18, డిసెంబర్ 2011, ఆదివారం

ఇటీవలి సంబరం



ఇటీవలి సంబరం

వర్షానికి తడిసీ, ఎండకు వెలిసిపోయీ
అలా రంగులు కోల్పోయిన చాయాచిత్రంలా వుండే
మా మేడ టెర్రస్ పైన వొక కొత్త సంబరం...

ఉదయాన్నే రెక్కలు టపటపలాడిస్తూ
హడావుడిగా వాలిపోయిన అతిథుల గుంపు...
తలల్ని వొయ్యారంగా అటూ ఇటూ తిప్పుతూ
కువకువల రాగాలతో కుశలం అడుగుతూ ....
టెర్రస్ ని నలుపు తెలుపు రంగుల్ని మేళవించిన
అందమైన తైల వర్ణ చిత్రం చేస్తూ...

ఎక్కడివీ అనుకోని అందమైన అతిధులు...
ఏ ఆహ్వానం లేకుండా మా లోగిల్లో వాలిన
గగనసీమ బాటసారులు …..
పొద్దున్నే మబ్బు మబ్బుగా విచ్చుకున్న నేత్రాలనీ
వాహనాల రొదల మధ్య తెరుచుకున్న చక్షువులనీ
తమ వొయ్యారాల నడకలతో
కువకువల సంగీతంతో శుభ్రపరుస్తూ...

నడుమ నడుమ అవి తలలెత్తి
దేని కోసమో, లేక ఎవరి కోసమో
అసహన పాదాలై కాసేపు హడావుడి చేస్తూ...

ఇంతలో, ఒక చేతిలో గింజల గిన్నె
మరొక చేతిలో నీళ్ళ గిన్నె పట్టుకుని
అడుగులో అడుగేసుకుంటూ
మేడ పైకి నెమ్మదిగా వొచ్చిన
ఎనిమిదేళ్ళ మా పాప


సుదీర్ఘ విరామం తరువాత
తల్లిని చూసిన ఆనందంతో చుట్టుముట్టే పిల్లల్లా
మా పాప చుట్టూ ఈ బుల్లి అతిథులు .....

తన బుల్లి అతిథులకు వడ్డించడం పూర్తి చేసి,
నా చుట్టూ చేతులు వేసి, మా పాప అంది:
'అమ్మమ్మ చెప్పింది...అవి ఆకలితో ఉంటాయని...
ఎవ్వరూ నాలుగు గింజలు పెట్టకపోతే
పాపం...అవి ఆకలితో చచ్చిపోతాయి కదా..'

చిట్టితల్లీ...!
కరుణ నిండిన ఇలాంటి నాలుగు మాటలేవో
మా అమ్మమ్మో, మా నాయనమ్మో, మా అమ్మో
నా బాల్యంలో నాకూ చెప్పినట్టు
పుస్తక పుటల్లో పోగొట్టుకున్న నెమలీక లాంటి జ్ఞాపకం ...
[ఆంద్ర ప్రభ -సాహితీ గవాక్షం: 13  ఫిబ్రవరి 2012  ]

17 కామెంట్‌లు:

  1. "తన బుల్లి అతిథులకు వడ్డించడం పూర్తి చేసి,
    నా చుట్టూ చేతులు వేసి, మా పాప అంది:
    'అమ్మమ్మ చెప్పింది...అవి ఆకలితో ఉంటాయని...
    ఎవ్వరూ నాలుగు గింజలు పెట్టకపోతే
    పాపం...అవి ఆకలితో చచ్చిపోతాయి కదా..'

    - విజయ్, ఇది విజయ్ మార్కు! బాగుంది. అనుబంధాల మధ్య మీ కవిత్వ అల్లిక ఎప్పుడూ వొక మెరుపు తీగ నాకు.

    రిప్లయితొలగించండి
  2. కొన్ని లైన్లు ప్రత్యేకంగా బావున్నాయి విజయ్ గారు...అభినందనలు

    రిప్లయితొలగించండి
  3. నడుమ నడుమ అవి తలలెత్తి
    దేని కోసమో, లేక ఎవరి కోసమో
    అసహన పాదాలై... liked it, vijay.

    రిప్లయితొలగించండి
  4. నడుమ నడుమ అవి తలలెత్తి
    దేని కోసమో, లేక ఎవరి కోసమో
    అసహన పాదాలై.... liked it Vijay!

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. Very good expression, Vijay. 'Sambaram'not only for u but also all of us after reading ur poem. humanity is safe in the hands of gennext. nicely expressed how we r teaching the kids, the values we learnt from elders. touching. keep it up.

    రిప్లయితొలగించండి
  7. మస్తిష్కపు పొరల్లో దాగిన జ్ఞాపకాల్ని
    అక్షరాలుగా పొదిగిన మీరు అభినందనీయులు

    రిప్లయితొలగించండి
  8. సర్
    చాలా బాగుంది"చిట్టితల్లీ...!
    కరుణ నిండిన ఇలాంటి నాలుగు మాటలేవో
    మా అమ్మమ్మో, మా నాయనమ్మో, మా అమ్మో
    నా బాల్యంలో నాకూ చెప్పినట్టు
    పుస్తక పుటల్లో పోగొట్టుకున్న నెమలీక లాంటి జ్ఞాపకం ...".
    చాలా బాగుందండీ...

    రిప్లయితొలగించండి
  9. సర్
    చాలా బాగుంది"చిట్టితల్లీ...!
    కరుణ నిండిన ఇలాంటి నాలుగు మాటలేవో
    మా అమ్మమ్మో, మా నాయనమ్మో, మా అమ్మో
    నా బాల్యంలో నాకూ చెప్పినట్టు
    పుస్తక పుటల్లో పోగొట్టుకున్న నెమలీక లాంటి జ్ఞాపకం ...".
    చాలా బాగుందండీ...

    రిప్లయితొలగించండి
  10. నెమలీక వంటి జ్నాపకం ....నిజమే కదూ ....మన బాల్యాన్ని పిల్లల్లో చూసుకుంటూ ....్చాల బాగుంది విజయ్ ....అభినందనలు ...ప్రేమతో...జగతి

    రిప్లయితొలగించండి