27, డిసెంబర్ 2011, మంగళవారం

నీడలకీవల



నీడలకీవల 
(మరి కొన్ని ప్రేమ కవితలు)

I

నేను నా గత జన్మ స్మృతుల 
చీకటి నీడల్లో త్యజించానని భ్రమించే 
వొక పురా జ్ఞాపకమేదో 
కొన్ని  పునర్జన్మల  తరువాత మళ్ళీ
ఒకనాడు నన్ను అల్లుకుని వివశున్ని చేస్తుంది
పురా జ్ఞాపకం నాదేనా? ... నీది కూడానా

II

ఎదురుచూస్తూ వుంటాను
నీడలకీవల మరొక నీడనై
నీడలకావల నీవూ మరొక నీడవేనా?
నీడల్లో తారాడే జ్ఞాపకాల దర్శనానికై
తహ తహలాడే నిస్సహాయ హృదయం?
ఈ నిస్సహాయ హృదయం నాదేనా? ... నీది కూడానా?

III


కోల్పోయిన బాధను పట్టి యిచ్చే
గుప్పెడు దుఃఖ భరిత పదాల్ని దాచిపెట్టిన
మాటలు కొన్ని వుంటాయి...ఖాళీ ఖాళీగా ..
ప్రయాణపు మజిలీలోనో దరహాసమై
నువు తారస పడితే పంచుకోవాలని
పెదాల ద్వారం దగ్గర మూటలుగా పేర్చినవి...
దాచిన గుప్పెడు పదాలు నావేనా?...నీవి కూడానా?

IV

గాయమూ మరపు దొంతరల్లో మాయం కాలేదు.....
వెన్నెల పుష్పాల్ని వెదజల్లిన దొంగ నవ్వులూ
వేసవి వానల్ని కురిసిన వోర చూపులూ
చివరికి, అవి మాయం కావాలని కసితో
కాల్చేసిన యవ్వన రాత్రులు కూడా...

ఇపుడవి గాయాలు కావు... బతికిన సందర్భాలు....
ఆ సందర్భాలు నావేనా?...నీవి కూడానా?

V

గమించే జీవితంలో ఫిర్యాదులు లేవు...
గతించిన దాని పట్ల పశ్చాత్తాపాలూ లేవు...
ఎపుడైనా వొక సారి
బాటసారులమై తారసపడినపుడు
నీడలమై నీడల్లో అదృశ్యం కాకూడదని వొక కోరిక....
కోరిక నాది మాత్రమేనా?...నీది కూడానా?...

రచనా కాలం: 26  డిసెంబర్-2011 
{ఆంధ్రభూమి -సాహితీ - 20  ఫిబ్రవరి - 2012  ప్రచురితం }


2 కామెంట్‌లు: