19, జులై 2011, మంగళవారం

కోల్డ్ వార్

painting by AKBAR


అతడు ... ఆమె ... పిల్లలు ... ఒక చిన్ని ప్రపంచం
అప్పటిదాకా అలా హాయిగా
సెలయేటి మీది నావలా సాగిపోయే ప్రపంచం
సముద్రపు అలలు ఢీకొన్న పడవలా తిరగబడుతుంది
వేసవికాలపు సాయంత్రాలు
ఏటి వొడ్డున షికారు చేసిన
సుస్వర యుగళగీతమేదో రెండు ముక్కలై
శీతాకాలపు నిశిరాత్రి
ఏకాంత విషాదగీతాలుగా పొటమరిస్తుంది

***

యుద్ధం రాబోతున్న సంకేతమేదీ వుండదు
ఒక్కోసారి యుద్ధం మొదలైందన్న సంగతే తెలీదు
మాటల యుద్ధం మొదలయ్యేక
అతడే ప్రారంభించాడని ఆమే ...
ఆమే ప్రారంభించిందని అతడూ ...
పరస్పర నిందారోపణల రుసరుసలు
రెండు అధికార కేంద్రాల నడుమ
అంతర్యుద్ధంలో నలిగిన ప్రజల్లా పిల్లలు

***

కొంత ముందుకు సాగేక
యుద్ధాన్ని సృష్టించిన కారణాలు మాయమవుతాయి
అప్పటిదాకా సాగిన ఇద్దరి ప్రయాణంలోని
పూల పరిమళం మరుగునపడి
ముళ్లగాయాల ఏకరువు మొదలవుతుంది
ఇక మామూలు అస్త్రశస్త్రాలు వొదిలి
దాచిన బ్రహ్మాస్త్రాలతో దాడి ...

అపుడెపుడో అతడివైపు వాళ్లు
అవమానించిన గతాన్ని తవ్విపోస్తూ ఆమె
తన ఫీలింగ్స్‌ని ఆమె పట్టించుకోని
పాతరోజుల్ని తిరగేస్తూ అతడు
ఇరువేపులా మోహరించిన శత్రుసైన్యాల్లా
ఇద్దరి మాటలూ ...
అన్ని అస్త్రశస్త్రాలూ ఆవిరయ్యాక
ఒకరి పట్ల ఒకరికి ప్రేమలేదని
ప్రకటించేసుకుంటారు
ఇక ఇద్దరి నడుమా
గడ్డకట్టిన మాటల గోడ వొకటి ...

***

పరాయిగూట్లో వాలిన పక్షుల్లా
ఇంట్లో ఇద్దరూ అలా అసహనంగా ...
గ్రహాంతరవాసుల్ని చూసినట్లు
వాళ్లని గమనిస్తూ పిల్లలు ...
గలగల మాటల పిచ్చుకలేవీ వాలక
మోడువారిపోయే ఇంట్లో గదులు ...
ఎదుట నిలిచి కళ్లలోకి చూసే ధైర్యముండదు
విడిచి దూరంగా వెళ్లే ద్వేషముండదు
కాలం గడిచేకొద్దీ
గోడకు ఇరువేపులా నిలబడి
అది ధ్వంసమయే క్షణానికై
ఎదురుచూస్తూ వాళ్లిద్దరూ ...

***

చొరవ అతడిదో, లేక ఆమెదో
ఒక చిరునవ్వో, ఒక క్షమాపణో, మరేదో ...
త్వరగానే గోడ ధ్వంసమైపోతుంది
తిరిగి ఇంట్లోని గదులన్నీ
మాటల గలగలల్లో తేలియాడుతూ ...
లోలోపల దాగిన ప్రేమలు
ఒక్కసారిగా పొంగి వుక్కిరిబిక్కిరి చేస్తూ ...
భీకరయుద్ధం సాగిన మరకలేవీ
మచ్చుకైనా ఇంట్లో కనిపించవు



[courtesy-ఆదివారం ఆంధ్రజ్యోతి : 03 జూలై 2011]

