13, జులై 2011, బుధవారం

ఏం చేస్తావు నువ్వు?


యంత్ర జీవితం వొక ఎడతెగని ఎండా కాలంలా
దేహాత్మలను దహించి వేసే దప్పిక దినాలలో.....

 ఒక ఉదయం కిటికీ పక్కన చెట్ల ఆకుల మీద
సందడిగా జారి, ఆటలాడే వర్షపు చినుకులు
నీ కనుల మీది నిదురతెర తొలగించి
గది లోపల బందీగా పడి వున్న నిన్ను 
ప్రేమతో ఆట లోకి ఆహ్వానిస్తాయి .....

కాలం నది మీద కొట్టుకుపోయిన కాగితం పడవ ఏదో
వొక కలలా నిన్ను పలకరిస్తుంది ..వొక లిప్త పాటు

 చినుకుల్ని చుంబించిన మట్టి సౌరభమేదో
నిన్ను మంత్రించి, బంధ విముక్తుడిని చేసి
అలా బయటకు నడిపిస్తుంది.
నడక మెలకువలోనా? లేక నిదురలోనా?

అనంతాకాశం నుండి భూమిపై (లేక, నీపై)
దయగా కురిసే గొప్ప వాత్సల్యం.....
తడిసిన అందాలతో పచ్చగా నవ్వే చెట్లు...
కాసేపలా నీ రెండు అరచేతులతో చినుకుల్ని పైకి ఎగరేస్తూ…..
మరి కాసేపు నీ మొహాన్ని చినుకులకు అప్పగించి
'వొక నాలుగు ముద్దులు పెట్టండే' అని ప్రాధేయపడుతూ…..

జీవితం ఇక్కడ ఆగిపోతే బాగుండుననుకుంటావు కదా…..
నిన్ను మళ్ళీ నీ పాత గోతాములో కట్టి
ఇంటి లోనికి విసిరేసి….
కాగితం పడవ నవ్వుకుంటూ మాయమైపోతుంది….
* * * *
ఏం చేస్తావు నువ్వు?....
గోతాములో ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరౌతూ ...
వర్షపు చినుకుల్ని ఉదయాన్నే పలకరించిన దరిద్రమని తిట్టుకుంటూ ...
నీ యంత్ర జీవితంలోకి నిష్క్రమిస్తావు ...

ఎడతెగని ఎండాకాలాలు పూర్తిగా
దహించి వేసిన దేహాత్మలు నీవి...
ఏ వాత్సల్య వర్షాలూ వాటికి పునర్జన్మను ప్రసాదించలేవు

8 కామెంట్‌లు:

  1. వర్షం మీద వొక అందమైన కవిత రాయాలని మొదలై....వర్మ గారూ...చివరికి ఇలా ముగిసింది...జీవితం వొకలా వుంటే..కవిత్వం మరొకలా ఉంటుందా..నా పిచ్చి గానీ...!

    రిప్లయితొలగించండి
  2. దయగా కురిసే గొప్ప వాత్సల్యం.....
    తడిసిన అందాలతో పచ్చగా నవ్వే చెట్లు...

    baagunnaayi
    abhinaMdanalu

    రిప్లయితొలగించండి
  3. వాన..... మాటలకందని భావనలు అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తా.... చిత్రం ఘనంగా వుండి అద్భుతం. అభినందనలు..Dear koduri vijayakumar...శ్రేయోభిలాషి నూతక్కి(Kanakambaram).

    రిప్లయితొలగించండి
  4. కనకాంబరం గారూ..మీ అభినందనలకు ...కృతజ్ఞతలు...

    రిప్లయితొలగించండి
  5. విజయకుమార్ గారూ,
    చాలా అందంగా, బిగువుగా, సాగిన కవిత ఇది. కాకపోతే చిన్న అభిప్రాయం. అనంతాకాశం నుండి భూమిపై (లేక, నీపై) అన్న చోట, బ్రాకెట్లో ఉంచినదైనా తీసెయ్యండి, లేదా భూమిపై (లేక, నీపై) అన్నది అంతా తీసెయ్యండి. ఈ బ్రాకెట్ పెట్టినది కవితని ఆశ్వాదించడానికి ప్రతిబంధకంగా నిలబడుతోంది.
    చాలా చాలా మంచి కవితని అందించినందుకు అభినందనలు.

    రిప్లయితొలగించండి
  6. murthy gaaru...thanku for suggestion...will correct it while coming out with my next anthology of poems

    రిప్లయితొలగించండి