17, అక్టోబర్ 2011, సోమవారం

బాల్యమిత్రుడి ఫోన్ కాల్ (వరంగల్ నుండి)


బాల్యమిత్రుడి ఫోన్ కాల్ 
(వరంగల్ నుండి)

ఎట్లున్నావ్ రా ?... చాల రోజులయింది మాట్లాడి..
హైదరాబాద్ ఎట్లున్నది...?
ఉస్మానియా దగ్గర దప్ప లొల్లి లేదని రాస్తున్నరు
మన హైదరాబాదుల మన గొంతులే వినిపించనిస్తలేరా ?

గీ నడుమ నువ్ వొచ్చుంటే 
మన వరంగల్ సూశి పరేషాన్ అయ్యేతోనివి

1969 సంగతి మనం సూడలేదు
అప్పుడు గూడ గింత లొల్లులు  లేవని 
పెద్దోల్లందరు అంటున్నరు

బట్టలు గుట్టె మేరోల్లు, బుట్టలల్లె మేదరోల్లు
జుట్లు గత్తిరించే మంగలోల్లు, బట్టలుతికే సాకలోల్లు
మాదిగోల్లు, మాలోల్లు, కోమట్లు, బాపనోళ్ళు, తుర్కోల్లు
అందరికందరు రోడ్ల మీదకొచ్చి ఊరేగింపులు దీస్తున్నరు


పోచమ్మ మైదాన్, హన్మకొండ చౌరస్తా,
వరంగల్ చౌరస్తా, నక్కలగుట్ట ...ఎక్కడ సూడు
రోడ్ల మీదనే బతుకమ్మలు ఆడుతున్నరు
పోలీసోల్లకు గుడ ఏం జేయాల్నో సమజైత లేదు

టీచర్లు, డాక్టర్లు, ఇంజినీర్లు, లాయర్లు
సడువుకున్నోల్లు, సడువుకోనోల్లు
అన్ని రంగుల పార్టీలోళ్ళు
అందరు ఒక్కటైన్ద్రురా నాయినా ...!

ఎవ్వలినెవ్వలు బలవంతం జెయ్యలే
గడువలు బట్టుకుని బతిమిలాడలె
యియ్యాల యిక్కడ యిది అందరి తండ్లాట 

యిన్నేళ్ళ సంది కలిసుంటె
మన పొలాలల్ల మన్ను బోసిరి
మన మాటల బట్టుకుని బనాయించిరి
యిగనన్న మన జాగల మనం బతుకుదామంటే
వాళ్ళ కండ్లల్ల నిప్పులు బోసుకోబడితిరి
'యిది మీదేట్లయితది' ...'అది మీదేట్లయితది' 
అని నఖరాలు జేయబడితిరి.....
'మేమే గరీబోల్లమై పోయినం ' అని
ఉల్టాచోర్ మాటలు జెప్పబట్టిరి
నువ్వే జెప్పు....గవర్మెంటు ఆఫీసులల్ల
అటెండరు నుండి ఆఫీసర్ దాక మనోల్లెందరు?

యియ్యాల యిక్కడ లడాయి శురువయిందిరా  నాయినా
యిగ యిది ఆగేడిది గాదు...ఆపెడిది గాదు
గద్దెల మీదకొచ్చిన సమ్మక్క సారలమ్మలు 
యింగ ఇప్పుడప్పుడే అడవిలకు పోయేటిది లేదు...

[2009 లో రాసుకున్న కవిత...వార్తలో అచ్చయింది...2011 లో కూడా మార్పు లేదు..]