27, ఏప్రిల్ 2013, శనివారం

పూలు మరణిస్తోన్న వేళ!

 

1
తనదే అయిన నేల కోసం స్వప్నించిన
మరొక పూవు వికసించకనే నేల రాలింది
తన మరణంతో అయినా
దశాబ్దాల స్వప్నం సాకారమవుతుందని
2
ఎక్కడా పీఠాలు కదిలిపోలేదు
ఏ ప్రభువుల గుండెలూ కరిగిపోలేదు
'ఎవడు చేసిన పాపం కొడుకా యిది?'
గుండెలు బాదుకుంటూ ఎగిసిన
ఒక తల్లి ప్రశ్న వెర్రి గాలిలో కలిసిపోయింది
3
కూడికలూ తీసివేతల
లెక్కల్లో మునిగిపోయి కొందరు
దిన వార మాసాలకు కూడా
పిచ్చి లెక్కలు చెబుతూ మరికొందరు
ఒకే ఒక స్వప్నం కోసం
పూలు నేలరాలి పోతూ వుంటే
కరిగిపోయే కరుణా మూర్తులు
కాదుకదా ఈ మాయ మాటల జాదూలు

4
బండెనక బండి కట్టి బయలెల్లిన దొరలను
తరిమికొట్టిన ఊళ్లు కదా మనవి
కప్పం కట్టమన్న రాజుని నిలువరించి
కడ దాకా పోరాడిన సమ్మక్క సారలమ్మలు
తిరుగాడిన నేల కదా మనది
ఇలా ఆత్మల్ని దహించుకునే
విష మార్గాన్ని బోధిస్తున్నది ఎవరు తండ్రీ?
5
నేలను స్వప్నిస్తూ రాలిపోయే పూవులారా!
స్వప్నించిన నేలను
రేపు రంగుల పూవుల్తో
అలంకరించడానికి అయినా
మీరు వికసించి వుండాలి....
తల్లీ, నేలా మీకోసం తల్లడిల్ల కుండాలి ....

(11 ఫిబ్రవరి 2013-'వివిధ' ఆంధ్రజ్యోతి )

 

22, ఏప్రిల్ 2013, సోమవారం

చెట్లూ -రూపాయలూ-కొన్ని రహస్యాలు


 చెట్లూ -రూపాయలూ-కొన్ని రహస్యాలు               

  1
'రూపాయలు చెట్లకు కాయవు'
గొప్ప రహస్యాన్ని బోధించినందుకు
మీకు మా కృతజ్ఞతలు
   2
చేతి లోంచి రూపాయి జారిపడితే
వొంగి అందుకునికళ్ళకు అద్దుకుని
జేబులో వేసుకునే అల్పజీవులం
రూపాయి రూపాయి లెక్కలేసుకుని
బతుకు బండికి ఖరీదైన ఇంధనం తాపించి
ధరల పిడుగుల్ని  కురిపిస్తోన్న ఆకాశం కింద
భయం భయంగా సాగుతున్న వాళ్ళం

రూపాయలు చెట్లకు కాయవని
మీరు సెలవిచ్చే దాకా తెలియదు
    3
నాలుగు రూపాయలు కళ్ళ చూడడానికి
పంచ ప్రాణాలనీ  మట్టిలో కలిపి
 దేశానికింత అన్నం పెడుతున్న వాళ్ళం
రక్త మాంసాలని యంత్ర రాక్షసులకు తోడిపోసి
అభివృద్ధి సూచీల కింద నలిగిపోతున్న వాళ్ళం

రూపాయలు చెట్లకు కాయవని
తెలుసుకోకపోవడం ముమ్మాటికీ నేరమే

      4
ఇంకా డాలర్లను కొనే శక్తి లేక
రూపాయి పతనమయింది అంటున్నారు
రూపాయి విలువని కోల్పోయిందంటున్నారు
విలువలతో బతికే వాళ్లకి
రూపాయి విలువని కోల్పోవడం ఒక శరాఘాతం
బతకడానికి రోజుకు 20  రూకలు చాలని లెక్కలేసిన
ఖరీదైన ఆక్స్ ఫర్డ్   మేధావులకు అర్థం కాని విషాదం

రూపాయలు చెట్లకు కాయవు సరే
రూపాయిని డాలరుకు తాకట్టు పెట్టిన
ఆ రహస్యాన్ని బహిరంగం చేయగలరా?
     5
కొందరు  మాంత్రికులూ, వారి అనుచరులూ
ఒక్క చెమట చుక్క కూడా రాల్చకనే
ముడి ఇనుము గనుల్లో, నల్ల బంగారం బ్లాకుల్లో
చివరికి గాలి తరంగాలలో సైతం
కోట్ల రూపాయలు పండించుకున్నారని అంటున్నారు 

రూపాయలు చెట్లకు కాయవన్న మాట సరే గానీ 
ఈ మాంత్రికులు ఔపోసన పట్టిన మంత్ర రహస్యం వివరించండి
మాకు తెలుసు, మీరు వివరించలేరని
ఇక మేమే తెలుసుకోవాలి ....తేల్చుకోవాలి !
(పార్లమెంటులో 'విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల బిల్లు' ప్రవేశపెట్టే ముందు 'డబ్బులు చెట్లకు కాయడం లేదు' అని ప్రధాని అన్నారు) 
మధురోహాలూ ... మధుపర్కాలూ...'గుడిహాళం పద్యం ' !
ఒక స్థితి 