18, జులై 2011, సోమవారం

నగరంలో ఒక ఉదయం













పరుగు చక్రాలు పాదాలకు తగిలించి 
రోజూ లాగే బయల్దేరిన నగరం
ఏ కూడలి దగ్గరో ఆకస్మికంగా 
కాసేపు ఆపివేయబడుతుంది

భుజమ్మీద కండువాలతో, నగ్న పాదాలతో 
దుమ్ము కొట్టుకుపోయిన దుస్తులతో 
ప్లకార్డులు, జెండాలు పట్టుకున్న
పల్లెటూరి నాగళ్ళు కొన్ని 
కూడలి రోడ్ల మీద కూర్చుని 
ధర్మాగ్రహ నినాదాలై రెపరెపలాడుతుంటాయి... 

కూడలి దగ్గర ఆగిన నగరం
రవంత తొంగి చూసి, వెను వెంటనే 
అసహన వాహన హారన్లై అరుస్తుంది
నినాదాల హోరులో అరుపులు ఆవిరై పోతాయి...

ఇక ఇపుడపుడే కదల్లెమని గ్రహించి
జ్ఞాని ఎవరో తర్కం అందుకుంటాడు...
"ఈ కూడలిలో నిలబడి 
సంధించే ప్రశ్నలు...ప్రకటించే నిరసనలు
గాలిలో కలిసిపోవడమే తప్ప
గమ్యానికి చేర్చవని
ఈ మట్టి బుర్రలకు తట్టదా?"

కూడలి మీది మనుషుల గుంపుని చేదించి
ముందుకు దూక ప్రయత్నించి
విఫలమైన సాహసి వొకడు అంటాడు..
"పనీ పాటా లేని పల్లె
పొద్దున్నే నగరంలోకి జొరబడి
విలువైన నగర సమయాన్ని ద్వంసిస్తోంది" 

జ్ఞానులారా!...సాహసులారా!!
కాసేపు మన అసహన కుబుసాల్ని వొదిలి
అల్లంత దూరాల నుండి
తమ బాధల మూటలు మోసుకొచ్చి 
ఈ కూడలిలో విప్పి పరచిన 
మట్టి మనుషుల గోడు ఏదో వినలేమా....?

పొలమూ...విత్తనాలూ...ఎరువులూ...
ఆకాశం దయతో కురిసే వర్షమూ తప్ప 
మరో లోకం లేని వాళ్ళు కదా
తమ లోకం విడిచి
ఈ నగర మాయాలోకంలోకి 
యిట్లా బాధల మూటలతో 
వాళ్ళు మాత్రం ఇష్టంగా వస్తారా?

ఊళ్ళని మైక్రో బ్రోకర్ భూతాలకీ
నల్ల బజారు ఎరువుల, విత్తనాల దెయ్యాలకీ వొదిలి 
అక్కడ బురద మట్టిలో శ్రమించే కాళ్ళూ చేతుల 
రాతల్ని నిర్ణయించే రావణ శిరసులు మాత్రం 
నగరంలో కొలువై వున్నాక
ఇక్కడికి కాక మరెక్కడికి వెల్లమంటారు?

తాము దయతో పండించే 
తిండిగింజల్ని తిని 
వెర్రి పరుగులు తీసే ఈ నగరం
కాసింతయినా కరుణ చూపిస్తుందని కదా
ఈ మట్టి పాదాలు ఇక్కడి దాకా ప్రయాణించింది...

జ్ఞానులు ఎవరయినా  వాళ్లకు తెలియజేయండి...
ఈ నిర్దయ నిర్లజ్జ నగరం 
తన రాకాసి బాహువులు చాపి
మిగిలిన మీ మీ పొలాలని కూడా
అనకొండలా మింగివేయబోతోందని...

ఏదో వొకనాడు
మళ్ళీ ఈ నగరమంతా
మట్టి పాదాల మీద మోకరిల్లి 
"ఇక ఈ నేల నేలంతా మీదే...
మాకు కొన్ని తిండి గింజల్ని ప్రసాదించండి"
అని చేతులు జోడించి ప్రార్థించే రోజొకటి వొచ్చేవరకు....
ఫరవాలేదు....
ఈ అసహన హారన్ లను మోగించండి....
బిగ్గరగా....మరింత బిగ్గరగా....

[courtesy : ఆంధ్రజ్యోతి - నవ్య దీపావళి సంచిక-2010 ]

14, జులై 2011, గురువారం

అనంతపురం కవిత్వంతో వొక రోజు

నా కొత్త పుస్తకం 'అనంతరం' కు 10 జూలై రోజున అనంతపురం లో ఉమ్మడిశెట్టి -2010 పురస్కారం [కవి రాధేయ గారు 23 ఏళ్ళ క్రితం స్థాపించింది ] స్వీకరించాను ...ఇది నా తొలి పురస్కారం...ఇంతకు క్రితం వరకూ పురస్కారాల కోసం పుస్తకాలు పంపించడం అన్న  ఆలోచన ఎందుకో నచ్చక కొంత దూరంగా వున్నాను...సరే...ఈ సారి మాత్రం ఈ విధంగానైనా వేరే ప్రాంతంలో వున్న నలుగురు సాహిత్య మిత్రుల్ని కలవొచ్చు కదా అని నా ఆలోచనను కొంత మార్చుకున్నాను...

అనంతపురం సభ మరిచిపోలేని వొక అందమైన అనుభవం...రాధేయ గారు స్వయంగా కవి అయి వుంది కూడా, కేవలం కవిత్వం పట్లా, కవుల పట్లా ఇంత ప్రేమతో ఇన్నేళ్ళుగా ...ఇంత నిజాయితీగా ఈ పురస్కారాన్ని నిర్వహించడం అభినందనీయం...ముఖ్యంగా ...ఆ రోజు రాధేయ గారి ఇంటికి అందరమూ కలిసి మధ్యాహ్న భోజనానికి వెళ్ళినపుడు అనిపించింది..అభినందించావలసింది వొక్క రాధేయ గారినే కాదు...ఆయన కుటుంబాన్ని కూడా అని...మరీ ముఖ్యంగా ...అక్కడ రాధేయ గారూ, మరి కొందరు మిత్రులూ కలిసి సృష్టించిన గొప్ప సాహిత్య వాతావరణం నన్ను ముగ్ధుణ్ణి చేసింది....

ఆ రోజున రాధేయ గారి ఇంట్లో జరిగిన కవి సమ్మేళనం లో చిలుకూరి దీవెన [ప్రముఖ రచయిత దేవపుత్ర గారి అమ్మాయి] ..సీమ నుంచి 'అరకు' చూడడానికి వెళ్ళిన వొక అమ్మాయి కోణం నుంచి మంచి కవిత చదివింది...అలాగే ..మరి కొందరు యువకవులు కూడా గొప్ప ప్రామిసింగ్ గా కనిపించారు...కాకపోతే...కవిత్వం తో వొచ్చిన చిక్కు ఏమిటంటే ...నాలుగు జీవం నింపుకున్న వాక్యాలని నీకు ఇవ్వడానికి, అది నీ జీవిత కాలాన్ని ఫణంగా పెట్టమంటుంది...

అనంతపురం ఆతిధ్యాన్ని మరిచిపోలేను...వీలయితే ...వొక అనంతపురం సాహిత్య సభకు మీరూ వెళ్లి రండి....!  

 రాధేయ, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, విహారి గార్లతో నేను..

