25, సెప్టెంబర్ 2011, ఆదివారం

అరుణ్ సాగర్ 'మియర్ మేల్' పుస్తకం పై నా సమీక్ష ['వార్త' -25 సెప్టెంబర్-2011]


పుస్తక సమీక్ష
ఈ కవితలు పురుషులకోసమట....!
మియర్ మేల్
అరుణ్ సాగర్ తొలి కవితా సంకలనం 'మాక్సీమమ్ రిస్క్' చదివిన వాళ్లకి, ఆ పుస్తకం రూపు రేఖలు ఇంకా మరచిపోని వాళ్ళని, తన ఈ రెండవ కవితా సంకలనం 'మియర్ మేల్' ని చేతుల్లోకి తీసుకోగానే పెద్దగా విస్మయానికి గురి చేసే అవకాశం లేదు. ఈ పుస్తకం కూడా చిత్ర విచిత్రమైన ఛాయాచిత్రాలతో, సినిమా తారల బొమ్మలతో, విభిన్నమైన కవర్ పేజి తో, వొక మల్టిమీడియా ప్రదర్శనగా  కనిపిస్తుంది. అరుణ్ సాగర్ మరి కాస్త ముందుకు పోయి, తన ఇదివరకటి కవిత్వాన్ని 'మెట్రో సెక్సువల్ కవిత్వం' అని ముద్దుగా పిలుచుకున్నట్టు, ఈ సంకలనానికి శీర్షిక కింద 'పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు' అని వొక ఉప శీర్షిక తగిలించాడు ['ట్యాగ్ లైన్' అని రాస్తే తప్ప అర్థం కాని కాలం లోకి వొచ్చేసామా? ]. అయితే, పుస్తకం కవర్ పేజి గా 'ఇద్దరు పురుషుల్ని తుపాకీ తో చంపేసి, వాళ్ళ మృతదేహాలని వొక చెట్టు మీద పడవేసి, ఠీవిగా నిలుచున్న స్త్రీ'  బొమ్మ చూసినపుడు, చిట్టచివరి పేజీలో కవి పోస్టర్ వున్న ఫోటో కింద రాసిన చిలిపి రాతల్ని చదివినపుడూ, కవి లోని కొంటెతనం అర్థమవుతుంది. తదనంతరం, పుస్తక పుటల్లోకి ప్రయాణించాక మరింతగా అర్థమవుతుంది. 'పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు' అన్నాడు గానీ, "మియర్ మేల్" అన్న పుస్తక శీర్షిక దగ్గర నుంచి, సంకలనం లోని దాదాపు 70 % కవితలకు శీర్షికలు తెలుగేతర భాషల్లో కనిపిస్తాయి. 'వన్స్ బిటెన్',  'నీలే గగన్ కే తలే', 'ఫింగర్ ప్రింట్స్'లాంటివి కొన్ని ఉదాహరణలు మాత్రమే! ఇక కవిత్వం లోపల కవి ఇంగ్లీష్ భాషని యధేచ్చగా ఉపయోగించాడు. ఉదాహరణకి, తెలుగు సినిమా హీరోయిన్ 'ఇలియానా' మీద రాసిన కవిత ఇలా ముగుస్తుంది.
"హావెంట్ యు ఎవర్ స్పాటేడ్ ద నింఫ్?
టెస్ట్ లెస్ రూస్ట్ !
ఎలియాన్ కాదురా....
ఇలియానా!" ['సాలభంజిక']    

ఇంతకీ ఈ కవిత్వాన్ని ఏమని పిలవాలి ? సీతారాం అన్నట్టు "మెట్రో కవి రెట్రో వేదన" అని పిలుద్దామా?...లేక, “అన్న ప్రసాదమూర్తి మాటలా "ఆధునికానంతర  గ్రహాంతర ప్రేమ (?) కవిత్వం" అని పిలుద్దామా ? .... సరే, ఇలా వొకరి కవిత్వం గురించి 'ముందు మాట' లేక 'తదనంతర మాట' కొంత అభిమానంతో చెప్పవలసిన  వాళ్ళు (లేక) కవిత్వ పరామర్శ చేయవలసిన వాళ్ళు ఇలాంటి labeling కోసం వెదుక్కోవడం సహజమే.

అయితే, ఇక్కడ స్వయంగా కవే తన కవిత్వానికి వొక  labeling వేసుకునే బాధ్యతను తీసుకున్నట్టు తోస్తుంది. "డు ఇట్ దిఫరెంట్లీ" అన్న పాపులర్ వ్యక్తిత్వ పాటాలను ఫాలో అయినట్టు అనిపిస్తుంది.  అది 'పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు'  అనే ఉప శీర్షికలో మాత్రమే వున్నట్టు కనిపించినా, 'దాదాపు' పుస్తకం నిండా అరుణ్ సాగర్ 'నా కవిత్వం విభిన్నమైనది' అని చెప్పడానికి చేసిన వొక ప్రయత్నం కనిపిస్తుంది. నిజానికి, కవులెవరైనా ఎంతో కొంత తనది 'విభిన్నమైన కవిత్వం' అనే విశ్వాసంతోనే ఉంటారనుకుంటాను. కాకపోతే, 'విభిన్నం' లోని 'విభిన్నం' పాలు ఎంత అన్నది అంతిమంగా కాలం  కోర్టులో తేలుతుంది.

ఈ పుస్తకం లోని కొన్ని పాదాలు పాటకులని షాక్ కి గురి చేస్తాయి [విస్మయం' అని అంటే అది తేలిక మాటగా తేలిపోతుందేమో?] .కొన్ని ఉదాహరణలు చూడండి-

"నిన్ను గట్టిగా వాటేసుకుంటా
ముద్దుపెట్టుకుంటా /నలిపి పడేస్తా
ఓలమ్మీ తిక్క రేగిందా"   [టచ్: ది పబ్]

"ప్రేమినీ పిశాచీ
నేనెవరినీ కడుపు చేసి వదిలేయ లేదే !" [ ఫింగర్ ప్రింట్స్]

సీతారాం అభ్యర్థించినట్టు, 'సీతారాం అర్థం మీద ఆధార పడకుండా', కవి తానుగా వీటిని 'పోయెమ్స్ ఫర్ మెన్ ఇన్ తెలుగు' అని చెప్పుకున్నాడు కదా అని  మళ్ళీ చదివినపుడు నాకు ఉత్పన్నమైన వొక ప్రశ్న..."ఏ పురుషుల కోసం?" అని! ఈ పంక్తులు చదవండి.

"దుర్గం చెరువు మాటున
సేక్రేట్ లేక్ వొడ్డున ఒరుసుకు పోయిన రహస్యాలు
నువ్వు వాడివి , నేను దాన్ని" [డెవిల్ ఇన్ ది ఫ్లెష్]

నిజానికి, ఇదంతా అరుణ్ సాగర్ కవిత్వం లోని ఒక పార్శ్వం మాత్రమే !
తన బాల్య స్మృతులనీ, భద్రాచలం అమాయక గిరిజనులతో తన అనుబంధాన్నీ, విద్యార్థి దశ లోని తన అనుభవాలనీ పంచుకున్న కవితలు చదివినపుడు తన హృదయం ఎక్కడుందో అర్థమవుతుంది. తనే చెప్పినట్టు " ఆఫ్టరాల్ అవర్ హార్ట్ ఇస్ ఆన్ ది లెఫ్ట్"...మరి, ఈ రహస్యం తెలిసిన కవి ఎందుకు మన ముందు ఈ ప్రదర్శన పెడుతున్నట్టు?

కనుమరుగు కానున్న పాపికొండల మీద రాసిన "మరణ వాంగ్మూలం" లో మన గుండెల్ని మెలి పెట్టే ఈ పంక్తుల్ని చదవండి-
"రామా/ఇలా రా/నా పక్కన కూర్చో
నాతో కలిసి/ఈ మట్టి మరణ వాంగ్మూలం విను
దమ్మక్క పెడుతున్న శాపనార్థాలు విను/వినరా విను!
సీలేరు వొడ్డున విరుగుతున్న విల్లు
ఫెతఫెతెల్ ద్వానాల్ విను/వినరా విను!" 

అలాగే, "భ్రమరమోహం" కవిత లో "బాల్యం చెక్కిన చిత్రం/బతుకు కిటికీలో భద్రం" అన్న సున్నితమైన మాటల్ని చదవండి.

