20, ఆగస్టు 2012, సోమవారం

నాస్తెంకా*




   'ప్రేమ అంటే యేమిటి?'
   'నీవు ఎక్కడో వేల యోజనాల దూరంలో వున్నా
   నీ గురించిన ఆలోచనల్లో నేను ఉక్కిరి బిక్కిరై పోవడం ....
   నిన్ను తప్ప మరి దేన్నీ ఊహించలేక పోవడం....'

* * * *
రోడ్డు పక్కన వీధి దీపాలు దహించుకు పోతూ వుంటాయి
చల్ల గాలికి కొంకర్లు తిరిగి పోతోన్న కుక్క పిల్ల వొకటి
మరింతగా ముడుచుకు పోయి వుంటుంది
గడియారపు ముళ్ళకు చిక్కుకున్న చూపులు
రాత్రంతా అంతు లేని ఆలోచనలై తిరుగుతూ వుంటాయి....

'కాహే - కోయల్ షార్ మచాయేరే మోరే
అప్నా కోయి యాద్ ఆయేరే'
శంషాద్ బేగం** విరహ వీచిక
అగరు బత్తి పొగలా మత్తుగా అల్లుకుంటుంది
అల్లుకునే పాట  నడుమ
అలా వొక్కడినే  చిక్కుకుపోయినపుడు
అకస్మాత్తుగా పుస్తకాల షెల్ఫు లోంచి దిగివొచ్చిన
నాస్తెంకా తో సంభాషణకు దిగుతాను

                           "ప్రేమించబడడం అంటే యేమిటి నాస్తెంకా?"

'మంచు కురిసే శీతాకాలపు పౌర్ణమి రాత్రి
వొక సరస్సు వొడ్డున కూర్చుని
వెన్నెలనంతా నీ కౌగిట్లోకి వొంపుకోవడాన్ని వూహించ గలవా?'

                     "క్షమించు... వూహించలేకున్నాను"

"ఒక వేసవి కాలపు మధ్యాహ్నం
అందరూ వేడి గాలుల నడుమ కాలి పొతున్నపుడు
మేఘాలు దయతో నీ వొక్కడి మీదే కురిసిన వర్షాన్ని
అపురూపంగా దోసిట్లోనూ, కనుపాపల్లోనూ, నాలుక మీదనూ
దాచుకోవడాన్ని ఊహించాగలవా ?"

                  "లేదు- ఊహించ లేను"

"మట్టిలో నీవు సుకుమారంగా నాటి
నీరు పోసి, మమకారంతో  పెంచిన పూల మొక్క
వొకనాడు ఆప్యాయంగా నీకో పూవుని అందించడాన్ని ఊహించ గలవా?"

          "లేదు- ఊహించ లేను...
           ఊహలు కూడా భయపెడతాయి నన్ను
           శ్రమించడమూ-శరా ఘాతాల నుండి తప్పించు కోవడమే
           నేర్చుకున్న యంత్ర జీవితం,
          ఊహలు కలలుగా మారతాయనీ
          కలలు ఒకనాడు భస్మమై దుక్కాన్ని మిగుల్చుతాయనీ కలవర పరచింది ....
          వూహలు, వూహలు గానే మిగిలి
          గొంతు కిందే అడిమిపట్టిన అనుభూతులైనాయి
          ప్రేమ...ఒక చేరువ కాని ఒయాసిస్సు నాకు"

ఒక మెరుపు తీగని తన చేప కన్నుల వెనుక
రహస్యంగా దాచి, ఆమె అడిగింది-

"ప్రేమించబడడం సరే... ప్రేమించ గలవా నువ్వు?
నేను నా పురా స్మృతుల్లో జీవిస్తునానని
చెప్పినా ప్రేమించ గలవా నువ్వు?
ప్రేమానుభూతి వొక్క సారే కలుగుతుందని
చెప్పినా సరే, ప్రేమించగాలవా నువ్వు?
నిన్ను నేను ప్రేమించకపోయినా
నన్ను ప్రేమించ గలవా నువ్వు?"

                "ప్రేమించగలను ......
                అవ్యక్త అనుభూతుల్ని బయటకు లాగి 
                వొక జలపాతమవాలని వుంది 
                జలపాత సంగీతంతో నిన్ను మురిపించాలని వుంది 
                నన్ను నేను విడుదల చేసుకోవాలని వుంది 
                శీతాకాలపు పొర్ణమి రాత్రి వెన్నెలనీ 
                మేఘాలు దయతో కురిసే వర్షాన్ని దాచుకోవదాన్నీ 
                నీవు నా చేయి పట్టుకుని, 
                వొకింత ప్రేమతో చూపించే మధుర క్షణం కోసం 
                ఎన్నాళ్ళయినా యెదురు చూడాలని వుంది..."

నా అరచేతిని మెత్తని తన అర చేతి లోకి తీసుకుని 
ఒక రహస్య దరహాస రేఖని పెదాల మీద ధరించి 
నాస్తెంకా నిష్క్రమించింది 
* * * *

'ప్రేమ అంటే ఏమిటి?'
.........................
'ఒక్క నిన్ను తప్ప 
మరి దేన్నీ వూహించ లేకపోవడం'

('ఆక్వేరియం లో బంగారు చేప' సంకలనం నుండి ....మే నెల - 2000 సం.  ఆదివారం ఆంద్రజ్యోతి )

* నాస్తెంకా - దోస్తవిస్కి 'శ్వేత రాత్రులు' కథ లోని అమ్మాయి పేరు 
** శంషాద్ బేగం-పాత తరం హిందీ సినిమా గాయని