జయశంకర్  సార్ గురించి నేను మొదటిసారి ఎప్పుడు విని వుంటాను?....
జయశంకర్ సార్  కు  సంబంధించిన జ్ఞాపకాలను తడుముకుంటూ వెళ్ళినప్పుడు  నాకు అర్థమైన సంగతి ..నా చిన్నతనంలో, మా  నాన్న ద్వారా మొదటి సారి జయశంకర్ సార్ గురించి విన్నానని... 
మా నాన్న వరంగల్ లో తెలుగు ఉపాధ్యాయునిగా పని చేసి రిటైర్ అయ్యారు. ఆయనకు వరంగల్  కొండబత్తిని జగదీశ్వర్ రావు గారు మంచి స్నేహితుడు [పి. వి. నరసింహా రావు గారితో కలిసి కొన్నాళ్ళు వొక పత్రిక- 'కాకతీయ’ అనుకుంటాను- నడిపారు]. కొండబత్తిని  జగదీశ్వర రావు గారికి పర్మాజీ సార్, జయశంకర్ సార్ దగ్గరి  స్నేహితులు ......అలా కొన్ని సార్లు, మా ఇంట్లో జయశంకర్ సార్ గురించిన ప్రస్తావన వొచ్చిన జ్ఞాపకం! ఆ రోజుల్లోనే మా నాన్న జయశంకర్ సార్ తెలివితేటల  గురించీ, ముఖ్యంగా ఆయన  సింప్లిసిటీ గురించీ చెప్పిన మాటలు బాగా జ్ఞాపకం నాకు! ఆ తర్వాత, జయశంకర్ సార్ కాకతీయ  యునివర్సిటి వైస్ చాన్సులర్ గా వున్న కాలంలో అక్కడ చదువుకున్న నా బాల్య మిత్రుడు మస్న వెంకటేశ్వర్లు గాడి ద్వారా కూడా ఆయన గొప్పదనం గురించి వినేవాడిని ..... ముఖ్యంగా, ఆయన బ్రహ్మచారి గా వుండిపోయిన సంగతి, కుర్రవాల్లమైన మాకు కొంత ఆసక్తికరంగా వుండేది ....  ఆ తర్వాత కాలంలో కొంత మా  నాన్న ద్వారా, కొంత  తదనంతర కాలంలో నాకు పరిచయమైన పెద్ద వాళ్ళ ద్వారా ఆ మహానుభావుని జీవితకాల తెలంగాణా దీక్ష గురించీ, ఆ దీక్షలో భాగంగా ఆజన్మ బ్రహ్మచారిగా ఉండిపోయిన సంగతి  గురించీ తెలిసింది!  
జయశంకర్ సార్ ని  కాస్త  సన్నిహితంగా కలిసి, మాట్లాడింది మాత్రం, నేను హన్మకొండ నక్కలగుట్ట  లోని కాళోజి సోదరుల ఇంట్లో జరిగే మిత్ర మండలికి  వెళ్ళడం  ప్రారంభించిన తరువాతే..... ఆయన  వైస్ చాన్సులర్ గా వున్న కాలంలోనే వొక రోజు మిత్ర మండలి జరుగుతూ వుండగా కాళోజీ యింటికి వొచ్చారు. రామశాస్త్రి గారు చిన్న కాళోజీ దగ్గరకు వెళ్లి చెప్పారు..'జయశంకర్ వొచ్చిండు...ఏదో మాట్లాడాలెనట'....నా చిన్నప్పుడు, ఆ తర్వాతా జయశంకర్ సార్ గురించి విని వుండడం వలన నేను కొంత ఆసక్తిగా బయటకు వెళ్లి చూసాను...... అప్పుడు రామశాస్త్రి గారు జయశంకర్ సార్ కు  అక్కడ వున్న మమ్మల్ని పరిచయం చేసారు.... మొదటి సారి ఆయనను దగ్గరగా చూసినప్పుడు అనిపించింది ....  గొప్ప  మేధావి, కాకతీయ  యునివర్సిటి   వైస్ చాన్సులర్ అనీ ఆయన రూపాన్ని నేను వేరొక విధంగా ఊహించుకున్న సంగతి ! 
ఆ  రోజు జయశంకర్ సార్ ని  దగ్గరగా చూసి, కొంత  మాట్లాడినప్పుడు నాకు కలిగిన అనుభూతి ఏమిటంటే, ఆయన శరీర భాష గానీ, ఆయన  మాట తీరు గానీ ఆయన వొక యునివర్సిటి  వైస్ చాన్సులర్ గా కన్నా మా పెదనాన్నో లేక మరొక దగ్గరి బంధువో అన్నంత సన్నిహితుడిగా కనిపించడం...  చాలా మంది తమ  హోదాలనీ, తమ తెలివి తెటలనీ మన ముందు ప్రదర్శించడం ద్వారా మనం వాళ్ళకు సన్నిహితంగా వెళ్ళే అవకాశం లేకుండా, మనకూ వాళ్ళకూ నడుమ  వొక కనిపించని గోడని పెడతారు.  తరువాత కాలంలో, నేను మరింత లోకాన్ని చూసాక అర్థమైన విషయం ఏమిటంటే, 50 ల వరకూ పుట్టిన చాలా మంది తెలంగాణా  వాళ్ళల్లో, ముఖ్యంగా మంచి హోదాలలో పనిచేసిన వాళ్ళల్లో, ఈ హోదాల ప్రదర్శన లేకపోవడం. 
హైదరాబాద్ కు వొచ్చాక, తెలంగాణా  ఉద్యమం పతాక స్థాయికి చేరాక, చాలా సమావేశాలలో ఆయనని చూసాను...తెలంగాణా ప్రజల పక్షాన ఆయన చేసే ఆసక్తికరమైన  ప్రసంగాలు విన్నాను...ఎందుకో గానీ ఏ రోజూ సార్ దగ్గరికి వెళ్లి మా పాత పరిచయాన్ని తవ్వి తీయాలని అనిపించలేదు...ప్రత్యేకమైన కారణాలంటూ ఏవీ లేవు... అదలా జరిగిపోయింది!   
అందరూ 'తెలంగాణా సాధించడమే జయశంకర్ సార్ కు నిజమైన నివాళి' అంటున్నారు...నిజమే...కానీ దానికన్నా గొప్ప నివాళి....ఆ గొప్ప మనిషి బతికి చూపించిన పద్ధతి లో కనీసం పది శాతం అయినా మనం మన జీవితాలలో పాటిస్తే, అది అన్నింటికన్నా గొప్ప నివాళి....
అందరూ 'తెలంగాణా సాధించడమే జయశంకర్ సార్ కు నిజమైన నివాళి' అంటున్నారు...నిజమే...కానీ దానికన్నా గొప్ప నివాళి....ఆ గొప్ప మనిషి బతికి చూపించిన పద్ధతి లో కనీసం పది శాతం అయినా మనం మన జీవితాలలో పాటిస్తే, అది అన్నింటికన్నా గొప్ప నివాళి....
జయశంకర్ సార్....మీరు మా మధ్య లేకపోయినా అనితర సాధ్యమైన మీ జీవన మార్గం తెలంగాణ మేధావులకు, నాయకులకు ... మొత్తం తెలంగాణ ప్రజలకు గొప్ప ఆదర్శం! 
 [ఆగస్ట్ 2011 'పాలపిట్ట'  నుండి...'గుడిపాటి' గారికి కృతజ్ఞతలతో...]