లోకం లో 'తన ప్రియుడు' తప్ప మరొక 'ప్రాణి' ఏదీ తనతో పాటు జీవిస్తున్న స్పృహ లేకుండా తిరిగే 'ప్రియురాలు'  ... కేవలం 'తన ప్రియురాలి' ఉనికి వల్లే లోకం ఇంత మనోహరంగా వున్నట్టు ఒక మైకం లో బతికే 'ప్రియుడు' .... వాళ్ళిద్దరూ ఒకరి సన్నిధిలో మరొకరు గడపడానికి తప్ప, మరొక విలువ ఏదీ తనకు లేనట్టు బేఖాతరుగా అలా కలలా కరిగిపోయే కాలం .....

మరొక స్థితి

తాను కలలు గన్నమనోహర జీవితం యిది కాదన్న నిరాశలో 'ఆయన'
తన రంగుల కలల సౌధం కుప్పకూలిన బెంగలోఆవిడ’

ఇంతకీ రెండు  స్థితుల నడుమ జరిగిందేమిటి?
కడు పాతదే అయిన ఊహాజనిత ప్రశ్న ఒకటి మళ్ళీ యిక్కడ...
శరత్ నవల దేవదాసు లో పార్వతీ దేవదాసుల ప్రేమ ఫలించి వుంటే ఏం జరిగి వుండేది?
'పెళ్లి'
'..... తరువాత?'
నవల సంగతి సరే.... స్థితిని పట్టుకున్న పద్యం ఏదయినా ఉందా?
ఉంది....అది మామూలు పద్యం కాదు....కవి 'గుడిహాళం రఘునాథం' పద్యం....

అతడూ, ఆమె ప్రేమలో మునిగి వున్నరోజులు/ క్షణాలు ఎంతటి సమ్మోహన శక్తిని దాచుకున్నవో,  గుడిహాళం  తన 'దాంపత్యం' పద్యం లో జ్ఞాపకం చేసుకున్నాడు చూడండి ....

"ఇవే రోజులు  /ఇవే క్షణాలు
కానీ సాయంత్రాలు సంతోషాన్ని మోసుకొచ్చేవి
మనసులు మాధుర్యాన్ని వెదజల్లేవి
మనిద్దరి చూపులు కలిసిన చోట
మట్టి రేణువులు సైతం మల్లెలై విరిసేవి
గాలి తరగలు గాంధర్వాన్ని  ఆలపించేవి
క్షణాలు మాటల వనాలై మత్తుగా వూగేవి
ఆశల కిరణాలై హృదయాన్ని ఆవహించేవి"

మరి అలాంటి స్థితిలో ఆ ప్రియునికి  తన చుట్టూ వున్న ప్రకృతీ, తన సమక్షం లో వున్న ప్రియురాలు  ఎంత మనోహరంగా తోచేవి ......?
మీరు ఇప్పుడు ప్రేమలో వున్న వారైనా (లేక) ఒకప్పుడు ప్రేమలో పడి వున్న వారైనా (లేకప్రేమించి పెళ్లి చేకున్న వారైనా... కవి సృజించిన పద్య పాదాలని స్పృశించి, ఒక్క సారి మనసారా  మీ అమృతమయ జ్ఞాపకాలని నెమరువేసుకొనండి  .... మధుర క్షణాలని మళ్ళీ ఒక సారి పలవరించండి!

"అప్పుడాకాశం అంతా ఒకటే కిలకిలలు
కొలను నిండా ఎప్పుడూ గలగలలు
వెచ్చని హాయినిచ్చే పలకరింతల వెన్నెల దృశ్యాల్లో
నీ మాటలెంతో  సుగంధంగా ఉండేవి
అందమైన కలల్ని అల్లేవి
నీ తలపులు ప్రేమ తటాకాలపై వాలి క్రీడించేవి
వేయి రాగాలని హత్తుకోవాలని పరితపించేవి
విరుచుకు పడే అలల్లో పురివిప్పిన పించాల్ని దర్శించాలని పరుగులెత్తేవి"

కలలెప్పుడూ కలకాలం వుండవు....కల లాగ సాగిపోయే ప్రేమ ఖచిత యౌవన కాలం అసలే వుండదు....
మనం గాలి తరగల నడుమ, కిలకిలల ఆకాశం కింద, గలగలల కొలను వొడ్డున, వెచ్చని హాయినిచ్చే వెన్నెల కాంతిలో ఒంటరిగా లేము కదా.....
కట్టుబాట్లను  గిరిగీసిన నాగరిక సమాజం నడుమ బతికే వాళ్ళం కదా....మేము ఇక ఎప్పటికీ ప్రేమికులు గానే ఇలా  హాయిగా వుండిపోతామంటే విని తట్టుకుంటుందా? చేతులు కట్టుకుని  నిశ్సబ్దంగా ఉంటుందా?  ... మరేం చేస్తుంది....? పెళ్లి చేస్తుంది...పెళ్లి చేసుకుని 'తన లాగే సుఖంగా' ఉండమని  పోరు పెడుతుంది... (పెళ్లి) తరువాత? తరువాత ఏమిటో కవి  పద్య పాదాల్లోనే చదవండి...

"వారాలు రాలాయి/హారాలు మారాయి
దాంపత్యం కురిసింది
మట్టి వాసన నాలో లేచింది / అసహనం నీలో వీచింది
తెరలు వాలాయి/కలలు కూలాయి
పాట ఆగిపోయింది /రెండు స్వరాలమై రాలి స్థిరపడ్డాం
పెళ్ళాం ఫ్రేములో నీవు/మొగుడి ఫ్రేములో నేను
అంతే!"

'అంతే' అన్న గుండెని మెలిపెట్టే చిన్న మాటతో వేయి రాగాలని హత్తుకోవాలని కలగన్న హృదయం ఒకే ఒక్క స్వరమై రాలి పడి, సమాజం నిర్ణయించిన ఫ్రేములో స్థిరపడి పోయిన పెను విషాదాన్ని కవి మన కళ్ళ ముందు నిలిపాడు.
'ప్రేమ' పెళ్లి' గా స్థిరపడిన తరువాత, సీతాకోక చిలుకల్లాంటి 'ప్రియుడు', 'ప్రియురాలు' రెండు గొంగళి పురుగుల్లాంటి  'ఆయన', 'ఆవిడ' గా రూపాంతరం చెందిన కథను ఆలపించాడు

చాలా పద్యాలే చదివి ఉంటాము....కానీ, 'ప్రేమ' నుండి 'పెళ్లి' లోకి ప్రయాణించి, కోల్పోయిన ప్రేమని పలవరించిన అరుదైన పద్యంగుడిహాళం రాసిన 'దాంపత్యం'.
గుడిహాళం తన జీవిత కాలం లో రాసినవి కొన్ని పద్యాలే  అయినా, ఒక్కొక్కటీ ఒక 'మార్వెల్'  !
'తెలుగు కవిత్వం లో గుడిహాళం అరుదైన కవి' అని నేను మళ్ళీ ఇక్కడ చెప్పడం సాహసమే అయినా, నా కోసం నేను మరొక్క సారి అనకుండా ఉండలేను ..(ఆయనే మరొక పద్యం లో చెప్పాడు... 'ఇప్పుడు పద్యం రాయాలంటే గొప్ప సాహసం కావాలి') 

-----[వాకిలి-ఇ-సాహిత్య పత్రిక ఏప్రిల్-2013 ]

ఏ తీరుగ నను ....








ఏ తీరుగ నను ....


రోజూ సాయంత్రం పార్కులో మూలన బెంచీలపై 
ఆరుగురు ముదిమి వయసు స్త్రీలు 
ఆరోగ్యం కోసమో, ఆహ్లాదం కోసమో వచ్చిన వాళ్లకు
కాసింత సంగీత ప్రసాదం పెడతారు

'
తీరుగ నను దయ చూసేదవో ....'
అడవిలో ఒక కోకిల స్వరాన్ని మిగతా కోయిలలు అందుకున్నట్టు 
ఒకరు మొదలు పెట్టిన కీర్తనని మిగతా వాళ్ళు 
రాగయుక్తంగా అందుకుంటూ
చుట్టూ వున్న లోకం గొడవలేవీ పట్టనట్టు 
ఒక అలౌకిక ఆనందం లో మునిగిపోయి వుంటారు

జీవితాలని ప్రసాదించిన స్త్రీలు 
జీవితాలని మోసిన స్త్రీలు 
జీవిత చరమాంకం లో జీవించడం అంటే
ఒక అలౌకిక ఆనందం లో బతకడమే అన్నంత గాడంగా
సాయంకాలాలు పాటలలో మునిగిపోయే స్త్రీలు

స్త్రీలకు దూరంగా మరొక మూలన బెంచీలపై 
కొందరు మూడు కాళ్ళ ముదిమి వయసు పురుషులు 
ఇంట్లో మాటలు కరువైన రక్తబంధం గురించి ఒకరూ 
మాటలు తప్ప చేతల్లేని రాజకీయాల గురించి మరొకరూ
ఇంటా, బయటా గొడవల రహస్యం ఏదో
చరమాంకం లో కూడా అర్థం కాని అయోమయం లో

జీవితాలని బలిగోరిన పురుషులు 
జీవితాంతం పరాన్నజీవులుగా బతికే పురుషులు
ఒక శ్రావ్యమైన పాటకూ, అందమైన పద్యానికీ నోచుకోని పురుషులు
స్త్రీల వలె జీవితాన్ని కళ గా జీవించడం తెలియని పురుషులు

యౌవ్వనం లో నైనా, ముదిమి లో నైనా 
ఒక పాటో, పద్యమో తోడు లేని 
బతుకు ఎంత దుర్భరమో కదా


-------------- కోడూరి విజయకుమార్
21 APRIL 2013