13, జులై 2011, బుధవారం

అనంతరం -ఆవిష్కరణ సభ-16 October-2010


'అనంతరం' నా మూడవ కవితా సంపుటి. ఈ పుస్తకానికి 'ఆవిష్కరణ సభ' పెట్టాలా, వొద్దా అన్న మీమాంస కొంత ఉండింది...అయితే, ఈ పుస్తకాన్ని నాకు ఎంతో ఇష్టులైన కాళోజీ సోదరులకు అంకితం ఇవ్వాలని అనుకోవడం వలన ...నారాయణ రెడ్డి గారు ఆవిష్కరిస్తే కొంత అర్థవంతంగా వుంటుంది అనుకున్నాను ..అదీగాక,,,నేను వరంగల్ REC లో చదివే రోజుల్లో వొక సారి ఏదో సెమినార్ కి వొచ్చిన నారాయణ రెడ్డి గారిని నేనే కాళోజి సోదరుల ఇంటికి తీసుకు వెళ్లాను...అప్పుడు ఆయన మాతో చాలా సేపు కాళోజీ ల ఇంట జరిగిన మిత్రమండలి లలో తాను కవిత్వం చదివిన జ్ఞాపకాలని నెమరు వేసుకున్నారు ... ఆ సన్నివేశం ఎందుకో అలా నా మనసులో అపురూపంగా నిలిచిపోయింది..మొదటి పుస్తకం 'వాతావరణం'...1997 లో కాళోజీ గారు ఆవిష్కరించారు..రెండవ పుస్తకం 'ఆక్వేరియం లో బంగారు చేప'...డిసెంబర్ 2000  లో వరవర రావు గారు ఆవిష్కరించాలి గానీ, చివరి నిమిషం లో మార్పు జరిగి దర్భశయనం ఆవిష్కరించారు..   



సరే...అనుకోవడమైతే అనుకున్నాను గానీ ఆయన్ని ఎలా పిలవాలా అని చిన్న సందేహం....[వ్యక్తిగతంగా నాకు ఆయనతో పరిచయం లేదు] ...శివారెడ్డి గారినీ, దర్భశయనం గారినీ అడిగితే 'నువ్వే పిలువు' అన్నారు...కొంత తటపటాయిస్తూనే ఫోన్ చేసాను...ఫోనులో నారాయణ రెడ్డి గారు నేను తనకు ఎంతో కాలంగా పరిచయం వున్నట్టు receive చేసుకున్న విధం నన్ను కొంత ఆశ్చర్యానికి గురి చేసింది...అంతే గాక, ఆయన 'మరే ఇతర వివరాలూ అడగకుండా' ...'నా పాత్ర ఏమిటి?'...అని మాత్రమె అడిగి, 'ఫలానా రోజు నాకు ఖాళీ వుంది' అని చెప్పడం మరింత ఆశ్చర్యంగా అనిపించింది...

ఇక చివరి ఆశ్చర్యాలు మరి రెండు వున్నాయి...సభ సాయంత్రం ఆరు గంటలకు అని చెబితే, సరిగ్గా ఆరు గంటలకు వొచ్చి వున్నారు...[నిజానికి, major ఆక్సిడెంట్ అవడం మూలాన నారాయణ రెడ్డి గారు మనిషి సాయం లేకుండా కూర్చోలేని స్థితి లో వున్నారు]...సభ మొత్తం అయిపోయే దాకా వున్నారు..శివారెడ్డి గారు అధ్యక్షులు ...దర్భశయనం వక్త ...గుడిపాటి స్వాగతం ...ఇదీ నా  చిన్న సభ ఆ రోజు..'సభ కొంత ఆలస్యంగా మొదలవుతుంది' అని చెబితే ...శివారెడ్డి గారినీ, దర్భశయనం గారినీ చూపిస్తూ..'ఫరవా లేదు..నేను కాసేపు వీళ్ళతో గడుపుతాను' అన్నారు  

చివరి ఆశ్చర్యం వొకటి వుందన్నాను కదా......నారాయణ రెడ్డి గారు తనకు ఇచ్చిన పుస్తకాన్ని మొత్తం చదివి, తనకు బాగా నచ్చిన కవితల దగ్గర 'notes  రాసుకుని రావడం...  
నిజానికి ఆరోజు శివారెడ్డి గారికి ఆరోగ్యం అసలు బాగోలేదు...వొంట్లో బాగోలేనట్టుగా వుంటే రావొద్దని కూడా అంటే ఆయన సమాధానం 'శివారెడ్డి వేదిక ఎక్కే వరకే ఇట్టాంటి గొడవలు...'....that is shiva reddy....ఆ రోజు ...I felt, I am honoured....ఇలాంటి మహానుభావుల నుండి ప్రవహించిన  ఈ కవిత్వ వారసత్వం, మా తరం నుండి విజయవంతంగా ముందుకు వెళుతుందా?

ఏం చేస్తావు నువ్వు?


యంత్ర జీవితం వొక ఎడతెగని ఎండా కాలంలా
దేహాత్మలను దహించి వేసే దప్పిక దినాలలో.....

 ఒక ఉదయం కిటికీ పక్కన చెట్ల ఆకుల మీద
సందడిగా జారి, ఆటలాడే వర్షపు చినుకులు
నీ కనుల మీది నిదురతెర తొలగించి
గది లోపల బందీగా పడి వున్న నిన్ను 
ప్రేమతో ఆట లోకి ఆహ్వానిస్తాయి .....

కాలం నది మీద కొట్టుకుపోయిన కాగితం పడవ ఏదో
వొక కలలా నిన్ను పలకరిస్తుంది ..వొక లిప్త పాటు

 చినుకుల్ని చుంబించిన మట్టి సౌరభమేదో
నిన్ను మంత్రించి, బంధ విముక్తుడిని చేసి
అలా బయటకు నడిపిస్తుంది.
నడక మెలకువలోనా? లేక నిదురలోనా?

అనంతాకాశం నుండి భూమిపై (లేక, నీపై)
దయగా కురిసే గొప్ప వాత్సల్యం.....
తడిసిన అందాలతో పచ్చగా నవ్వే చెట్లు...
కాసేపలా నీ రెండు అరచేతులతో చినుకుల్ని పైకి ఎగరేస్తూ…..
మరి కాసేపు నీ మొహాన్ని చినుకులకు అప్పగించి
'వొక నాలుగు ముద్దులు పెట్టండే' అని ప్రాధేయపడుతూ…..

జీవితం ఇక్కడ ఆగిపోతే బాగుండుననుకుంటావు కదా…..
నిన్ను మళ్ళీ నీ పాత గోతాములో కట్టి
ఇంటి లోనికి విసిరేసి….
కాగితం పడవ నవ్వుకుంటూ మాయమైపోతుంది….
* * * *
ఏం చేస్తావు నువ్వు?....
గోతాములో ఊపిరి సలపక ఉక్కిరిబిక్కిరౌతూ ...
వర్షపు చినుకుల్ని ఉదయాన్నే పలకరించిన దరిద్రమని తిట్టుకుంటూ ...
నీ యంత్ర జీవితంలోకి నిష్క్రమిస్తావు ...

ఎడతెగని ఎండాకాలాలు పూర్తిగా
దహించి వేసిన దేహాత్మలు నీవి...
ఏ వాత్సల్య వర్షాలూ వాటికి పునర్జన్మను ప్రసాదించలేవు

1, జులై 2011, శుక్రవారం

కేరళ-తుంచన్ ఉత్సవం-2010

కేరళలో ఏటా జరిగే 'తుంచన్ ఉత్సవం' లో మలయాళీల ఆదికవి 'తుంచన్' ఉపయోగించిన ఘంటాన్ని(stylus)  యిలా వీధుల్లో ఊరేగిస్తారు...ఈ ఊరేగింపులో వివిధ భాషల నుండి ఆహ్వానింపబడిన కవులతో పాటు ప్రసిద్ధ మలయాళ కవులు, రచయితలు పాల్గొంటారు...ఇలాంటి వొక అరుదైన దృశ్యాన్ని తెలుగు నేల మీద నా చిన్నతనంలో 'పోతన శత జయంతి' ఉత్సవాల సందర్భంగా వరంగల్లో చూసాను...ఇక పైన ఇలాంటి అపురూప దృశ్యాన్ని చూస్తానన్న ఆశ లేదు...మీకెవరికైనా ఉందా?