ఇంతకీ, ఈ కవిత్వాన్ని 'ప్రయోగ కవిత్వం' అందామా?
 "విషాదమేమంటే, తెలుగు కవిత్వంలో ప్రయోగావాద కవిత్వం పట్ల అమితమైన అనవసర అసహనమే వ్యక్తపరిచారు విమర్శకులు" అని సీతారాం తన అసహనాన్ని వ్యక్తపరిచాడు గానీ, నిజానికి, మితిమీరిన ప్రయోగాల పేరిట, లబ్ధ ప్రతిష్టులుగా పేరుపొందిన కొందరు సీరియస్ కవులు   "సాహిత్యాన్ని చదువుకుని, కవిత్వం పట్ల కాస్త ప్రేమను చూపించే మధ్యతరగతి" ని కూడా విజయవంతంగా కవిత్వానికి దూరం చేయడంలో, ఇతర కవి సమూహాలతో పాటు, తమ వంతు పాత్రనీ పోషించారని నా అభిప్రాయం. అసలు విషాదం ఏమిటంటే, "ఇవాళ సామాన్య ప్రజల్లో కవిత్వం పట్ల గౌరవం వుందంటే, అది సినిమా పాటల వల్ల, సినిమా కవుల వల్ల"  అనే వొక బాధ్యతారాహిత్య ప్రచారం ఇటీవలి విషాదం !   

అయితే, 'సాలభంజిక', 'వన్స్ బిటెన్' లాంటి కవితలు  చూపించి, "ప్రయోగం" అని అనుకోమంటే అనుకోగలమా !...అక్కడే ఆగిపోతే, మనం అరుణ్ సాగర్ కవిత్వాన్ని పాక్షికంగానే చదివినట్టు. తన ఉద్యోగ జీవితం నుండి, అక్కడి వాతావరణం నుండి రాసిన 't r p ', లాంటి కవితలు చదవండి. ఈ పంక్తులు చదవండి.

"ఎన్ని గ్యాలన్ల నెత్తురు పోస్తే మీ కార్లు పరిగెడతాయి?
ఎన్నెన్ని మాంస ఖండాలను పిండితే మీ ఆయిల్ దాహం తీరుతుంది?" [నెత్తుటి ఋణము]   

కుల గజ్జిని వెక్కిరిస్తూ ఈ సంకలనంలో 'కులగ్యుల' అని వొక కవిత కొత్త అభివ్యక్తులతో సాగుతుంది. కానీ, కవిత చివర వున్న ఈ పాదాలు చదవండి-

"కుల ధృవీకరణ పత్రాల్ని
కుప్పలు పోసి తగలేస్తాను
అయినా చాలకపోతే
నిన్ను ఎమ్మార్వో ఆఫీసు ముందు పాతరేస్తాను.."

సమకాలీన తెలుగు సమాజంలో అగ్రకుల సమూహాలు తమ కుల గజ్జి దురదను రాజకీయ, సామాజిక, సాంస్కృతిక వేదికల మీద బహిరంగంగా గోక్కోవడం ద్వారా దళిత, బహుజన కుల సమూహాలు కూడా తమ తమ కులాల పట్ల assertive గా ఉండక తప్పని దుస్థితిని కల్పించాయి. కాబట్టి, ఈ నేరం అగ్ర కులాలదే!....కవీ!...ఇలాంటి స్థితిలో ఎమ్మార్వో ఆఫీసు ముందు ఎవరిని పాతరేస్తావు? 
మందు కొడితే ఎక్కే కిక్కు లాంటి కవితలే కాదు, హృదయాన్ని వొక కుదుపుకు గురి చేసే కవితలు కూడా వున్న ఈ 'మియర్ మేల్' సంకలనం, కవిత్వ పాటకులు తప్పకుండా చదవ వలసినది .
['వార్త -ఆదివారం అనుబంధం'-తేది-25 సెప్టెంబర్-2011 ]

11, సెప్టెంబర్ 2011, ఆదివారం

గణేష్ నిమజ్జనం … హైదరాబాద్ -2011


గణేష్ నిమజ్జనం హైదరాబాద్ -2011

వరంగల్ లో వుండే రోజుల్లో హైదరాబాద్ లో భారీ ఎత్తున జరిగే గణేష్ నిమజ్జన ఉత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనే వొక బలమైన కోరిక వుండేది నాకు. 1998 సంవత్సరంలో బదిలీ మీద హైదరాబాద్ చేరుకున్నాక  ఆ కోరిక తీరింది. అందులోనూ, నేను అద్దెకి దిగిన గది కవాడిగూడ లో వుండేది. కవాడిగూడ నుండి ట్యాంక్ బండ్ కి నడిచి వెళ్ళేంత దూరం. అలా హైదరాబాద్  లో దిగిన తొలి  ఏడాది లో వొచ్చిన గణేష్ నిమజ్జనం రోజునాటి రాత్రి చాలా పొద్దు పోయే వరకూ [తెల తెల వారే వరకూ] అక్కడే గడిపి, అక్కడికి తరలి వొచ్చిన భారీ వినాయకులు నిమజ్జనం అవుతూ వుంటే చూడడం....ఆ జన సందోహం .... అదో మరిచిపోలేని అనుభవం.....

వరంగల్, హైదరాబాద్ తదితర తెలంగాణా పట్టణాలలో రంజాన్ రోజా దినాలలో మజీదులకు వెళ్ళే హిందువులు, గణేష్ నవరాత్రులను, నిమజ్జన ఉత్సవాన్ని హిందూ మిత్రులతో కలిసి చేసే ముస్లిములు కొల్లలుగా కనిపిస్తారు. ప్రభుత్వ కార్యాలయాలలో రంజాన్ తదుపరి రోజు ముస్లిములు తమ హిందూ మిత్రులకు సేమియా పాయసం పంచడం .... అలాగే, దసరా తరవాత రోజున హిందువులు, ముస్లిములు 'అలాయ్ బలాయ్' తీసుకోవడం వంటి దృశ్యాలు ఈ పట్టణాలలో చాలా సాధారణం, ఇప్పటికీ...

సరే...ఈ తడవ గణేష్ నిమజ్జన ఉత్సవానికి నా వరకు నాకు వొక ప్రత్యేకత వుంది. ఈ సారి నాలుగో తరగతి చదువుతోన్న మా పాప 'కృష్ణ ప్రియ' తో కలిసి ఈ నిమజ్జనం చూడడానికి వెళ్లాను.  నిమజ్జనం రోజున ట్యాంక్ బండ్ మీద అలా నడిచి వెళుతూ వుంటే భలే చిత్రంగా వుంటుంది...'రోజూ క్షణం తీరిక లేకుండా పరుగులు తీసే వాహనాలని మోసే, ట్రాఫిక్ తో నిండి వుండే ఈ ట్యాంక్ బండ్ మీదేనా ఇప్పుడు మనం ఇలా తీరిగ్గా వెలుతున్నాము' అనిపిస్తుంది
ఇంతకీ .... 'తెలంగాణా ఇస్తే ఇక్కడ మత కలహాలు పెరుగుతాయిఅని అరిచే వాళ్ళు   ఈ రంజాన్వినాయక నవరాత్రి దినాలలో హైదరాబాద్ వీధులలో తిరిగి వుంటే  కాస్త జ్ఞానం అబ్బి వుండేది అని ఎందుకో అనిపించింది. మనలో మాట....మీలో ఎవరికైనా కూడా అలా అనిపించిందా?.... 







      

ఖజురహో




ఖజురహో
దేహతంత్రుల సంగీతం విన్పించే రంగస్థలిపై నడక
అనాచ్చాదిత శరీరాల వినూత్న భాష శిల్పీకరించబడిన
గోడల పుటలపై రెండు కన్నుల ఆత్రపు కదలిక
సకలాంగాలనీ సమ్మోహన పరిచే కామోత్సవ గీతిక

'మోక్షసాధన మార్గం ఈ దేహం
దేహమే వొక అనాది దేవాలయం'
తాంత్రిక వేదాంత సారం ప్రతిధ్వనించే ప్రాంగణం

అకస్మాత్తుగా కుట్టి అతలాకుతలం చేసే
వొక మాయా వృశ్చికం
చర్మపు పొరల కింద, పొగలు చిమ్ముతూ సాగే
రక్తనదీ ప్రవాహాల సలసలార్భాటం
రోమాంచిత దేహశకలాల్లోంచి, ఆవలిస్తూ లేచే
వొక Adam కోరిక ఆరాటం

ఇపుడొక పరిచిత దరహాస పతాక ధరించిన
అపరిచిత దేహంతో గుసగుసగా సంభాషించాలి
గుప్పిట మూసిన సౌందర్య పరిమళ రహస్యాన్ని
లలిత లలితంగా చేదించాలి
వొక ఆత్మ నుండి మరొక ఆత్మ లోకి ప్రయాణించి
నాకు నేనే సరికొత్తగా పరిచయం కావాలి

రెండు నిమిషాల conscious యాంత్రిక చర్య కాదు
ఆనందపుటంచులు తాకాల్సిన
Sub -conscious క్రీడని
కంప్యూటర్ కాలానికి జ్ఞాపకం చేస్తూ
ఖజురహో...ఖజురహో...!


[వెయ్యేళ్ళ ఖజురహోని చూసిన ఉక్కిరిబిక్కిరిలో]

[ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రిక - 09 .04 .1999..."ఆక్వేరియం లో బంగారుచేప" సంకలనం నుండి]