.... నాన్నింకా ఇంటికి రాలేదు
అమ్మలు ఆఫీసుల్నించి సాయంత్రాలే వొచ్చేసినా
నాన్నలింత రాత్రి దాకా ఆఫీసుల్లో ఏం చేస్తారు?
అడిగితే అమ్మ డ్యూటీ అంటుంది
రోజీ మాత్రం నాన్నలు బారుల్లో వుంటారని అంటుంది
అమ్మ జోలపాట తమ్ముడి వీపు మీంచి
కాసేపు నా వీపు మీదకు చేరుతుంది
కళ్ళు కొంచెం మూత పడగానే కాలింగ్ బెల్ మోత ...
మంచం దిగిన అమ్మ వడి వడి అడుగుల శబ్దం
నా గుండెల్లో ప్రతిధ్వనించి నిద్ర పొర కరుగుతుంది
ఇంట్లోకి నాన్న కన్నా ముందు చేరే వికారపు వాసన
అమ్మ భుజం మీద వాలి, తూలుతో నడిచే నాన్న
మాటల్ని ముద్దలుగా రాల్చడం ...
వెక్కిళ్ళ నడుమ అమ్మ వేడికోల్లై పోవడం
మూసిన బెడ్ రూం తలుపు సందుల్లోంచి
అంతా కనిపిస్తూనే వుంటుంది...అంతా వినిపిస్తూనే వుంటుంది
రాత్రుళ్ళు బెడ్ రూం దాటి రాగూడదన్న
అమ్మ వార్నింగ్ కూడా జ్ఞాపకం వొస్తుంది
అలికిడికి ఉలిక్కి పడి లేచిన తమ్ముడి వీపు మీదకు
జోలపాటనై కాసేపు అమ్మ పాత్రలోకి నేను ....
రాత్రుళ్ళు నాన్నలెందుకు తాగి వొస్తారు ?
బాధల్ని మరిచి పోవడానికి అంటుంది రోజీ
తాగి ఏనాడూ ఇళ్ళకి రాని అమ్మలకు బాధలువుండవా ?
అమ్మలనీ, పిల్లలనీ ఏడ్పించే ఈ మందుని
నాన్నలకు ఎవరు అందిస్తున్నారు?
తనని ఎక్కడ ప్రశ్నిస్తానో అని
చంద్రుడు మేఘాల మాటున దాక్కుంటాడు
దోసిట్లోకి తీసోవడానికి వెన్నెల దొరకదు నాకు
గుడ్లగూబ ఒక గంట కొట్టేక అమ్మ వొచ్చి
నాకూ, తమ్ముడికీ నడుమ వాలిపోతుంది
దుప్పటి సందుల్లోంచి
అమ్మ దుక్కం కనిపిస్తూనే వుంటుంది
ఫ్యాను రెక్కల గాలి శబ్దం తప్ప
అంతా నిశ్శబ్దంగానే వుంటుంది
*****
ఉదయం సూర్యుడు కళ్ళు తెరిచే సరికే
అమ్మ వంటింట్లో మేల్కుని వుంటుంది
స్కూలుకి వెళ్తూ, అమ్మ కళ్ళల్లోకి చూస్తానొకసారి
తిరిగి మా రాత్రి లోకి జొరబడ బోయే పిశాచి తలపుల్లో మెదిలి
యిద్దరి కళ్ళూ భయంతో వొనుకుతాయి కాసేపు...
08 -03 -1999
ఆంధ్రభూమి -సాహితి